48 నియోజకవర్గాల్లో టీడీపీ నేతల అరెస్ట్

48 నియోజకవర్గాల్లో టీడీపీ నేతల అరెస్ట్
x
Highlights

రాష్ట్రానికి మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా అమరావతిలో చలో అసెంబ్లీకి తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన...

రాష్ట్రానికి మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా అమరావతిలో చలో అసెంబ్లీకి తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన ఆందోళనకారులను అరెస్టు చేశారు పోలీసులు. వారు ఇళ్లనుంచి బయటికి రాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తెల్లవారుజామునుంచే టీడీపీ నాయకులను, జెఎసి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. 48 నియోజకవర్గాలకు చెందిన టీడీపీ కీలక నేతలు, కార్యకర్తలను ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో పత్తిపాటి పుల్లారావు, మైలవరంలో దేవినేని ఉమా, విజయవాడలో బోండా ఉమా, బుద్ధా వెంకన్న, కేశినేని నాని, కర్నూల్‌ జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డిని అలాగే అనంతలో జేసీ కుటుంబాన్ని పోలీసులు హౌస్‌ అరెస్ట్ చేశారు. విశాఖలో మాజీ ఎమ్మెల్యే, పాడేరు టీడీపీ నాయకురాలు గిడ్డి ఈశ్వరీని గృహ నిర్భందం చేశారు పోలీసులు. శ్రీకాకుళంలోని టీడీపీ నేత కూన రవికుమార్‌ ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు.

తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురంలో మాజీ ఎమ్మెల్యే బత్తుల ఆనందరావును పోలీసులు అరెస్ట్‌ చేశారు. అటు కాకినాడలో పార్టీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డిని , పి గన్నవరం నియోజకవర్గ ఇంఛార్జిని గృహనిర్బంధం చేశారు. జగ్గంపేటలో జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ జ్యోతుల నవీన్‌, ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు లను అరెస్ట్‌ చేశారు. ఇక విజయనగరం జిల్లా అధ్యక్షుడు మహంతి చిన్నం నాయుడు, జిల్లా ఇంఛార్జ్‌ అదితి గజపతి రాజును గృహనిర్బంధం చేయగా.. ఎమ్మెల్సీ సంధ్యారాణి, సాలూరు మాజీ ఎమ్మెల్యే బంజదేవ్ లను హౌజ్ అరెస్ట్ చేశారు. అరెస్టులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు.

తమ నేతల అరెస్టులను ఖండించారు. టిడిపి మరియు జెఎసి నాయకులను నిర్బంధించడం పిరికి చర్య అని విమర్శించారు. అరెస్టయిన నాయకులను వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు, వికేంద్రీకరణ బిల్లు, సిఆర్‌డిఎ సవరణ బిల్లును ఆమోదించడానికి కేబినెట్ సమావేశం ప్రారంభం అయింది. క్యాబినెట్ ఆమోదం తరువాత ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ ఉదయం 11 గంటలకు సమావేశం అవుతుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories