చంద్రబాబు ఆస్తుల కేసు : విచారణ ఈ నెల 21 నుంచి ప్రారంభం

చంద్రబాబు ఆస్తుల కేసు : విచారణ ఈ నెల 21 నుంచి ప్రారంభం
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ 15 ఏళ్ల తరువాత జరుగుతుంది..

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ 15 ఏళ్ల తరువాత జరుగుతుంది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ఆగిపోయిన విచారణ ఇప్పుడు మొదటికొచ్చింది. ముఖ్యమంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని.. పెద్ద ఎత్తున అక్రమంగా ఆస్తులు కూడబెట్టారంటూ దివంగత ఎన్‌.టి.రామారావు సతీమణి, తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి 2005లో దాఖలు చేసిన పిటిషన్‌ ఏసీబీ ప్రత్యేక కోర్టులో త్వరలో రోజువారీ పద్దతిన విచారణకు రానుంది. ఎంపీ, ఎమ్మెల్యేలపై నమోదైన కేసులపై ఏడాది లోగా విచారణ పూర్తిచేయాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ నెల 21 నుంచి ఈ కేసు విచారణ జరగనుంది.

అంతేకాకుండా తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసు విచారణ మళ్లీ ఊపందుకోనుంది. ఈ కేసును ఏసీబీ ప్రత్యేక కోర్టు శుక్రవారం విచారించి సోమవారానికి వాయిదా వేసింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పటి తెలుగుదేశం అభ్యర్థి గెలుపు కోసం నామినేటెడ్‌ ఎమ్మెల్యే అయిన స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెట్టి ఓటు వేయించేందుకు ప్రయత్నించారని కేసు నమోదు అయింది.. ఈ కేసులో అప్పటి టీడీపీ నాయకుడు, ప్రస్తుతం మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డితోపాటు పలువురు నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి కొద్దిరోజులు జైలులో విచారణ ఖైదీగా కూడా ఉన్నారు. ఆయనకు బెయిల్ లభించిన తరువాత విచారణలో వేగం తగ్గింది. మళ్ళీ ఇన్నాళ్లకు ఊపందుకుంది. ఈ కేసు కూడా సోమవారం నుంచి రోజువారీగా విచారించే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories