పోలవరం నిధులకు ఆమోదం

పోలవరం నిధులకు ఆమోదం
x
Highlights

పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి రూ.55,548.87 కోట్లు సవరించిన ఒప్పందాలకు కేంద్ర జలశక్తిశాఖ సలహాసంఘం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం...

పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి రూ.55,548.87 కోట్లు సవరించిన ఒప్పందాలకు కేంద్ర జలశక్తిశాఖ సలహాసంఘం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో కీలక ప్రకటన చేసింది. 2017-18 ధరలకు అనుగుణంగా తుది అంచనాలను ఖరారు చేసినట్టు కేంద్ర జలశక్తిశాఖ సోమవారం రాజ్యసభలో తెలియజేసింది. రాజ్యసభలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జలశక్తిశాఖ సహాయ మంత్రి రతన్‌ లాల్‌ కటారియా రాత పూర్వకంగా జవాబిస్తూ ఈ విషయాన్ని తెలిపారు. జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సలహా సంఘం ఈ ప్రతిపాదనలను పరిశీలించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 11న జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన సవరించిన అంచనా వ్యయం ప్రతిపాదనను ఆమోదించడం జరిగింది.

2017-18 ధరల ప్రాతిపదికన పోలవరం ప్రాజెక్ట్‌కు సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87కోట్లుగా నిర్ధారించి ఆ మేరకు ఆమోదం తెలిపినట్లు మంత్రి వెల్లడించారు. సవరించిన అంచనా వ్యయం ప్రకారం పోలవరం కుడి ప్రధాన కాలువ పనులకు రూ. 4,318.97 కోట్లు, ఎడమ ప్రధాన కాలువకు రూ. 4,202.69 కోట్లు, హెడ్‌ వర్క్స్‌కు రూ.9,734.34 కోట్లు, పవర్‌ హౌస్‌ పనులకు రూ. 4,124.64 కోట్లు, భూసేకరణ, పునరావాసం, పునర్నిర్మాణ పనులకు రూ.33,168.23 కోట్ల రూపాయలు అంచనా ఖర్చులకు ఆమోదం తెలిపినట్లు మంత్రి వివరించారు.

పోలవరం ప్రాజెక్ట్‌లోని వివిధ విభాగాల పనుల నిర్వహణ నిమిత్తం 2014 ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ, కేంద్ర జల వనరుల సంఘం ఆమోదం మేరకు కేంద్ర సహాయం కింద రూ.6,764.16 కోట్ల రూపాయలు విడుదల అయినట్లు మంత్రి వెల్లడించారు. తదుపరి నిధుల విడుదల కోసం 2014 మార్చి 31 వరకు చేసిన ఖర్చుకు సంబంధించి ఆడిట్‌ నివేదిక సమర్పించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికి రెండుసార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆడిట్‌ నివేదిక సమర్పించిన తర్వాత మాత్రమే తదుపరి నిధుల విడుదల జరగుతుందని మంత్రి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం పోలవరం ప్రాజెక్ట్‌ పనులకు జీఎస్టీ వర్తింపచేస్తున్నారు. పోలవరం పనులకు జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన తమకు అందలేదని మంత్రి కటారియా చెప్పారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories