ఫోని తుఫాన్ : ఈదురుగాలులతో భారీ వర్షాలు.. 100 రైళ్లు రద్దు..

ఫోని తుఫాన్ : ఈదురుగాలులతో భారీ వర్షాలు.. 100 రైళ్లు రద్దు..
x
Highlights

బంగాళాఖాతంలో ఏర్పడిన ఫొని తుపాను రాష్ట్రంలో బీభత్సం సృష్టించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడిస్తోంది. ఈ పెను తుపాను ఉత్తరాంధ్ర, ఒడిశాలపై పెను...

బంగాళాఖాతంలో ఏర్పడిన ఫొని తుపాను రాష్ట్రంలో బీభత్సం సృష్టించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడిస్తోంది. ఈ పెను తుపాను ఉత్తరాంధ్ర, ఒడిశాలపై పెను ప్రభావం చూపడానికి దూసుకెళుతోంది. తుపాను, తీవ్ర తుపాను, అతి తీవ్ర తుపానుగా బలపడుతూ వచ్చి చివరకు పెను తుపానుగా మారింది. గంటకు 210 కిలోమీటర్ల వేగంతో వీచే భీకర గాలులు, భారీ వర్షాలతో ఎలాంటి ముప్పు తెచ్చి పెడుతుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 110 నుంచి 210 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచే ప్రమాదం ఉంది. 20 సెంటీమీటర్లకు మించిన అతి భారీ వర్షం కురవొచ్చు. ఒడిశాలోని గోపాల్‌పూర్‌-చాంద్‌బలి వద్ద పూరికి సమీపంలో తీరం దాటనున్న తుఫాన్‌.. శ్రీకాకుళం జిల్లాలోనూ పెను ప్రభావమే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

బారువ, వజ్రపుకొత్తూరు, భావనపాడు, కళింగపట్నంలలో ఇప్పటికే సముద్రం ఉగ్రరూపం దాల్చింది. అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. సాయంత్రం నుంచి జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. తుఫాన్ ఎఫెక్ట్‌తో సాయంత్రం నుంచి దాదాపు 100 రైళ్లు రద్దు చేస్తున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. ఇక 2014, అక్టోబర్‌లో విశాఖపట్నం జిల్లాలో హుద్‌హుద్‌ తుపాను తీరం దాటిన సందర్భంగా గంటకు 220 కిలోమీటర్ల ప్రచండ వేగంతో గాలులు విరుచుకుపడ్డాయి. అలాగే 2018, అక్టోబర్‌లో శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను తీరం దాటిన సందర్భంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి. తాజాగా 210 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలపడంతో ప్రజలు భయాందోనళ వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories