Tirumala: బ్ర‌హ్మోత్స‌వాల్లో గ‌జ‌రాజులు, అశ్వాలు, వృష‌భాల రాజ‌సం

Elephants At TTD Srivari Brahmotsavam | AP News
x

Tirumala: బ్ర‌హ్మోత్స‌వాల్లో గ‌జ‌రాజులు, అశ్వాలు, వృష‌భాల రాజ‌సం

Highlights

Tirumala: శ్రీ‌నిధికి 14 ఏళ్లు, ల‌క్ష్మీకి 45 ఏళ్లు, వాహ‌న‌సేవల కోసం ప్ర‌త్యేక శిక్ష‌ణ

Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాల సంబరంలో గజరాజులు, అశ్వాలు, వృషభాలది కీలకపాత్ర. స్వామి వారి వాహనసేవల్లో ఆ జంతువులదే తొలి అడుగు, అవే స్వామి వారి కంటే ముందు భక్తులను కనువిందు చేస్తాయి. సర్వాంగ సుందరంగా అలంకరించిన ఈ జంతువులు ఠీవిగా ముందుకు కదులుతూ స్వామివారు వస్తున్నారన్న సంకేతాన్ని తెలియజేస్తూ, శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలకు అట్టహాసం తెలియజేసే ఘనత వీటికే దక్కుతుంది.

తిరుమల పుణ్యక్షేత్రంలో ఏడాదికి ఓసారి జరిగే బ్రహ్మోత్సవాలు ప్రాసిస్త్యం అంతా ఇంత కాదు. స్వయంగా బ్రహ్మ దేవుడే భువిపైకి దిగి వచ్చి, సకల దేవతలతో కలిసి వైకుంఠనాధుడి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారని పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మోత్సవాలో సమయంలో స్వామి వారి కంటే ముందు ఆ జంతువులు స్వామి వారి బ్రహ్మోత్సవ వైభవాన్ని తెలియజేస్తూ ముందుకు కదులుతూ ఉంటాయి. అందులో ముందుగా చెప్పుకోదగింది గజం..గజరాజును ఐశ్వర్యానికి చిహ్నంగా పిలుస్తారు. శ్రీమహావిష్ణువు దేవేరి అయిన శ్రీ లక్ష్మీదేవి ఇష్టవాహనం కూడా ఏనుగే, శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీవేంకట్వేరుని వైభవాన్ని సిరిసంపదలకు సూచికలైన ఏనుగులు ఇతర జంతువులైన గుర్రాలు, వృషభాలతో కలిసి మరింత ఇనుమడింప చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న గజాల్లో 14 ఏళ్ల శ్రీనిధి అన్నిటికంటే చిన్నది. 45 ఏళ్ల లక్ష్మి అన్నిటికంటే పెద్దది. అయితే టీటీడీలో మొత్తం 7 ఏనుగులు వున్నాయి. వీటిని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి సేవకు, అలాగే గోవిందరాజస్వామి అనుబంధ ఆలయాలో సేవలుకు తరలిస్తారు.

ఏనుగుల సంరక్షణకు టీటీడీ ప్రత్యేక శ్రద్ద వహిస్తుంది..హార్మోన్లు విడుదల సమయంలో మగ ఏనుగులను అదుపు చేయడం కష్టతరంమైన విషయం కావడంతో.. ఆ సమయంలో ఈ కారణంగా ఎస్వీ గోశాల సంచాలకులకులు డాక్టర్ హరినాధ్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని అదుపు చేసే ప్రయత్నం చేస్తారు. ఏనుగులకు ప్రతీ రోజు ఆలయాల ఉత్సవ సేవలలో మరియు గోశాలలో నడక ద్వారా వ్యాయామం, శరీర మర్దన చేయటం, ప్రతి అరగంటకు ఒకసారి ఏనుగులకు ఆహారం అందించడంతో పాటు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఆలయ మాడవీధుల్లో వాహనసేవల సమయంలో శక్తివంతమైన విద్యుత్‌దీపాల వెలుగులు, కళాకారుల వాయిద్యాల శబ్దం నుంచి ఏనుగులకు ఉపశమనం కల్పించేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. కొన్ని రోజుల ముందు నుంచి పలురకాలుగా మచ్చిక చేసుకుని వీటిని బ్రహ్మోత్సవాలకు సమాయత్తం చేస్తారు.. ప్రతి 20 నిమిషాల కోసారి చెరుకుగడలు, నేపియర్‌ గ్రాసం అందిస్తారు.

బ్రహ్మోత్సవాల వాహనసేవల్లో వినియోగించే జంతువులకు తగిన శిక్షణ కూడా ఇస్తారు. మావటిలు తాళ్లు, అంకుశం, గొలుసులతో నిరంతరం అప్రమత్తంగా ఉండి గజరాజులను నియంత్రిస్తారు. జంతువులకు ఆరోగ్యపరీక్షలు నిర్వహించి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఊరేగింపులకు వినియోగిస్తారు. జంతువుల వెంట జంతుశాస్త్ర నిపుణులు కూడా ఉంటారు. అనుకోని సంఘటనలు జరిగినపుడు జంతువులను నియంత్రించేందుకు.. అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. మాడవీధుల్లో గజరాజులు తిరిగేందుకు ప్రత్యేక మార్గాన్ని కూడా రూపొందించడం విశేషం. ఏనుగులను అదుపు చేసేందుకు కేరళ నుంచి నిపుణులైన‌ పశువైద్యులను రప్పిస్తారు.

వాహనసేవల్లో పాల్గొనే జంతువులను ప్రత్యేకంగా అలంకరిస్తారు. గజరాజులను ముఖపట్టాతో పాటు రంగురంగుల బొంతలతో అలంకరిస్తారు. మావటిలు గొడుగులు, విసనకర్రలతో స్వామివారికి సేవ చేస్తూ ఉంటారు. గరుడసేవనాడు ప్రత్యేకంగా అలంకరిస్తారు. అశ్వాలు రాజసానికి చిహ్నాలు. వీటిని ముఖపట్టా, తలపై కుచ్చు, బొంతలు, మెడగజ్జలు, కాళ్లపట్టీలతో అలంకరిస్తారు. రైతన్నలకు నేస్తాలైన ధర్మానికి ప్రతీకగా నిలిచే వృషభాలను మెడలో నల్లతాడు, పూలహారాలు, గజ్జలు, బొంతలతో అలంకరిస్తారు. వాహనసేవల్లో ఈ జంతువులకు ఇష్టమైన రావి ఆకులు, మర్రి ఆకులు, రాగి సంకటి, చెరకు గడలను ఆహారంగా ఇస్తారు. మాడ వీధుల్లో తిరిగే సమయంలో క్రమం తప్పకుండా ఆహారాన్ని, ఆలయం వద్ద నీటిని అందిస్తూ ఉంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories