ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో పవన్‌ పర్యటన..

ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో పవన్‌ పర్యటన..
x
Highlights

తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కొత్తపాకలలో దివీస్‌ లేబరేటరీస్‌ నిర్మాణం రాజకీయంగా కాకరేపుతోంది.

తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కొత్తపాకలలో దివీస్‌ లేబరేటరీస్‌ నిర్మాణం రాజకీయంగా కాకరేపుతోంది. అధికార విపక్షాల మధ్య మంటలు రేపుతున్నాయి. దివీస్‌ యాజమాన్యం నిర్మించనున్న ఫార్మా కంపెనీని ఎట్టి పరిస్థితుల్లో రానీవ్వబోమని స్థానిక రైతులు, మత్స్యకారులు రెండు నెలలుగా ఆందోళన బాటపట్టారు. బాధితులకు అండగా జనసేన ఉద్యమిస్తుంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఇవాళ దివీస్‌ బాధిత ప్రాంతంలో పర్యటించనున్నారు. తొండంగి మండలంలో దివీస్‌ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మత్స్యకారులు, దళితులు, ఆ ప్రాంత ప్రజలకు మద్దతుగా నిలిచేందుకు పవన్ పర్యటిస్తున్నారని ఆ పార్టీ నేతలు తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నవరం నుంచి ర్యాలీగా కార్యకర్తలు, నాయకులతో దివీస్‌ పరిశ్రమ ఏర్పాటు ప్రాంతాన్ని పవన్ పరిశీలిస్తారని... అనంతరం తొండంగి మండలం కొత్తపాకలు గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నట్లు చెప్పారు. గత నెలలో జరిగిన ఉద్రిక్త పరిస్థితుల తర్వాత దివీస్‌ను అక్కడి నుంచి తరలించాలని ప్రభుత్వానికి పవన్‌కల్యాణ్‌ గడువు విధించారు. అయినా సర్కారు నుంచి స్పందన లేకపోవడంతో పర్యటనకు శ్రీకారం చుట్టారు.

తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం పరిధిలోకి వచ్చే తొండగి మండలంలో ఉన్న దివీస్‌ లేబరేటరీస్‌ మరోసారి వార్తల్లోకెక్కింది. ఈ ఫార్మా సంస్ధ విస్తరణ కోసం కొన్నేళ్లుగా జరుగుతున్న ప్రయత్నాలను స్ధానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వం కంపెనీ విస్తరణకు అనుమతులిచ్చింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ దివీస్ ల్యాబ్ ను ఎట్టిపరిస్థితుల్లో నిలిపేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చింది. అప్పుడు అనుమతి ఇచ్చిన టీడీపీ ఇప్పుడు వ్యతిరేకిస్తోంది. అప్పుడు వ్యతిరేకించిన వైసీపీ ఇప్పుడు కంపెనీకి సానుకూలంగా ఉంది. దీంతో రైతులు, గ్రామస్తులు 'జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.' అంటూ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఇటీవల ఇక్కడ ప్రజలు దివీస్ కంపెనీ మీద దాడి చేశారు. అక్కడ తాత్కాలిక షెడ్లకు నిప్పు పెట్టారు. ఈ అంశంపై తాజాగా పవన్ కళ్యాన్ అక్కడకు వెళ్లాలని నిర్ణయించారు.

దివీస్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా తలపెట్టిన సభకు మొదట అనుమతి నిరాకరించారు. అయితే కొన్ని గంటలపాటు ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్న తర్వాత...పర్యటనకు అనుమతి లభించినట్లు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అయితే పవన్‌ సభకు షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసినట్టు ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ తెలిపారు. సభకు వచ్చేవారు కొవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. ఎటువంటి అల్లర్లు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, హింసాత్మక చర్యలకు పాల్పడకూడదన్నారు. దివీస్‌ పరిసర ప్రాంతాల్లోకిగాని, లోపలికి వెళ్లేందుకుగాని ప్రయత్నించడంగాని, ఆస్తి నష్టం కలిగించే సంఘటనలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎటువంటి కార్యక్రమాలు చేయరాదన్నారు. బాణసంచా కాల్చకూడదన్నారు. కార్యక్రమం శాంతియుతంగా జరగడానికి పార్టీ నాయకులు, నిర్వాహకులు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. పరిస్థితులను బట్టి అనుమతిని ఎప్పుడైనా రద్దు చేసే అవకాశముందన్నారు.Show Full Article
Print Article
Next Story
More Stories