మాజీ మంత్రి నారాయణపై విద్యార్థి సంఘాల దాడి

మాజీ మంత్రి నారాయణపై విద్యార్థి సంఘాల దాడి
x
మాజీ మంత్రి నారాయణ
Highlights

మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణకు చేదు అనుభవం ఎదురైంది.

మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణకు చేదు అనుభవం ఎదురైంది. అనంతపురంలోని విద్యార్థి సంఘాల నాయకులు ఆయనపై దాడి చేశారు. అనంతపురం పర్యటన సందర్భంగా నారాయణ పాఠశాలలను పరిశీలించడానికి వచ్చిన నారాయణను స్థానిక విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకున్నారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అధిక ఫీజులు వసూలు చేయడంతోపాటు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని విద్యార్థి సంఘం ఆరోపించింది. విద్యార్థులను నారాయణ అనుచరులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

ఈ క్రమంలో కొంతమంది విద్యార్థులు నారాయణను చుట్టుముట్టి చొక్కా లాగారు. ఈ సంఘటనపై నారాయణ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నారాయణను కారులోకి తీసుకెళ్లారు. ఆ తరువాత కూడా కొంతమంది నారాయణ వాహనంపై రాళ్లు రువ్వారు. దాంతో కారు అద్దాలు పగిలిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకువచ్చారు. నారాయణ అనుచరుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు. నారాయణ కూడా తన పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని నెల్లూరుకు తిరుగుపయనమయ్యారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories