ఇక నో స్టేటస్

ఇక నో స్టేటస్
x
Highlights

ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం కుండబద్దలు కొట్టింది. ప్రస్తుతం ఏ రాష్ట్రానికీ...

ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం కుండబద్దలు కొట్టింది. ప్రస్తుతం ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా లేదని తేల్చిచెప్పింది. నిన్న లోక్‌సభలో బీహార్‌ ఎంపీ కౌసలేంద్ర కుమార్‌ అడిగిన ప్రశ్నకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

స్పెషల్‌ స్టేటస్‌పై‌ తమ స్టాండ్‌ మారలేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని మోడీ సర్కారు మరోమారు మొండిచేయి చూపించింది. ఏపీ, తెలంగాణ సహా దేశంలోని 7 రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోరాయని ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదని స్పష్టం చేసింది. లోక్‌సభలో బీహార్‌ కు చెందిన జేడీయూ ఎంపీ కౌసలేంద్ర కుమార్‌ అడిగిన ప్రశ్నకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

ఏ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చే అంశం పరిశీలనలో లేదని తన సమాధానంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ, బిహార్‌, ఝార్ఖండ్‌, చత్తీస్‌గఢ్‌, ఒడిశా, రాజస్థాన్‌లు ప్రత్యేకహోదా కోసం విజ్ఞప్తి చేశాయని తెలిపారు. ప్రణాళిక మద్దతు కోసమే హోదా ఇవ్వాలంటూ గతంలో జాతీయ అభివృద్ధి మండలి సిఫార్సు చేసిందని వివరించారు. అయితే ప్రత్యేకహోదాకు, పారిశ్రామిక రాయితీలకు సంబంధం లేదని నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు.

మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలన్నీ అమలు చేయాలని వైసీపీ పక్షనేత మిథున్‌రెడ్డి కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రత్యేక హోదా అంశాన్ని ఎంపీ మిథున్‌రెడ్డి లేవనెత్తారు. ఆంధ్రప్రదేశ్‌ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందని రాష్ట్రం తీవ్ర ఆర్థికసంక్షోభం ఎదుర్కొంటోందని తెలిపారు. వడ్డీలకే 20 వేల కోట్లు చెల్లించాల్సి వస్తోందని జీతాలు చెల్లించడానికే అష్టకష్టాలు పడుతున్నట్లు తెలిపారు.

అయితే హోదా విషయంలో కేంద్రం ప్రకటన ఏపీ ప్రభుత్వాన్ని షాక్‌కు గురిచేసింది. ప్రత్యేక హోదా సాధనపైనే అధికారంలోకొచ్చిన జగన్‌ ప్రభుత్వం అందుకు అనుగుణంగానే ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి అదే అంశంపై చర్చించింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే కంటే ముందు ప్రధాని మోడీని కలిసిన జగన్‌ హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ప్రయత్నాలను కొనసాగించారు. నీతి ఆయోగ్‌ సమావేశంలో కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఎంతమేర అవసరమో వివరించారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చి ఆదుకోవాలని జగన్‌ విజ్ఞప్తి చేశారు.

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తో భేటీ అయిన జగన్‌ ప్రత్యేక హోదా విషయంలో మోడీ మనస్సు మార్చేలా ప్రయత్నించాలని సూచించారు. అదే సమయంలో మోడీ మనస్సు మారే వరకు తమ ప్రయత్నం ఆగదని హోదా ఇచ్చే వరకు అడుగుతామని జగన్‌ చెప్పారు. అయితే అనూహ్యంగా హోదా ఏ రాష్ట్రానికీ ఇవ్వలేమని లోక్‌సభలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ లిఖితపూర్వక సమాధానం ఇవ్వడంతో జగన్‌ సర్కారుకు తొలి షాక్‌ తగిలినట్లైంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories