Anakapalli: వరద నీటిలో మునిగిన అనకాపల్లి తహసీల్దార్ కార్యాలయం

Anakapalli: వరద నీటిలో మునిగిన అనకాపల్లి తహసీల్దార్ కార్యాలయం
x

Anakapalli: వరద నీటిలో మునిగిన అనకాపల్లి తహసీల్దార్ కార్యాలయం

Highlights

వరద నీటిలో అనకాపల్లి తహశీల్దార్ కార్యాలయం కూలేందుకు సిద్ధంగా భవనం నీటిలో నానుతున్న రైతుల ఫైళ్లు పూర్తిస్థాయి అధికారి లేక అవస్థలు

అనకాపల్లి జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం అస్తవ్యస్తంగా మారింది. అది ప్రభుత్వ కార్యాలయమా లేక పాడుబడిన భవనమా అని ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. తాజాగా కురుస్తున్న వర్షాలకు ఆఫీస్ మొత్తం చెరువును తలపిస్తోంది. ఎప్పుడు కూలుతుందో తెలియని ఆ శిథిల భవనంలో... సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వహిస్తున్నారు.


​అనకాపల్లిలో కురుస్తున్న వర్షాలకు తహసీల్దార్ కార్యాలయం మొత్తం నీట మునిగింది. భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో, వర్షపు నీరు నేరుగా రికార్డు రూమ్‌లోకి చేరుతోంది. దీంతో రూరల్ ప్రాంత రైతులకు చెందిన అత్యంత కీలకమైన భూ రికార్డులు, పట్టాదారు పాసు పుస్తకాల ఫైళ్లు తడిసి ముద్దయ్యాయి. ముఖ్యమైన పత్రాలన్నీ వర్షపు నీటిలో కలిసిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


​ఆఫీసులో పనిచేస్తున్న సిబ్బంది పరిస్థితి దయనీయంగా మారింది. ఎప్పుడు పైకప్పు పెచ్చులు ఊడిపడతాయో, ఏ క్షణాన భవనం కూలిపోతుందోనని భయం భయంగా పని చేస్తున్నారు. పనుల కోసం కార్యాలయానికి వస్తున్న ప్రజలు, ఆఫీస్ దుస్థితిని చూసి లోపలికి వెళ్లాలంటేనే జంకుతున్నారు. జిల్లా హెడ్ క్వార్టర్‌లో ఒక ముఖ్యమైన కార్యాలయం ఇంత దారుణంగా ఉండటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమస్యలకు తోడు, పరిపాలనాపరమైన ఇబ్బందులు కూడా ప్రజలను వేధిస్తున్నాయి. రెండు నెలల నుంచి అనకాపల్లి తహసీల్దార్ కార్యాలయానికి పూర్తిస్థాయి అధికారి లేరు. ప్రస్తుతం డిప్యూటీ తహసీల్దార్‌తోనే కార్యకలాపాలు సాగుతున్నాయి. ఏ చిన్న పని కోసం వచ్చినా తహసీల్దార్ లేరు" అనే సమాధానమే వినిపిస్తుంది. రైతులు, సామాన్య ప్రజలు నిరాశతో వెనుదిరిగిపోతున్నారు.


​తమ పత్రాలు నీటిపాలవుతుండటం, పనులు జరగకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని వారు కోరుతున్నారు. శిథిలావస్థలో ఉన్న ఈ కార్యాలయానికి మరమ్మతులు చేపట్టడం లేదా నూతన భవనానికి తరలించడం చేయాలంటున్నారు. రైతుల కీలక డాక్యుమెంట్లను భద్రపరచాలని, అన్నిటికంటే ముఖ్యంగా పూర్తిస్థాయి తహసీల్దార్‌ను నియమించి, ప్రజల ఇబ్బందులు తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories