జేసీ సోదరుల విషయంలో జగన్ ఆలోచన ఇదేనా?

జేసీ సోదరుల విషయంలో జగన్ ఆలోచన ఇదేనా?
x
Highlights

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, అనంతపూర్ మాజీ ఎంపీ జెసి దివాకర్ రెడ్డి...

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, అనంతపూర్ మాజీ ఎంపీ జెసి దివాకర్ రెడ్డి గురువారం సంచలన ఆరోపణలు చేశారు. అనంతపూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం.. తమను టీడీపీని వీడి వైసీపీలో చేరాలని తనపై, తన కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెస్తోందని చెప్పారు. మమ్మల్ని తప్పుడు కేసులలో ఇరికించడం ద్వారా అధికార పార్టీ మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటోందని వైసీపీలో చేరితే కేసులతో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికే తమ పార్టీ నాయకులను ఆర్థికంగా, మానసికంగా ప్రభుత్వం వేధిస్తుందని ఆయన ఆరోపించారు. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలోని దందులూరుకు చెందిన టీడీపీ మాజీ శాసనసభ్యుడు చింతామనేని ప్రభాకర్‌ను వారు టార్గెట్ చేస్తున్నారు? ప్రతి రోజు, అతన్ని ఏదో కేసులో ఇరికించి జైలుకు తరలిస్తున్నారని దివాకర్ రెడ్డి అన్నారు.

ఇదిలావుంటే గత కొన్నేళ్లుగా జేసీ.. అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా జగన్ ను, వైసీపీని తీవ్రంగా విమర్శిస్తున్నారు. అలాంటి దివాకర్ రెడ్డి మరియు ఆయన కుటుంబ సభ్యులను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరమని జగన్ ఒత్తిడి తెస్తారా? దివాకర్ రెడ్డి పార్టీలో చేరితే వైసీపీ కి అదనపు ప్రయోజనం ఉంటుందా? జేసీ సోదరులు పేరుకు తెలుగుదేశం పార్టీలో ఉన్నా గత ఐదేళ్లలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు తలనొప్పి తెప్పించారన్న వాదన బలంగా ఉంది. జేసీ సోదరుల వలన పరిటాల సునీత, ప్రభాకర్ చౌదరి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకానొక దశలో జేసీ వ్యవహారశైలి కారణంగా వీరిద్దరూ పార్టీని వీడతారన్న ప్రచారం జరిగింది. అయితే అది అప్పట్లోనే సద్దుమణిగింది.

మరోవైపు అనంతపురం జిల్లాలో జేసీ ఫ్యామిలీతో వైసీపీలోని 70 శాతం నాయకులకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. జేసీ అంటేనే కొందరు నాయకులకు నచ్చదు.. అలాంటిది దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి లను రప్పించి, పార్టీకి ఇబ్బందులు కొనితెచ్చుకోవాల్సిన అవసరం జగన్ కు ఏముంది? జగన్ కు, జేసీ కుటుంబానికి సన్నిహితంగా ఉండే మాజీ ఎమ్మెల్యే గురునాధ్ రెడ్డి, ఎర్రిస్వామిరెడ్డి సోదరులు ఆయనను పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నించినా మిగిలిన నేతలు ఒప్పుకుంటారా అన్నది ప్రశ్నార్థకమే.

ఇప్పటికే అనంతపురంలో వైసీపీ బలమైన శక్తిగా ఉంది. జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంది. ఉరవకొండ, హిందూపూర్ మినహా అన్ని అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. పైగా ఓడిపోయిన ఆ రెండు నియోజకవర్గాల్లో హిందూపురం మినహా ఉరవకొండలో అతితక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయింది. జిల్లాలో వైసీపీకి గతంనుంచే బలమైన క్యాడర్ ఉంది. అలాంటప్పుడు జేసీని పార్టీలోకి తీసుకుంటే ఒరిగేది ఏముంది.. ఆయనను చేర్చుకుంటే ప్రభుత్వంపై జేసీ చేసే విమర్శల దాడిని తగ్గించుకోవచ్చని జగన్ భావిస్తున్నారా? అలా అయితే ఇన్నిరోజులు జగన్ ఎందుకు నిర్ణయం తీసుకోలేదు.. గతంలో సోనియా గాంధీతో కాళ్లబేరానికి వచ్చి బెయిల్ తెచ్చుకున్నాడని జగన్ మీద తీవ్ర ఆరోపణలు చేసిన తోట త్రిమూర్తులు, సిబిఐ కేసుల విషయంలో పలుమార్లు సంచలన వ్యాఖ్యలు చేసిన బొత్స లాంటి వారిని పార్టీలో చేర్చుకున్నారు. మరి జేసీ విషయంలో జగన్ ఆలోచన బిన్నంగా ఉందా? ఆయన వస్తే పార్టీలో కొత్త సమస్యలు తలెత్తుతాయని జగన్ భావిస్తున్నారా? అనేది తెలియాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories