Kakinada: కాంగ్రెస్ శ్రేణులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: శైలజానాధ్

Kakinada: కాంగ్రెస్ శ్రేణులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: శైలజానాధ్
x
Highlights

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎస్ శైలజానాధ్, వర్కింగ్ అధ్యక్షులు తులసిరెడ్డి, మస్తాన్ వలి బుధవారం కాకినాడ విచ్చేశారు.

కాకినాడ: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎస్ శైలజానాధ్, వర్కింగ్ అధ్యక్షులు తులసిరెడ్డి, మస్తాన్ వలి బుధవారం కాకినాడ విచ్చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశంలో శైలజానాథ్ పార్టీ శ్రేణులు ఉద్దేశించి మాట్లాడుతూ ..కాంగ్రెస్ శ్రేణులు నేటి నుంచి కదన రంగం లోకి దూకాలనీ పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ చిన్న పిల్లవాడని, మార్కిస్టు స్వభావం కలిగిన చేగువేరా మొహాన్ని తొడుక్కుని, మత విద్వేషాలు రగిల్చిన బీజేపీ శరీరాన్నీ కప్పుకున్నారని ఆరోపించారు. రాజధానిగా అమరావతిని ప్రకటించినప్పుడు చంద్రబాబు, జగన్ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని, చంద్రబాబు ఆ ఒప్పందం అమలు చేయకపోవడంతో రాజధాని మార్పు ప్రకటించారని ఆరోపించారు.

వారిద్దరి మధ్య కుదిరిన ప్యాకేజీ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. మార్చి నెలాఖరు నాటికి కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తవుతుంది అన్నారు. ముఖ్యమంత్రి జగన్ కు ధైర్యం ఉంటే ఎన్ ఆర్ సి, సి ఎ ఏ లకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఢిల్లీలో ఓడిపోయాక జగన్ తో రహస్య ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆయనను పిలిచిందని శైలజానాథ్ ఆరోపించారు. గత ఎన్నికలకు ముందు తన ఎంపీలతో రాజీనామా చేయించిన జగన్ కు దమ్ముంటే ప్రత్యేక హోదా కోసం ప్రస్తుతం ఉన్న మొత్తం 22 మంది ఎంపీలతో రాజీనామా చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి పళ్లంరాజు, ఏఐసిసి కార్యదర్శి గిడుగు రుద్రరాజు, బిసి సెల్ రాష్ట్ర అధ్యక్షులు నులుకుర్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories