
తిరుమల భక్తులకు టీటీడీ బంపర్ ఆఫర్..ఇక శ్రీవారి సన్నిధిలో శుభకార్యాల సందడే సందడి
Tirumala : తిరుమల పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మరో అద్భుతమైన శుభవార్త చెప్పింది. కలియుగ వైకుంఠంలో స్వామివారి చెంత శుభకార్యాలు జరుపుకోవాలని ప్రతి భక్తుడు ఆరాటపడతాడు. భక్తుల మనోభావాలను గుర్తించిన టీటీడీ, ఇప్పుడు తిరుమల కొండపైనే వివిధ రకాల పూజలు, వేడుకలు నిర్వహించుకునే వెసులుబాటును కల్పించింది. ఇకపై కేవలం వివాహాలే కాకుండా, అన్నప్రాసన నుంచి అక్షరాభ్యాసం వరకు అన్నింటినీ శ్రీవారి సన్నిధిలో శాస్త్రోక్తంగా జరుపుకోవచ్చు.
సాధారణంగా తిరుమలలో కేవలం శ్రీవారి కళ్యాణం లేదా వ్యక్తిగత వివాహాలు మాత్రమే ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు టీటీడీ పరిధిలోని పురోహిత సంఘం ఆధ్వర్యంలో భక్తులు తమ సొంత పూజా కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చు. తిరుమలలోని కళ్యాణ వేదిక వద్ద ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఇక్కడ పురోహితులు హిందూ శాస్త్రాల ప్రకారం.. మంత్రోచ్ఛారణల మధ్య పవిత్రంగా పూజలు నిర్వహిస్తారు. తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలన్నా, లేదా కొత్తగా కొన్న వాహనానికి పూజ చేయించాలన్నా భక్తులు ఇకపై ఊరిలో పంతులు గారి కోసం వెతుక్కోవాల్సిన పనిలేదు, నేరుగా కొండపైనే ఈ పనులు పూర్తి చేసుకోవచ్చు.
సామాన్య భక్తులకు భారమవ్వకూడదనే ఉద్దేశంతో టీటీడీ చాలా తక్కువ ధరలనే నిర్ణయించింది. కేవలం వందల రూపాయల ఖర్చుతోనే శ్రీవారి సమక్షంలో పవిత్ర కార్యక్రమాలు ముగించుకోవచ్చు. తిరుమలలో వివాహం చేసుకోవడం ఇప్పటికీ ఉచితం. ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకుంటే కళ్యాణ మండపంతో పాటు నూతన వధూవరులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం కూడా కల్పిస్తారు.
నామకరణం (పేరు పెట్టడం), అన్నప్రాసన, అక్షరాభ్యాసం వంటి కార్యక్రమాలకు కేవలం రూ.200 మాత్రమే ఫీజుగా నిర్ణయించారు. చెవిపోగులు కుట్టడానికి కేవలం రూ.50 మాత్రమే. సత్యనారాయణ వ్రతం, ఉపనయనం వంటి వాటికి రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. వాహన పూజ, దస్త్ర పూజ,ఇతర ధార్మిక కార్యక్రమాలకు రూ.200 చొప్పున ఫీజు ఉంటుంది.
చాలామంది భక్తులు కొత్త వాహనం కొనగానే తిరుమల శ్రీవారి పాదాల చెంత పూజ చేయించాలని మొక్కుకుంటారు. ఇప్పటివరకు కొండపై దీనికి ఒక పద్ధతి లేక భక్తులు ఇబ్బంది పడేవారు. ఇప్పుడు టీటీడీ అధికారికంగా కళ్యాణ వేదిక వద్ద పురోహితులను కేటాయించింది. కారు, బైక్ లేదా ఇతర వాహనాలకు కేవలం రూ.200 చెల్లించి శాస్త్రోక్తంగా పూజ చేయించుకోవచ్చు. దీనివల్ల భక్తులకు మానసిక ప్రశాంతతతో పాటు స్వామివారి ఆశీస్సులు మెండుగా లభిస్తాయని టీటీడీ పేర్కొంది.
ఈ సేవలు పొందాలనుకునే భక్తులు తిరుమల కొండపై ఉన్న పురోహిత సంఘాన్ని ఆశ్రయించాల్సి ఉంటుంది. కళ్యాణ వేదిక వద్ద ఉన్న కౌంటర్లలో నిర్ణీత రుసుము చెల్లించి రసీదు పొందాలి. అక్కడ ఉండే పురోహితులు మీకు కావాల్సిన పూజా సామాగ్రి వివరాలు తెలిపి, కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. మంగళవాయిద్యాలు కావాలనుకునే వారు కూడా సింగిల్ సెట్ కు రూ.100, డబుల్ సెట్ కు రూ.300 చెల్లించి ఆ సేవను పొందవచ్చు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




