AP Elections 2021: ఉదయం 8 గంటల నుంచి పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు

Counting of Municipal Election Votes From Morning 8 am Today
x

Representational Image

Highlights

AP Elections 2021: 11 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఏర్పాట్లు

AP Elections 2021: ఏపీలో 12 కార్పొరేషన్లకు గాను 11 నగర పాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో పోలైన ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం నుంచి ఫలితాల వెల్లడి మొదలై సాయంత్రానికల్లా పూర్తి కానుంది. ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఈ నెల 18వ తేదీన సంబంధిత కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్‌పర్సన్లను ఎన్నుకోనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగినా.. ఓట్లు లెక్కించవద్దని హైకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మున్సిపాలిటీకి ఓట్లు లెక్కించినా ఫలితం ప్రకటించవద్దని నిర్దేశించింది. ఈ నేపథ్యంలో ఈ రెండు ఫలితాలూ వెలువడవు.

మరో వైపు ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు చేశారు. మొత్తం 4వేల 26 కౌంటింగ్‌ టేబుళ్లను ఎస్‌ఈసీ ఏర్పాటు చేసింది. వీటిల్లో నగర పాలక సంస్థల్లో 2వేల 204, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో 1,822 ఉన్నాయి. కౌంటింగ్‌ సూపర్‌వైజర్లుగా 4వేల 317 మందిని, లెక్కింపు సిబ్బందిగా 12వేల607 మంది నియమితులయ్యారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 20వేల 419 మంది పోలీసులను నియోగిస్తున్నారు. వీరిలో 172 మంది డీఎస్పీలు, 476 మంది సీఐలు, 1,345 మంది ఎస్సైలు ఉన్నారు.

అన్ని కౌంటింగ్‌ కేంద్రాల్లోనూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీడియో లేదా సీసీ కెమెరాలు లేదా వెబ్‌క్యాస్టింగ్‌ ద్వారా చిత్రీకరించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఆదేశాలిచ్చారు. మరీ అనివార్యమైతేనే తప్ప కౌంటింగ్‌ ఆదివారం రాత్రి 8 గంటల్లోపే పూర్తి చేయాలని ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఎటువంటి గందరగోళం, గోప్యానికి ఆస్కారం లేని విధంగా ఓట్ల లెక్కింపు జరపాలని గెలుపు మార్జిన్లు 9 ఓట్ల లోపు ఉంటేనే రీకౌంటింగ్‌కు ఆదేశించాలని రిటర్నింగ్‌, ఎలక్షన్‌ అధికారులను ఆదేశించారు.

ఒకవేళ మెజారిటీ రెండంకెల్లో ఉన్న చోట్ల ఎక్కడన్నా రీకౌంటింగ్‌ జరపాల్సిందిగా అభ్యర్థుల్లో ఎవరన్నా కోరితే.. సంబంధిత జిల్లా కలెక్టర్‌ లేదా జిల్లా ఎన్నికల అధికారికి వాస్తవాలను తెలిపి.. ఆ తర్వాతే మళ్లీ ఓట్ల లెక్కింపునకు ఆదేశాలివ్వాలని స్పష్టం చేశారు. స్ట్రాంగ్‌ రూంలు మరియు కౌంటింగ్‌ కేంద్రాల్లో తగినంత, నిరంతరాయ విద్యుత్‌ సరఫరాకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడినా ఇబ్బందులు తలెత్తకుండా.. జనరేటర్లు, ఇన్వర్టర్ల వంటి ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories