Dasara 2020: తెప్పోత్సవంతో ఘనంగా ముగిసిన విజయవాడ కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు

Dasara 2020: తెప్పోత్సవంతో ఘనంగా ముగిసిన విజయవాడ కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు
x
Highlights

Dasara 2020: ఘనంగా ముగిసిన విజయవాడ అమ్మవారి దసరా ఉత్సవాలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇచ్చి భక్తులకు అమ్మవారు కనువిందు చేశారు. ఇక దసరా పండగ రోజు అమ్మవారికి తెప్పోత్సవ సేవను కనుల పండువగా నిర్వహించారు. అయితే, కరోనా వ్యాప్తి, ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి కారణంగా ఉత్సవమూర్తుల నదీ విహారాన్ని అధికారులు నిలిపివేశారు. దుర్గాఘాట్‌లోని నది ఒడ్డునే హంస వాహనంపై ఉత్సవ మూర్తులను ప్రతిష్ఠించి అర్చకులు పూజాధికాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆద్యంతం వైభవంగా సాగింది. దుర్గా ఘాట్‌లో కృష్ణా నదికి నిర్వహించిన హారతులు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం శమీ పూజ నిమిత్తం సంప్రదాయం ప్రకారం ఉత్సవమూర్తులను పాతబస్తీ ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దుర్గా ఘాట్‌లో నిర్వహించిన తెప్పోత్సవం కార్యక్రమంలో విజయవాడ నగర సీపీ బత్తిన శ్రీనివాసులు, దుర్గ గుడి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు, ఈవో సురేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

ఇక దసరా పండుగను పురస్కరించుకుని భక్తుల దర్శనం కోసం దేవస్థానం అధికారులు ప్రత్యెక ఏర్పాట్లు చేశారు. దసరా రోజు అమ్మవారు రాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. చెరుకుగడను వామహస్తంతో ధరించి దక్షిణ హస్తంతో అభయాన్ని ప్రసాదింపజేసే రూపంలో శ్రీషోడశాక్షరీ మహామంత్ర స్వరూపిణిగా శ్రీచక్రరాజ అధిష్టానదేవతగా వెలుగొందే శ్రీరాజరాజేశ్వరిదేవిని దర్శించి, అర్చించటం వలన మనకు సకల శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు.. భవానీ మాలదారులు వేలాదిగా వచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories