Atmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు

Atmakur By Election in Andhra Pradesh | Off The Record
x

మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు

Highlights

Atmakur By Election: ఏకగ్రీవం కానివ్వనంటూ మేకపాటి మేనల్లుడు రవీంద్రారెడ్డి ఎంట్రీ

Atmakur By Election: శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న వారు ఎవరైనా ఊహించని పరిణామాల్లో తనువు చాలిస్తే అక్కడ పోటీ పెట్టకూడదు! ఇది ఏపీలో ఓ రాజకీయ సంప్రదాయం. అన్నింటా ఇది పాటించాల్సిందేనన్న ఓ ఆనవాయతీ. కానీ ఆత్మకూరులో ఆ ఆనవాయితీని అటకెక్కించారట. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో ఆత్మకూరు ఏకగ్రీవం అవుతుందని అనుకున్నా అది వర్కవుట్‌ కావట్లేదట. మేకపాటి కుటుంబంలో ఉన్న వైరుధ్యాలను గమనిస్తే అక్కడ రాజకీయ సంప్రదాయానికి అడ్డుకట్ట పడే పరిస్థితి కనిపిస్తోందట. రాజకీయ పార్టీల మాటేమోగాని సొంత కుటుంబంలో ఉన్న విభేదాలు ఇప్పుడు ఆత్మకూరు ఉపఎన్నికల్లో పోటీ అనివార్యమనే పరిస్థితులను తెచ్చిపెడుతున్నాయట. ఇంతకీ ఆత్మకూరులో కంటికి కనిపించని ఆ అలజడి ఏంటి?

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో ఆత్మకూరులో అభ్యర్థిపై కొనసాగుతున్న ఉత్కంఠకు మేకపాటి కుటుంబం చెక్‌ పెట్టింది. ఆయన తనువు చాలించిన నాటి నుంచి గౌతమ్‌రెడ్డి స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలన్న అంశంపై తర్జనభర్జన పడిన మేకపాటి కుటుంబం ఎట్టకేలకు ఓ నిర్ణయానికి వచ్చేసింది. మేకపాటి రాజమోహన్‌రెడ్డి కుమారుల్లో రెండోవారైనా మేకపాటి విక్రమ్‌రెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించిందిన. ఆత్మకూరు అభ్యర్థిత్వంపై మేకపాటి కుటుంబం వైసీపీ నేతలకు ఇటీవలే ఓ క్లారిటీ ఇచ్చింది. మరో రెండు నెలల్లో జరగనున్న ఉపఎన్నికకు మేకపాటి కుటుంబం సర్వం సన్నద్ధమయ్యే ఏర్పాట్లు చేసుకుంటుంది.

ఇంతవరకు బాగానే ఉంది. ఏపీలో పార్టీలన్నీ ఓ సంప్రదాయాన్ని అమలు చేయాలని అనుకున్నాయి. ఎవరైనా ఎమ్మెల్యే చనిపోతే ఆయన కుటుంబం నుంచి ఎవరైనా పోటీకి దిగితే, ఆ కుటుంబ సభ్యులే గెలిపించేలా తీర్మానం చేసుకున్నాయి. కాకపోతే, ఆ సంప్రదాయం ఎక్కడ పెద్దగా వర్కవుట్‌ కాలేదు. ఆత్మకూరు అందుకు అతీతమేమీ కాదని మరోసారి రుజువైంది. ఎలా అంటే, మేకపాటి విక్రమ్‌రెడ్డి ఆత్మకూరు వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలబడ్డారు. ఇది సరే. అదే సమయంలో బీజేపీ నుంచి రాజమోహన్‌రెడ్డి మేనల్లుడు బిజివేముల రవీంద్రారెడ్డి తాను పోటీ చేస్తానంటూ ఉప ఎన్నికలకు కాలు దువ్వడం నేరుగా ప్రకటన చేయడం ఆత్మకూరులో ఏకగ్రీవంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మకూరులో పోటీ అనివార్యమన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అసలు ఆత్మకూరులో ఏం జరుగుతోంది అనేకంటే మేకపాటి ఫ్యామిలీలోనే ఇంకేదో జరుగుతుందన్న ఆసక్తి ఎక్కువైంది.

ఆత్మకూరు ఉపఎన్నిక ఏకగ్రీవమవడం దాదాపు కష్టమేనని స్పష్టంగా అర్థమవుతోంది. పోటీ ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే మేకపాటి బంధువు, రవీంద్రారెడ్డి బీజేపీ నుంచి పోటీకి సై అంటున్నారన్న టాక్‌ ఒకటి బయటకు వచ్చింది. తను ఆశించిన పార్టీ నుంచి టికెట్ వచ్చినా, రాకపోయినా తాను మాత్రం పోటీ చేయడం పక్కా అంటూ క్లారిటీ ఇచ్చేశాడు బిజివేముల రవీంద్రారెడ్డి. దీంతో మరికొన్ని పార్టీలు కూడా ఎన్నికల బరిలో నిలిచేందుకు రెడీ అవుతూ అందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాయట. అయితే, మేకపాటి కుటుంబంపై అన్ని పార్టీలకు అభిమానం ఉండడం గౌతమ్‌రెడ్డి వివాదరహితుడిగా పేరు తెచ్చుకోవడంతో ప్రధాన పార్టీలన్నీ ఆత్మకూరును ఏకగ్రీవం చేద్దామనే అనుకున్నాయి. కాకపోతే, ఇటీవల రాజమోహన్‌రెడ్డి మేనల్లుడు తాను పోటీ చేస్తానంటూ ప్రకటిండచంతో పోటీ తప్పదు అన్న చర్చ విస్తృతమైంది.

ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రధాన పార్టీలేవీ మొదట్లో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే ఇదే రాజమోహన్‌రెడ్డి, అదే టీడీపీ నుంచి ఒంగోలు ఎంపీగా గెలిచారు. అలా ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో రాజకీయాలకు అతీతంగా సత్సంబంధాలనే మెయింటైన్‌ చేశారు. దీంతో మేకపాటి రాజమోహన్‌రెడ్డితో తెలుగుదేశం పార్టీకి గతంలో ఉన్న అనుబంధంతో ఆ పార్టీ దాదాపు వెనుకడుగు వేసింది. పోటీలో ఉండమన్న సంకేతాలనే పంపింది. అదీగాక, ఏకగ్రీవ సంప్రదాయానికే మొగ్గు చూపుతామని గతంలో టీడీపీ చెప్పుకొస్తుంది కూడా. అయితే మేకపాటి రాజమోహన్‌రెడ్డి మేనల్లుడు రవీంద్రరెడ్డి ఇందుకు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ టికెట్‌ ఇస్తే సరే లేదంటే, తాను స్వతంత్ర అభ్యర్థిగానైనా ఆత్మకూరు నుంచి పోటీ చేస్తానంటూ, మేకపాటి కుటుంబానికి ఏకగ్రీవంగా ఆత్మకూరు అప్పగించే పరిస్థితి రానివ్వనంటూ మాట్లాడి సంచలనం సృష్టించారు.

అంతేకాకుండా, మేకపాటి కుటుంబం విధానాలకు తాను వ్యతిరేకమంటూ, 40 ఏళ్లుగా ఆ కుటుంబం రాజకీయాల్లో ఉన్నా నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదంటూ మేనమామపై ఫైర్‌ అయ్యారు రవీంద్రారెడ్డి. అందుకే తాను ఆత్మకూరు నుంచి బరిలోకి దిగి, ఎన్నికల సీన్‌లోకి వచ్చినట్టు చెప్పుకొచ్చారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆత్మకూరును ఏకగ్రీవం కానివ్వనని పక్కాగా క్లారిటీ ఇచ్చేశారు. సడన్‌గా మేకపాటి రాజమోహన్‌రెడ్డి మేనల్లుడు ఎంట్రీ ఇవ్వడంతో ఆత్మకూరులో బైపోల్‌ సీన్ మారిపోవడం ఖాయమన్న చర్చ జరుగుతోంది. బిజినవేముల రవీంద్రారెడ్డి గనుక పోటీకి దిగితే ఇతర రాజకీయ పార్టీలు కూడా అక్కడ బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏఏ పార్టీలు తమ అభ్యర్థులను బరిలో నిలుపుతాయనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంది.

ఏమైనా ఆత్మకూరులో పోటీపై టీడీపీ అయితే క్లారిటీ ఇచ్చినట్టే. ఇక బీజేపీ. ఈ పార్టీకి సానుభూతి రాజకీయాలు అంటే పెద్దగా గిట్టదు. పైగా ఈ మధ్యనే జరిగిన కడప జిల్లా బద్వేల్ ఉపఎన్నికలో కూడా బీజేపీ పోటీ చేసింది. దీన్ని బట్టి చూస్తే ఆత్మకూరులోనూ పోటీ చేసే అవకాశాలే ఎక్కువన్న టాక్‌ వినిపిస్తోంది. జాతీయ పార్టీ కాబట్టి తాము పోటీ చేసి తీరుతామని బీజేపీ చెప్పుకుంటుంది కూడా. బిజినవేముల రవీంద్రారెడ్డి మేకపాటి ఫ్యామిలీలో సభ్యుడు కావడంతో పాటు సరైన అభ్యర్థి అనిపిస్తే బీజేపీ ఆయనకే టిక్కెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోందిక్కడ. ఇక జనసేన. ఎలాగూ ఈ పార్టీ కమలం క్యాంప్‌తోనే కలసి నడుస్తుంది కాబట్టి ఆ పార్టీకే మద్దతు ఉంటుంది. అందుకే బీజేపీ జనసేన కార్యకర్తల అండ చూసుకొని పోటీకి సై అంటోందట. మరి కాంగ్రెస్‌ పరిస్థితి ఏంటి? ఈ పార్టీ కూడా పోటీ రెడీ అంటుందట.

మరోవైపు రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ చార్జీలు, పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో అధికార పార్టీని వీలైనంత వరకు జనంలో బద్నాం చేయడానికి పార్టీలన్నీ ఆత్మకూరు ఉపఎన్నికను వాడుకుంటాయన్న చర్చ జరుగుతోంది. ఇలా ఎలా చూసినా, ఏ ఈక్వేషన్స్‌ ప్రకారం పరిశీలించినా ఆత్మకూరు ఉపఎన్నిక జరగడం ఖాయంగానే కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories