గోదావరిలో మూడోరోజు ముగిసిన ఆపరేషన్‌..ఇవాళ 22 మృతదేహాలు వెలికితీత

గోదావరిలో మూడోరోజు ముగిసిన ఆపరేషన్‌..ఇవాళ 22 మృతదేహాలు వెలికితీత
x
Highlights

గోదావరిలో మూడోరోజూ గాలింపు చర్యలు కొనసాగాయి. ఎన్టీఆర్ఎఫ్, నేవీ, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు హెలికాప్టర్లతో గోదావరిని జల్లెడపట్టాయి. అయితే, కచ్చులూరు దగ్గర...

గోదావరిలో మూడోరోజూ గాలింపు చర్యలు కొనసాగాయి. ఎన్టీఆర్ఎఫ్, నేవీ, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు హెలికాప్టర్లతో గోదావరిని జల్లెడపట్టాయి. అయితే, కచ్చులూరు దగ్గర లంగరు వేసి బోటును కదపడంతో మృతదేహాలు బయటికి వస్తున్నాయి. దాంతో ఇవాళ 22 మృతదేహాలను వెలికితీశారు. ఈరోజు వెలికితీసిన 22 మృతదేహాల్లో ఐదుగురిని తెలంగాణవాసులుగా గుర్తించారు. అందులో రంగారెడ్డికి చెందిన సాయికుమార్‌ వరంగల్‌‌కి చెందిన గడ్డమీద సునీల్‌, బసిక వెంకటయ్య, గొర్రె రాజేందర్‌ అలాగే నల్గొండకి చెందిన పాశం తరుణ్‌రెడ్డిగా గుర్తించారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

మరోవైపు, రెండ్రోజులుగా రాజమండ్రిలో మకాం వేసిన తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్‌, ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఏపీ మంత్రులతో కలిసి హెలికాప్టర్ ద్వారా ఎర్రబెల్లి, పువ్వాడ ఏరియల్ సర్వే నిర్వహించారు.

కచ్చులూరు దగ్గర నదీగర్భంలో బోటు ఆచూకీని కనుగొన్న ఎన్డీఆర్ఎఫ్ దాన్ని బయటికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, 200కి పైగా అడుగుల లోతుకి బోటు దిగిపోవడంతో బయటికి తీయడం కష్టతరంగా మారింది. అయితే, బోటులో ఇరుక్కున్న మృతదేహాలను బయటికి తీసేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ప్రయత్నిస్తున్నాయి.

ఇప్పటివరకు మొత్తం 30 మృతదేహాలను వెలికితీయగా, 18 డెడ్‌బాడీస్‌కు పోస్టుమార్టం పూర్తిచేసి బంధువులకు అప్పగించారు. అనంతరం ప్రత్యేక అంబులెన్సుల్లో మృతదేహాలను స్వస్థలాలకు తరలిస్తున్నారు. అయితే డెడ్‌బాడీస్‌ యొక్క రిపోర్ట్ రాయడానికి ఒక్కో మృతదేహానికి ఒక ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు చొప్పున నియమించారు.

మునిగిపోయిన బోటులో మొత్తం 73మంది ఉండగా, 26మంది ప్రాణాలతో బయటపడ్డారు. అలాగే, ఇప్పటివరకు 30 మృతదేహాలను వెలికితీశారు. దాంతో ఇంకా 17మంది ఆచూకీ లభించాల్సి ఉంది. ఇక ఇప్పటివరకు వెలికితీసిన మృతదేహాల్లో 20మందిని గుర్తించారు.

ఒకవైపు భారీ వర్షం మరోవైపు చీకటి పడటంతో గోదావరిలో మూడోరోజు గాలింపు చర్యలు నిలిచిపోయాయి. తిరిగి రేపు ఉదయం ఆపరేషన్స్ మొదలుపెట్టనున్నారు. అయితే, మిగతా మృతదేహాలు కూడా బోటులోనే ఇరుక్కుని ఉంటాయని భావిస్తున్నారు. దాంతో బోటులో ఇరుక్కున్న మృతదేహాలను వెలికితీసేందుకు నేవీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ ప్రయత్నిస్తున్నాయి. అయితే, లోతైన నదీగర్భంలో బోటు మునిగిపోవడంతో బయటికి తీయడం కష్టమేనంటున్నారు అధికారులు.

బోటును బయటికి తీసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ప్రమాదంపై విచారణ జరుగుతోందన్న సవాంగ్ వారం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడినవారు చెబుతున్న వివరాల ఆధారంగా రిపోర్ట్ సిద్ధం చేస్తున్నట్లు తెలిపిన డీజీపీ బాధ్యులందరిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories