పక్కా ప్రణాళికతోనే భవాని దీక్షలు విజయవంతం

పక్కా ప్రణాళికతోనే భవాని దీక్షలు విజయవంతం
x
Highlights

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన 'భవాని దీక్షలు-2025' అత్యంత సంతృప్తికరమైన వాతావరణంలో, భక్తుల నుంచి విశేష స్పందనతో విజయవంతంగా ముగిశాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు.

విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన 'భవాని దీక్షలు-2025' అత్యంత సంతృప్తికరమైన వాతావరణంలో, భక్తుల నుంచి విశేష స్పందనతో విజయవంతంగా ముగిశాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. ఈరోజు ఇంద్రకీలాద్రిపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భక్తుల సౌకర్యార్థం జిల్లా యంత్రాంగం పక్కా ప్రణాళికతో చేసిన ఏర్పాట్లు సత్ఫలితాలనిచ్చాయన్నారు. భక్తుల నుంచి, మీడియా నుంచి, సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఇన్‌పుట్స్ అన్నీ చాలా సానుకూలంగా ఉన్నాయని, ఇది తమ పనితీరుకు నిదర్శనమని కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు.

రెవెన్యూ, పోలీస్, దేవాదాయ, మున్సిపల్ సహా ప్రతి శాఖాధికారులు, సిబ్బంది పండుగ విజయవంతానికి పగలు, రాత్రి అనకుండా సమన్వయంతో కృషి చేశారని కొనియాడారు. ఈ సంవత్సరం గతంలో ఎన్నడూ లేనివిధంగా 'అపరిమితంగా లడ్డూల విక్రయం', నిరాటంక అన్నప్రసాదం, తాగునీటి పంపిణీ వంటి వినూత్న ఏర్పాట్లు చేశామని, ఇవి భక్తులకు ఎంతో ఉపకరించాయని తెలిపారు.

భవిష్యత్తులో మరింత మెరుగైన సేవలు అందించడానికి ప్రజల నుండి నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు స్వీకరించడానికి దేవస్థానం సిద్ధంగా ఉందని తెలియజేశారు.ఈ మహా క్రతువు విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ప్రభుత్వ శాఖకు, మీడియా ప్రతినిధులకు కలెక్టర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

భవాని భక్తుల కోసం చేసిన ప్రత్యేక ఏర్పాట్లు రేపు మంగళవారం కూడా కొనసాగుతాయని, బుధవారం నుండి దేవస్థానం యథావిధిగా పనిచేస్తుందని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఈఓ వి.కె. సీనా నాయక్ తెలియజేశారు.

తాను, ఈవో నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూనే ఉన్నామని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) చెప్పారు. ఏర్పాట్ల పట్ల ప్రతి భక్తుడు సంతృప్తి చెందాడని తెలిపారు.

ప్రెస్ మీట్ అనంతరం, జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని అధికారులు, దేవస్థానం పాలకమండలి చైర్మన్, సభ్యులు క్యూ లైన్లు, ఘాట్‌లను స్వయంగా సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories