జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో చంద్రబాబు భేటీ.. కీలక అంశాలపై డిస్కషన్‌

Chandrababu Meet Janasena chief Pawan Kalyan
x

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో చంద్రబాబు భేటీ.. కీలక అంశాలపై డిస్కషన్‌

Highlights

Chandrababu: రెండున్నర గంటలకుపైగా సమావేశం

Chandrababu: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో చంద్రబాబు భేటీ.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. హైదరాబాద్‌లోని పవన్ ఇంటికి వెళ్లారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. పవన్ నివాసంలో చంద్రబాబు భేటీ అయ్యారు. దాదాపు రెండున్నర గంటల పాటు పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తుంది. ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలు, ఎన్నికల సన్నద్ధత, టీడీపీ- నసేన పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు, బీజేపీతో పొత్తుపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడిగా బహిరంగ సభల‌ నిర్వహణపై కూడా వీరి భేటీలో చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఏపీలో మార్చిలోనే ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

చంద్రబాబు అరెస్టు అనంతరం.. ఏపీలో రాజకీయ పరిణామాలన్నీ మారిపోయాయి. ఎన్నికల్లో టీడీపీతో జనసేన కలిసి పోటీచేస్తుందని.. ఆ దిశగా ఇరు పార్టీలు ముందుకు వెళ్తాయని జైల్లో చంద్రబాబును కలిసి వచ్చిన వెంటనే పవన్‌ ప్రకటించారు. ఈ మేరకు పలుమార్లు ఉమ్మడి సమావేశాలు కూడా నిర్వహించాయి ఇరుపార్టీలు. అంతేకాకుండా.. సీట్ల సర్దుబాటు, మేనిఫెస్టో, ఉమ్మడి కార్యాచరణపై చర్చ జరిగింది. ఏపీలో గెలుపే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు.. ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఈ తరుణంలో చంద్రబాబు.. పవన్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీకావడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న సమయంలో వీరిద్దరి భేటీ ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉంటే.. పవన్‌, చంద్రబాబు భేటీ వివరాలను జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ వెల్లడించారు. ఏపీ ప్రజలకు ఒక మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఈ చర్చలు జరిగాయన్నారు. ఎన్నికల వ్యూహం, ఏపీకి చక్కటి పరిపాలన అందించేందుకు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ఎలా కలిసి పని చేయాలి అనే అంశాలపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్చించారని మనోహర్ చెప్పారు. వ్యూహాలు, రాజకీయ అంశాలు, పార్టీ పరంగా సంస్థాగతంగా చేయాల్సిన కార్యక్రమాలపై చర్చలు జరిగాయని వెల్లడించారు. భవిష్యత్తులో ఇరు పార్టీల నాయకులు కలిసికట్టుగా విజయం సాధించి.. మంచి ప్రభుత్వం, పరిపాలన అందించాలని నిర్ణయించారని నాదెండ్ల మనోహర్ వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories