Fake Certificates: కదిలిన నకిలీ సర్టిఫికెట్ల డొంక.. సూత్రదారులు అరెస్టు

Fake Certificates: కదిలిన నకిలీ సర్టిఫికెట్ల డొంక.. సూత్రదారులు అరెస్టు
x

Fake Certificate Gang Bust in Visakhapatnam

Highlights

Fake Certificates | తీగ లాగితే డొంక కదిలినట్టయ్యింది వ్యవహారం. నకిలీ సర్టిఫికెట్ల బాగోతంలో సూత్రదారులు పట్టుబడ్డారు.

Fake Certificates | తీగ లాగితే డొంక కదిలినట్టయ్యింది వ్యవహారం. నకిలీ సర్టిఫికెట్ల బాగోతంలో సూత్రదారులు పట్టుబడ్డారు. ఇది మొత్తం విశాఖ కేంద్రంగా జరగడం విశేషం. ఒక్క విశాఖలోనే కాకుండా దేశ వ్యాప్తంగా పది రాష్ట్రాల్లో బ్రాంచిలు ప్రారంభించి, లక్షల సొమ్మును కాజేశారు. ఫెర్టిలైజర్ షాపు యాజమాని నకిలీ సర్టిఫికెట్లు కలిగి ఉన్నాడనే అనుమానంతో తీగ లాగితే ఈ డొంకంతా కదిలింది.

రెండేళ్లుగా 11 రాష్ట్రాల్లో 200కుపై బ్రాంచీలతో నడుస్తున్న టెక్నికల్‌ కోర్సుల నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠాను ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ నేతృత్వంలోని పోలీసు అధికారులు ఛేదించారు. నకిలీ సంస్థ ఏర్పాటు సూత్రధారితోపాటు మరో ఆరుగురిని అరెస్టు చేసి శనివారం మీడియా ముందు హాజరుపరిచారు. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలంలోని హనుమాన్‌ ఫెర్టిలైజర్స్‌ షాపుపై ఇటీవల విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహించారు. షాపులో సరుకుతోపాటు వ్యాపారి జంపని వెంకటేశ్వర్లు సర్టిఫికెట్లను పరిశీలించారు. అవి నకిలీవని నిర్ధారణ కావడంతో ఆ వ్యాపారిపై ఏవో సీహెచ్‌ ఆదినారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంకొల్లు సీఐ దీనిపై లోతుగా దర్యాప్తు చేయగా.. షాపు యజమాని రూ.10వేలకు నకిలీ సర్టిఫికెట్‌ను కొనుగోలు చేసినట్లు తేలింది. దీంతో దర్యాప్తును వేగవంతం చేశారు.

వైజాగ్‌ కేంద్రంగా.. జేఎన్‌టీసీ పేరుతో...

వైజాగ్‌కు చెందిన సిలారపు బాల శ్రీనివాసరావు సంపాదనపై ఆశతో 2017లో జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నికల్‌ సెంటర్‌(జేఎన్‌టీసీ) పేరుతో ఓ నకిలీ సంస్థను స్థాపించాడు. ఇందులో ఆయన సతీమణి సుజాత కూడా భాగస్వామి. మన రాష్ట్రంతో పాటు మొత్తం 11 రాష్ట్రాల్లో 200కుపైగా బ్రాంచీలు ప్రారంభించి నకిలీ దందా మొదలుపెట్టారు. ఒక్కో బ్రాంచి నుంచి రూ.లక్ష నుంచి 2 లక్షలు వసూలు చేశారు. మన రాష్ట్రంలో 1,855, మిగిలిన 10 రాష్ట్రాల్లో 382 మొత్తం 2,237 నకిలీ సర్టిఫికెట్లు విక్రయించారు.

హోటల్‌ అండ్‌ టూరిజం మేనేజ్‌మెంట్, ల్యాబ్‌ టెక్నీషియన్, ఏవియేషన్‌ హాస్పిటాలిటీ, ఫ్యాషన్‌ అండ్‌ ఇంటీరియర్‌ డెకరేషన్, ఫైర్‌ సేఫ్టీ, ప్రైమరీ టీచింగ్, హెల్త్‌కేర్‌ అనుబంధ రంగాలు, క్రిటికల్‌ విభాగమైన అనస్తీషియా, కార్డియాలజీ, ఈసీజీ, ఆప్తల్మాలజీ, కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ హార్డ్‌వేర్, వెటర్నరీ అసిస్టెంట్, ఫిట్‌నెస్, యోగా వంటి అనేక టెక్నికల్‌ కోర్సుల్లో 3 నెలల డిప్లొమా మొదలు మూడేళ్ల కోర్సు వరకు నకిలీ సర్టిఫికెట్లను రూ.వెయ్యి నుంచి రూ.లక్ష వరకు తీసుకుని అందజేసేవారు. నిందితులు జంపని వెంకటేశ్వర్లు (చింతలపూడి– యద్దనపూడి మండలం), సిద్ది శ్రీనివాసరెడ్డి (మర్లపాలెం–కురిచేడు), కోడూరి ప్రదీప్‌కుమార్‌ (ఈపూరుపాలెం–చీరాల), అనపర్తి క్రిస్టాఫర్‌ (ఇందుర్తినగర్‌–ఒంగోలు), బట్టపోతుల వెంకటేశ్వర్లు (యర్రగొండపాలెం), సిలారపు బాల శ్రీనివాసరావు, సిలారపు సుజాత (శంకరమఠం రోడ్‌– విశాఖ)లను పోలీసులు అరెస్టు చేశారు. సర్టిఫికెట్లతోపాటు కంప్యూటర్, ప్రింటర్, హార్డ్‌ డిస్క్, స్టాంపులు, హోలోగ్రాం, రిజిస్టర్లతోపాటు సంస్థ పేరుపై బ్యాంకులో ఉన్న రూ.5,47,537లను సీజ్‌ చేశారు.

నకిలీ సర్టిఫికెట్ల వినియోగంపై ప్రత్యేక దృష్టి

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసిన పోస్టుల్లో ఇలాంటి సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారు ఎవరైనా ఉన్నారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ తెలిపారు. ఈ కేసును ఛేదించిన పోలీస్‌ అధికారులు అల్తాఫ్‌ హుస్సేన్, ఎస్‌.చౌదరిలను ఎస్పీ అభినందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories