రాష్ట్రంలోని 3 ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం

రాష్ట్రంలోని విశాఖ ఎకనామిక్ రీజియన్ సహా మూడు ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) కె.విజయానంద్ చెప్పారు.

Siramdasu Nagarjuna
Published on: 17 Dec 2025 11:02 AM IST
రాష్ట్రంలోని 3  ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం
X

అమరావతి: రాష్ట్రంలోని విశాఖ ఎకనామిక్ రీజియన్ సహా మూడు ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) కె.విజయానంద్ చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ ఉదయం సచివాలయంలో 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. రెండు రోజులు జరిగే ఈ సదస్సులో సీఎస్ విజయానంద్ ప్రారంభోపన్యాసం చేశారు. పాలనా సమీక్షకు కలెక్టర్ల సదస్సు కీలక భూమిక పోషిస్తోందన్నారు. మొంథా సైక్లోన్ సమయంలో వేగంగా స్పందించిన జిల్లా కలెక్టర్లందరికీ అభినందనలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ దీర్ఘకాలిక లక్ష్యాలు, జిల్లాల అభివృద్ధి, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, ప్రజల్లో సంతృప్త స్థాయి వంటి అంశాలపై చర్చించుకుందామని సీఎం అన్నారు. ఆరు జిల్లాల కలెక్టర్లు తాము అవలంభించిన బెస్ట్ ప్రాక్టీసెస్ ను ప్రెజెంట్ చేయబోతున్నారని తెలిపారు. రహదారి భద్రతపై కూడా అంతా దృష్టి పెట్టాల్సి ఉందని, ఈ ఆంశంపైనా సమావేశాల్లో విస్తృతంగా చర్చించాల్సి ఉందని చెప్పారు.

పలు అంశాలపై సమీక్ష

జీఎస్డీపీ లక్ష్యాలు, కీ పార్ఫెమెన్స్ ఇండికేటర్లు, సుస్థిరాభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరగనుంది. కేంద్ర నిధులను వివిధ ప్రభుత్వ శాఖలు ఏ విధంగా వినియోగించాయి, యూసీలను ఏ మేరకు జారీ చేశాయనే అంశాలపై సమీక్ష చేస్తారు. సూపర్ సిక్స్ పథకాల అమలు, ఇ-ఆఫీస్, డేటా డ్రివెన్ గవర్నెన్స్, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై సీఎం చంద్రబాబు సమీక్షిస్తారు.

క్షేత్ర స్థాయిలో జిల్లా కలెక్టర్లు చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేస్తారు. ఈ సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా వివిధ శాఖల మంత్రులు పాల్గొన్నారు.

Siramdasu Nagarjuna

Siramdasu Nagarjuna

Next Story