Coal Crisis: దేశంలోని తీవ్రమైన బొగ్గు కొరత

Coal Crisis in India | Telugu News Today
x

Coal Crisis: దేశంలోని తీవ్రమైన బొగ్గు కొరత 

Highlights

Coal Crisis: బొగ్గు నిల్వలు తగ్గిపోవడంతో... విద్యుత్‌ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం

Coal Crisis: దేశాన్ని విద్యుత్‌ కొరత వేధిస్తోంది. అసలే ఎండాకాలం విపరీతమైన ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు కరెంటు కోతలు హీటు పుట్టిస్తున్నాయి. దీనికి బొగ్గు కొరతే కారణమని రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ బొగ్గు కొరత లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కోల్‌ కొరత కారణంగా విద్యుత్‌ ఉత్పత్తి ఆగిపోయి ఆసుపత్రులు, రైల్వేల్లో తీవ్ర అంతరాయం నెలకొంది. గత్యంతరం లేక దేశవ్యాప్తంగా పలు ప్యాసింజరు రైళ్లను ఇండియన్ రైల్వేస్ రద్దు చేస్ోతంది. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఢిల్లీ, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో కరెంటు కోతలు తీవ్రమయ్యాయి. బొగ్గు కొరత కారణంగా విద్యుత్‌ సంక్షోభం ఘంటికలు మోగుతున్నాయి.

దేశంలోని థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లలో బొగ్గు కొరత తీవ్రమైంది. వేసవి కావడంతో విద్యుత్‌ వినియోగం భారీగా పెరిగింది. ఫలితంగా బొగ్గు నిల్వలు త్వరగా నిండుకున్నాయి. ఫలితంగా విద్యుత్‌ ఉత్పత్తిపై నిలిచిపోయింది. దేశవ్యాప్తంగా బొగ్గు నుంచే 70 శాతం కరెంటు ఉత్పత్తి అవుతుంది. ప్రస్తుతం ఉత్పత్తి నిలిచిపోవడంతో పలు రాష్ట్రాల్లో విద్యుత్‌ కోతలు తీవ్రమయ్యాయి. బొగ్గు కొరత ప్రధానంగా ఢిల్లీ, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, ఏపీల్లో తీవ్రంగా ఉంది. ఆయా రాష్ట్రాల్లో నాలుగు గంటలకు పైగా విద్యుత్‌ కోతలను అమలు చేస్తున్నారు. ఫలితంగా ఆసుపత్రులు, రైళ్లపై ప్రభావం పడుతోంది. ఎండలు మండుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేక ఇంట్లో ఉక్కపోతను భరించలేక అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఎండల నుంచి కాపాడుకునేందుకు ఇళ్లలోనే ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరెంటు కోతలతో ఇంట్లో ఉండలేని పరిస్థితి నెలకొందని ప్రజలు వాపోతున్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో అయితే బొగ్గు కొరత నానాటికి తీవ్రమవుతోంది. ఢిల్లీలోని రెండు ప్రధాన థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు దాద్రి-2, ఊంచహార్‌ ప్లాంట్లలో బొగ్గు కొరత తీవ్రమైంది. ఢిల్లీకి అవసరమయ్యే విద్యుత్‌ డిమాండ్‌లో 30 శాతం ఇక్కడి నుంచే వస్తుంది. ఈ రెండు పవర్ ప్లాంట్ల వద్ద ఇప్పుడు బొగ్గు నిల్వలు భారీగా తగ్గిపోయాయి. దీంతో ఈ రెండు ప్లాంట్లలో విద్యుత్‌ ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రులు, మెట్రో స్టేషన్ల వంటి అత్యవసర, కీలక సేవలకు 24 గంటల నిరంతర కరెంటు సరఫరా చేయడం కష్టంగా మారుతుందని కేజ్రీవాల్‌ సర్కారు తెలిపింది. రాజధాని ఢిల్లీలో 44 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠానికి ఉష్ణోగ్రతలు చేరుకోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కరెంటు కోతలతో ఢిల్లీవాసులు అల్లాడుతున్నారు. మరోవైపు బొగ్గు కొరతపై ఢిల్లీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. తక్షణమే ఢిల్లీ విద్యుత్‌ ప్లాంట్లకు బొగ్గును సరఫరా చేయాలని కోరింది.

ఉరుము ఉరిమి మంగలం మీద పడిందన్న చందంగా బొగ్గు కొరత ప్రభావం రైళ్లపై పడింది. బొగ్గు కొరతను తీర్చేందుకు అత్యవసరంగా పలు ప్యాజింజర్‌ రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. మొత్తం 670 ప్యాసింజరు ట్రిప్పులను మే 24 వరకు రద్దు చేసింది. మరికొన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను కూడా రద్దు చేసినట్టు రైల్వే శాఖ తెలిపింది. ఏయే రూట్లలో ప్రయాణాలు రద్దు అనేది ప్రయాణికులే గమనించాలని కోరింది. అయితే ప్యాసింజరు రైళ్ల అంతరాయం తాత్కాలికమేనని అతి త్వరలో పరిస్థితి చక్కబడితే సర్వీసులను పునరుద్దరిస్తామని రైల్వేశాఖ తెలిపింది. ప్రయాణికులు అందుకు సహకరించాలని కోరింది. అయితే బొగ్గు సరఫరాలో అంతరాయాలకు రైల్వేశాఖ తరచూ విమర్శలు ఎదుర్కొంటోంది. సరిపడా క్యారేజీలు లేకపోవడంతో ఎక్కువ దూరాలకు బొగ్గును తరలించడం కష్టతరంగా మారింది. తాజాగా ప్యాసింజరు రైళ్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. టికెట్లు ఆన్‌లైన్‌ బుకింగ్‌ కావడంతో అక్కడే సర్వీసులు రద్దు చేసినట్టు తెలియడంతో ప్రయాణికులు కాస్తా ఊరట పొందుతున్నారు. అదే ఆఫ్‌లైన్‌ టికెట్లు అయితే స్టేషన్‌కు వెళ్లి ఉసూరుమంటూ వెనక్కి రావాల్సిన పరిస్థితి తలెత్తేది.

అయితే బొగ్గు కొరతపై ఉన్న భయాందోళనలను కేంద్ర ప్రభుత్వం రెండ్రోజుల క్రితం తోసి పుచ్చింది. దేశంలో బొగ్గు కొరత లేదని నెలకు సరిపడా బొగ్గు ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. కోల్‌ ఇండియా సహా వివిధ ప్రాంతాల్లో 7వేల 250 కోట్ల టన్నుల బొగ్గు అందుబాటులో ఉందన్నారు. అదే సమయంలో థర్మల్‌ పవర్‌ ప్లాంట్లలో 220 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్టు ప్రహ్లాద్‌ జోషి ట్విట్‌ చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి 8శాతానికి పైగా పెరిగి 770 కోట్ల టన్నులకు పెరిగింది. కోల్‌ ఇండియా ఆధ్వర్యంలో 4 శాతం పైగా పెరిగి 620 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. తాజాగా బొగ్గు కొరతతో 12 రాష్ట్రాల్లో విద్యుత్‌ సంక్షోభం నెలకొంది. గత్యంతరం లేక ఆయా రాష్ట్రాలు భారీగా కోతలను విధిస్తున్నాయి.

ఈ సారి వేసవిలో ఉష్ణోగ్రతలు తీవ్రమయ్యాయి. ఉక్కపోత అధికమయ్యింది. దీంతో విద్యుత్‌ వినియోగం భారీగా పెరిగింది. ఇప్పటివరకు థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లలోని బొగ్గు నిల్వలు త్వరగా పూర్తయ్యాయి. దీంతో బొగ్గు సంక్షోభం నెలకొంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే బొగ్గును సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories