Attack on Ambati Rambabu House: అంబటి రాంబాబు ఇంటిపై దాడి ...ఎమ్మెల్యే సహా 31 మందిపై కేసులు

Attack on Ambati Rambabu House: మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడి ఘటనలో ఎమ్మెల్యే, ఆమె భర్త సహా 31 మంది టీడీపీ నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 3 Feb 2026 11:30 AM IST
Attack on Ambati Rambabu House:  అంబటి రాంబాబు ఇంటిపై దాడి ...ఎమ్మెల్యే సహా 31 మందిపై కేసులు
X

Attack on Ambati Rambabu House: అంబటి రాంబాబు ఇంటిపై దాడి ...ఎమ్మెల్యే సహా 31 మందిపై కేసులు

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యేతో పాటు ఆమె భర్త సహా మొత్తం 31 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

అంబటి రాంబాబు తన న్యాయవాది ద్వారా పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, దాని ఆధారంగా కేసులు నమోదు చేశారు. ఫిర్యాదులో, టీడీపీకి చెందిన కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు తన నివాసంపై దాడి చేసి, కార్లు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

ఈ ఘటనకు సంబంధించి పట్టాభిపురం పోలీసులు BNS సెక్షన్లు 127(2), 189(2), 324(4), 329(4), 351(2) r/w 190 కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఆమె భర్త రామచంద్రరావుపై కూడా కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి, సంబంధిత ఆధారాలను సేకరిస్తున్నారు.

ఇదిలా ఉండగా, సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అంబటి రాంబాబును పోలీస్ కస్టడీకి అప్పగించాలంటూ నల్లపాడు పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు గుంటూరు కోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే అంబటి రాంబాబుపై రాష్ట్రవ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి. కోర్టు అనుమతిస్తే, ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఆయనను విచారణ నిమిత్తం నల్లపాడు పోలీసులు గుంటూరుకు తీసుకువచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ పరిణామాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తత నెలకొంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story