logo
ఆంధ్రప్రదేశ్

Chariot Construction: వందేళ్లుండేలా కొత్త రథం.. మంత్రులు, అధికారులు ఏర్పాట్లు

Chariot Construction: వందేళ్లుండేలా కొత్త రథం.. మంత్రులు, అధికారులు ఏర్పాట్లు
X
Highlights

Chariot Construction | రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసిన అంతర్వేధి రథం దగ్దం కేసు సీబీఐకి అప్పగించడంతో ఇంక దాని పునర్మిణానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

Chariot Construction | రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసిన అంతర్వేధి రథం దగ్దం కేసు సీబీఐకి అప్పగించడంతో ఇంక దాని పునర్మిణానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పాత రథం స్థానే కొత్త దానిని నిర్మాణం చేయాలని సంకల్పించింది. ఇది వందేళ్లయినా చెక్కు చెదరకుండా ఉండేలా అవసరమైన చర్యలు తీసుకునేందుకు మంత్రులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి అవసరమైన టేకు కలప వంటి వాటి నాణ్యమైన వాటిని రప్పించి, ప్రత్యేక నమూనాతోతయారు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి రథం దగ్ధమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రథం కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. కొత్త రథం నిర్మాణం కోసం రూ.95 లక్షల అంచనాతో దేవదాయ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఇందుకోసం నియమించిన దేవదాయ శాఖ ప్రత్యేకాధికారి రామచంద్రమోహన్‌ రెండు రోజులుగా అంతర్వేది ఆలయాన్ని పరిశీలించి కొత్త రథం నిర్మాణంపై అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించారు. దేవదాయ, అగ్నిమాపక, ఇతర శాఖల సమన్వయంతో వారం, పది రోజుల్లో డిజైన్‌కు తుది రూపమివ్వనున్నారు.

1,300 ఘనపుటడుగుల టేకు అవసరం

► రథం నిర్మాణం కోసం 1,300 ఘనపుటడుగుల నాణ్యమైన ముదురు టేకు కలప అవసరమని లెక్క తేల్చారు. రథం 21 అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పు, 40 అడుగుల ఎత్తుతో తయారు చేయాలని నిర్ణయించారు.

► విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలతోపాటు తూర్పుగోదావరి జిల్లాలో టేకు కలప కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన వేణు, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి రావులపాలెంలో టింబరు డిపోను పరిశీలించారు. సింహాచలం అడవుల్లోని 25 నుంచి 30 సంవత్సరాల కిందట తీసిన పాత కలప కోసం ప్రయత్నిస్తున్నారు.

► దగ్ధమైన రథానికి వినియోగించిన టేకు బర్మా నుంచి తెచ్చారు. ఆ రథం నిర్మాణం జరిగి 54 ఏళ్లు పూర్తయినా చెక్కు చెదర లేదు. అందుకు తగ్గట్టుగానే కొత్త రథం సుమారు 100 సంవత్సరాల మన్నిక ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

► కొత్త రథానికి ఫైర్‌ సేఫ్టీ ఏర్పాట్లు చేయాలనుకుంటున్నారు. ఈ విషయంపై రాష్ట్రంలో 80 ర«థాల నిర్మాణంలో క్రియాశీలకంగా వ్యవహరించిన గణపతి ఆచారి అభిప్రాయాన్ని కూడా తీసుకున్నారు.

సాంకేతిక పరిజ్ఞానం జోడించి...

► ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరుగా రథానికే నీటి సరఫరా ఉండేలా ప్రత్యేక పైపులను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. రథం ఉంచే షెడ్డుకు కూడా అవసరాన్ని బట్టి నిరంతరం నీటి సరఫరా జరిగేలా పైపులుండేలా డిజైన్‌ను రూపొందిస్తున్నారు.

► నాణ్యత, రక్షణ విషయంలో రాజీపడకుండా రథం నిర్మాణానికి రూ.1.10 కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. దగ్ధమైన రథం 39.7 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పు ఉండేది. ప్రస్తుత కొత్త రథం 40 నుంచి 41 అడుగులతో నిర్మించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.

► వచ్చే ఫిబ్రవరిలో జరిగే స్వామి ఉత్సవాల కంటే ముందుగానే రథం సిద్ధం చేయాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉంది.

10 రోజుల్లో కొత్త డిజైన్‌

కొత్త రథం డిజైన్‌ కోసం ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో దేవదాయ, అటవీ, అగ్నిమాపక, పోలీసు శాఖ ప్రతినిధులు ఉన్నారు. పది రోజుల్లో కొత్త రథం డిజైన్‌ కొలిక్కి వస్తుంది. నాణ్యమైన కలప లభ్యతను బట్టే కొత్త రథం డిజైన్‌ ఉంటుందని అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఈవో వై భద్రాజీ రావు తెలిపారు.

Web TitleArrangements for New Chariot Construction at Antervedi Temple in Andhra Pradesh
Next Story