జోరుగా సాగిన కోడిపందాలు.. టెక్నాలజీని అద్భుతంగా వాడుకున్న పందెం రాయుళ్లు

జోరుగా సాగిన కోడిపందాలు.. టెక్నాలజీని అద్భుతంగా వాడుకున్న పందెం రాయుళ్లు
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో కోడిపందాలు జోరు మీద సాగాయ్‌. టెక్నాలజీ సాయంతో పందెంరాయుళ్లు సరికొత్త పంథాలో వెళ్లారు.

ఆంధ్రప్రదేశ్‌లో కోడిపందాలు జోరు మీద సాగాయ్‌. టెక్నాలజీ సాయంతో పందెంరాయుళ్లు సరికొత్త పంథాలో వెళ్లారు. భోగి రోజే బరిలోకి దిగి కోట్లు కొల్లగొట్టిన కోడి పందాలు హుషారుగా సాగాయి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కోడి పందేల జోష్‌ కనిపించింది. కోనసీమ ప్రాంతంలో ఒక్కరోజే 15 కోట్లమేర పందాలు జరిగాయి. ఒక్క వెస్ట్‌ గోదావరి జిల్లాలోనే 200 కోట్ల రూపాయలు చేతులు మారాయ్‌. అక్కడక్కడ గొడవలు జరిగినా పోలీసులు చాలా చోట్ల ప్రేక్షక పాత్రే పోషించాల్సి వచ్చింది.

కోనసీమలో కోడిపందేలు జోరుగా సాగాయి. గుండాట, పేకాట ద్వారా కోట్ల రూపాయల జూదం సాగింది. ఈ పందేలను చూసేందుకు ఉభయరాష్ట్రాల నుంచి ప్రజలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఐ.పోలవరం మండలం ఎదుర్లంక, కాట్రేనికోన మండలం చెయ్యేరు, కేశనకుర్రుపాలెం, కొత్తపేట, వీవీమెరక, అమలాపురం పట్టణంలోని ఏవీఆర్‌నగర్‌, కామనగరువు వంటి అనేక ప్రాంతాల్లో ఫ్లడ్‌లైట్ల వెలుగులో డే అండ్‌ నైట్‌ కోడిపందేలు నిర్వహించారు. అమలాపురం పట్టణంలో ప్రత్యేక పందెం బరులు ఏర్పాటు చేశారు. కోనసీమ వ్యాప్తంగా 30కి పైగా కీలక బరులు ఉండగా, మరో 50 ప్రాంతాల్లో కోడి పందేలను నిర్వహించారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అన్నిచోట్లా కోడిపందేలు, జూదం, గుండాట యథాతథంగా జరిగాయి. నిడమర్రు మండలం ఫత్తేపురంలో వైసీపీ జెండాను తలపించే రీతిలో టెంట్‌ వేసి కోడి పదేలు ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల నేతలు దగ్గరుండి మరీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. తెలంగాణ సరిహద్దులోని ఏపీ గ్రామాలైన జంగారెడ్డిగూడెం, శ్రీనివాసపురం, దేవులపల్లి, చింతలపూడి, నల్లజర్ల, తాడేపల్లిగూడెం, బుట్టాయిగూడెం, భీమవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు పరిసర గ్రామాల్లో కోడి పందేలు నిర్వహించారు.

ఇక ఈసారి పందెం రాయుళ్లు టెక్నాలజీని అద్భుతంగా వాడుకున్నారు. గూగుల్‌ పే, ఫోన్‌ పే ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్‌ సాగించారు. లక్షలాది రూపాయలు ఆన్‌లైన్‌లోనే బదిలీ కావడం విశేషం. ఏటీఎంలలో క్యాష్‌ లేకపోవడంతో ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్స్‌ తప్పలేదంటున్నారు పందెంరాయుళ్లు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా చింతపల్లి గ్రామంలో కోడి పందెం నిర్వహణలో ఉద్రిక్తత నెలకొంది. బరులు వద్ద పందెంరాయుళ్లు రెచ్చిపోయారు. పందెం డబ్బుల విషయంలో రాజుకున్న వివాదం కర్రలతో దాడులు చేసుకునే వరకూ వెళ్లింది. ఈ ఘటనలో ఒకరికి కాలు విరగగా మరొకరి తలకు తీవ్ర గాయాలయ్యాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories