YS Viveka Murder: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు

Cbi Speeds up Investigation on Ys Viveka Murder Case
x

YS Viveka Murder:(File Image)

Highlights

YS Viveka Murder: దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ బాబాయ్, దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య...

YS Viveka Murder: దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ బాబాయ్, దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు స్పీడు పెంచారు. పులివెందులలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ కేంద్రంగా సీబీఐ అధికారులు వివేకా హత్య కేసుపై నాలుగో రోజు కూడా విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన అధికారులు.. ఇప్పుడు మరో దఫా విచారణ చేస్తున్నారు. మంగళవారం నాడు లింగాల మండలం అంబకపల్లె గ్రామానికి చెందిన మహేశ్వరరెడ్డిని, ఆయన కుటుంబాన్ని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. మహేశ్వరరెడ్డి కుటుంబం గతంలో వివేకానంద రెడ్డి పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేసుకునేవారు.

ఈ నేపథ్యంలోనే దర్యాప్తులో భాగంగా పలు అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు మహేశ్వర రెడ్డి కుటుంబాన్ని సీబీఐ అధికారులు విచారించారు. పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నారు. మహేశ్వర రెడ్డి కుటుంబ సభ్యులు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను సీబీఐ అధికారులు రికార్డ్ చేశారు. ఇక సోమవారం నాడు ఈ కేసులో అనుమాతులుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డితో పాటు.. వివేకా పీఏ ఇనయతుల్లాను సీబీఐ అధికారులు విచారించారు. వివేకా ఇంటి వద్ద ఉన్న పాల డైరీ, సెల్ పాయింట్ యజమానులను కూడా సీబీఐ అధికారులు విచారించారు. దీనికి కొనసాగింపుగా ఇవాళ కూడా విచారణ చేపట్టనున్నారు. మరికొంతమంది అనుమానితులను సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు.

2019 మార్చి 14వ తేదీన వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. బాత్‌రూమ్‌లో రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉన్నారు. ఆ ఘటన అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది. నాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దీనిపై విచారణకు సిట్ ఏర్పాటు చేసింది. అయితే, సిట్ ఆ దర్యాప్తులో ఏమీ తేల్చలేకపోయింది. ఆ తరువాత వచ్చిన జగన్ సర్కార్ కూడా సిట్ వేయగా.. అదే పరిస్థితి రిపీట్ అయ్యింది. ఈ కేసు ఎంతకీ తేల్చకపోవడంతో వివేకానంద రెడ్డి కూతురు డాక్టర్ సునీత హైకోర్టు ఆశ్రయించారు. వివేకా హత్య కేసుపై సీబీఐ విచారణ చేయించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు సీబీఐ విచారణను వేగవంతం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories