Top
logo

ATM Robbery in Vizag: కొత్త తరహాలో ఏటీఏంలలో దోపిడీ.. చేధించిన విశాఖ పోలీసులు

ATM Robbery in Vizag: కొత్త తరహాలో ఏటీఏంలలో దోపిడీ.. చేధించిన విశాఖ పోలీసులు
X

ATM Robbery in Vizag

Highlights

ATM Robbery in Vizag: టెక్నాలజీ ఎంత అప్ డేట్ అవుతున్నా దానికి తగ్గట్టు లోపాలు మరింత స్థాయిలో విస్తరిస్తున్నాయ నేందుకు ఈ వ్యవహారమే కారణం. ఒక కార్డుతో మనకు సంబంధించిన అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా చేయడం ఒక విశేషమైతే

ATM Robbery in Vizag: టెక్నాలజీ ఎంత అప్ డేట్ అవుతున్నా దానికి తగ్గట్టు లోపాలు మరింత స్థాయిలో విస్తరిస్తున్నాయనేందుకు ఈ వ్యవహారమే కారణం. ఒక కార్డుతో మనకు సంబంధించిన అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా చేయడం ఒక విశేషమైతే... దాన్ని తెలివిగా కొన్ని పద్దతుల ద్వారా దొంగతనం చేయడం మరింత విశేషమని చెప్పాలి. అయితే ఇలాంటి వ్యవహారాలను విశాఖ పోలీసులు తెలివిగా చేధించారు... గార్డుల్లేని ఏటీఎంల వద్ద జరుగుతున్న ఇలాంటి తతంగంపై ఇద్దర్ని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి నగదు, బ్యాంకు ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

ఢిల్లీ కేంద్రంగా బ్యాంక్‌ ఏటీఎంలలో కొత్త తరహాలో దోపిడీలకు పాల్పడే ఇద్దరిని క్రైం పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రాల్లోనే నేరాలకు పాల్పడే ఈ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఏటీఎం తెరిచే నకిలీ తాళాలతో పాటు వారి వద్ద నుంచి 34 ఏటీఎం కార్డులు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు.

అసలేం జరిగిందంటే..

ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జూలై నెల 7, 8 తేదీల్లో ఏటీఎంలో రూ.1.03 లక్షలు దొంగతనం జరిగిందంటూ బిర్లా జంక్షన్‌ స్టేట్‌ బ్యాంక్‌ అకౌంటెంట్‌ గజ్జెల సూర్య భాస్కరరావు ఫిర్యాదు చేశారు. ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన క్రైం డీసీపీ సురేష్‌బాబు ఆదేశాల మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీïసీ ఫుటేజీల ఆధారంగా ఏటీఎంలో రూ.19,500, రూ.19,500, రూ.39,000 లావాదేవీలు చేస్తున్న ఇద్దరు అనుమానితులను గుర్తించారు. ఈ కేసు దర్యాప్తు చేస్తుండగా.. ఈ నెల 21న ఎవరో ఇద్దరు అనుమానితులు బ్యాంక్‌ ఏటీఎంలలో దోపిడీ చేస్తున్నారని విజయవాడ సైబర్‌ కంట్రోల్‌ రూం నుంచి విశాఖ క్రైం పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇది తెలుసుకున్న క్రైం పోలీసులు అదే రోజు తెల్లవారుజామున బిర్లా జంక్షన్‌ ఏటీఎంలో చోరీకి పాల్పడుతున్న హర్యానాకు చెందిన ఏ1–అకిబ్‌ఖాన్, ఏ–2 ముబారక్‌లు ఇద్దరు అంతర్రాష్ట్ర సైబర్‌ నేరగాళ్లను అరెస్ట్‌ చేశారు. వారిని విచారించగా.. ఈ నెల 19న విమానంలో ఢిల్లీ నుంచి విశాఖపట్నం వచ్చి, డాబాగార్డెన్స్‌లోని ఓ లాడ్జీలో దిగినట్టు అంగీకరించారు. వారిద్దరూ ఓ ఆటోమొబైల్స్‌లో స్కూటీని అద్దెకు తీసుకున్నారు. ఏటీఎం మిషన్లను తెరిచే మూడు నకిలీ తాళాలను ఉపయోగించి.. నగరంలో సెక్యూరిటీ గార్డులు లేని ఎస్‌బీఐ ఏటీఎంలు ఎక్కడెక్కడ ఉన్నాయోనని వెతికి నగదు దోపిడీలకు పాల్పడ్డారు.

ఇలా మోసం..

హర్యానా నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడే ఈ ముఠా తమ స్నేహితుల ఎస్‌బీఐ ఏటీఎం కార్డులు తీసుకొస్తారు. ఏటీఎంలో కార్డు పెట్టి విత్‌డ్రా ట్రాన్జాక్షన్‌ మొదలు పెడతారు. నగదు బయటకు వచ్చే సమయంలో వారి వద్ద ఉన్న నకిలీ తాళాలతో ఏటీఎం మిషన్‌ను ఆపేస్తారు. అమౌంట్‌ డెబిట్‌ అయినట్టు మెసేజ్‌ వస్తుంది. మిషన్‌ ఆగిపోయిందని.. ఖాతాదారుడు నేరుగా కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేస్తే.. వారికి ఎర్రర్‌ చూపిస్తుంది. వారు సంబంధిత బ్యాంక్‌ మేనేజర్‌ని సంప్రదించాలని సూచిస్తారు. బ్యాంక్‌ మేనేజర్‌ అకౌంట్‌లో కూడా టెక్నికల్‌ ఎర్రర్‌ చూపిస్తుంది. ఈ నగదు నష్టమంతా సంబంధిత బ్యాంక్‌ మేనేజర్‌ అకౌంట్‌లోనే చూపిస్తుంది. మిషన్‌ నుంచి వచ్చిన నగదును నిందితులు పట్టుకుని వెళ్లిపోతారు. ఇలా ముఠాగా ఏర్పడిన సైబర్‌ నేరగాళ్లను పోలీసులు పట్టుకుని జైలుకు పంపారు. నిందితుల నుంచి 34 ఏటీఎం కార్డులు, రూ.76 వేలు నగదు, ఒక స్కూటీ, మూడు నకిలీ తాళాలు, రెండు స్మార్ట్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Web TitleATM Robbery in Vizag: two Arrested For Stolen Cash From Atm's With Duplicate Keys
Next Story