Farmers: కౌలు రైతులకు మోయలేని భారంగా వ్యవసాయం

Farmers Facing Problems | Telugu News
x

Farmers: కౌలు రైతులకు మోయలేని భారంగా వ్యవసాయం

Highlights

Farmers: గుర్తింపు కార్డులను జారీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం

Farmers: కౌలు రైతులకు వ్యవసాయం మోయలేని భారంగా మారుతోంది. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా..కౌలు రైతుల బ్రతుకుల్లో మార్పు రావడం లేదు. ప్రభుత్వం పలు నిబంధనలు విధించడంతో గుర్తింపు కార్డులు జారీకాక నానా ఇబ్బందులు పడుతున్నారు.

అనకాపల్లి జిల్లాలో.. కౌలు రైతులకు గుర్తింపు కార్డులను జారీ చేస్తామని చెబుతున్న ప్రభుత్వం, పలు నిబంధనలు విధించింది. దీంతో.. ఆమోద పత్రాలు ఇవ్వడానికి భూ యజమానులు ముందుకు రావడంలేదు. దీంతో కౌలు రైతులకు అధికారులు గుర్తింపు కార్డులు జారీ చేయడంలేదు. ఫలితంగా బ్యాంకుల నుంచి పంట రుణాలు అందడంలేదు. రైతు భరోసా పథకం అమలుకు నోచుకోవడంలేదు. దీంతో రైతులు, ప్రభుత్వం నుంచి రాయితీపై విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు పొందలేని పరిస్థితి నెలకొంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోతే పరిహారం కూడా అందే పరిస్థితి లేదు. దీంతో పంటల సాగు కోసం అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తోంది. కౌలు రైతులందరికీ పంట రుణాలు అందేలా చూస్తామన్న పాలకుల మాటలు నీటిమూటలుగా మిగిలాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అనకాపల్లి జిల్లాలో సుమారు లక్ష హెక్టార్లలో వివిధ రకాల వ్యవసాయ పంటలను సాగు చేస్తుంటారు. అధికారుల గణాంకాల ప్రకారం రెండు లక్షల మందికిపైగా రైతులు వున్నారు.

ఖరీఫ్‌ సీజన్‌లో ప్రధాన పంట వరి. దాదాపు 90 శాతం విస్తీర్ణంలో నాట్లు పూర్తయ్యాయి. వరి సాగు చేసే రైతుల్లో ఎక్కువమంది కౌలు రైతులే ఉన్నారు. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ నిబంధనల ప్రకారం.. వరి సాగు చేసే రైతులకు ఎకరాకు 35నుంచి 38 వేల వరకు బ్యాంకులు పంట రుణాలు ఇవ్వాలి. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో కౌలు రైతులకు కూడా పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు, వ్యవసాయాధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ ఇప్పటి వరకు పది శాతం మందికి కూడా రుణాలు మంజూరు చేయలేదని సమాచారం. ఇందుకు సీసీఆర్‌ కార్డులు జారీ కాకపోవడమే ప్రధాన కారణమని కౌలు రైతులు వాపోతున్నారు.

ఇప్పటి ప్రభుత్వం 2011 కౌలు చట్టాన్ని పక్కనపెట్టి, 2019లో కొత్త కౌలు చట్టాన్ని తెచ్చింది. భూ యజమాని అంగీకార పత్రం ఇస్తేనే 'పంట సాగుదారుడి హక్కు పత్రం'జారీ చేయాలని స్పష్టం చేసింది. ఈ కార్డు ద్వారా బ్యాంకు నుంచి పంట రుణం తీసుకోవచ్చని చెప్పింది. కానీ బ్యాంకర్లు దీనికి మోకాలు అడ్డారు. కౌలు రైతు తీసుకున్న రుణం తిరిగి చెల్లించకపోతే భూ యజమాని నుంచి వసూలు చేయాల్సి వస్తుందని బ్యాంకు అధికారులు స్పష్టం చేశారు. అయితే నిబంధనలతో కౌలు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories