AP Weather Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి మూడు రోజుల పాటు వానలే వానలు

AP Weather Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి మూడు రోజుల పాటు వానలే వానలు
x
Highlights

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి మూడు రోజుల పాటు వానలే వానలు

AP Weather Alert: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ షాకింగ్ అప్‌డేట్ ఇచ్చింది. ఒకవైపు ఫిబ్రవరి నెలలోనే ఎండలు మండిపోతుంటే, మరోవైపు బంగాళాఖాతంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రాబోయే 48 గంటల్లో అల్పపీడనంగా బలపడనుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఏపీ తీరం వైపు వచ్చే అవకాశం ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా రానున్న మూడు రోజుల పాటు వాతావరణం అల్లకల్లోలంగా మారనుంది. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు దంచికొట్టే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.

ఈ అల్పపీడన ప్రభావం ప్రధానంగా తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలపై తీవ్రంగా ఉండబోతోంది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పిడుగులు పడే ప్రమాదం కూడా ఉన్నందున పొలాల్లో ఉండే రైతులు, గొర్రెల కాపరులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. మిగిలిన జిల్లాల్లో కూడా ఆకాశం మేఘావృతమై ఉండి, అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. వర్షం కురిసే సమయంలో విద్యుత్ స్తంభాలకు, చెట్ల కిందకు వెళ్లకూడదని అధికారులు గట్టిగా హెచ్చరిస్తున్నారు.

సాధారణంగా మార్చి నుంచి మొదలవ్వాల్సిన ఎండల సెగలు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో గరిష్ఠంగా 36.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం విశేషం. ఉదయం 10 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో జనం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. అల్పపీడనం వల్ల వచ్చే వర్షాలు తాత్కాలికంగా చల్లదనాన్ని ఇస్తాయని ఆశించినప్పటికీ, వర్షం తగ్గాక పెరిగే ఉక్కపోత మరింత ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంది.

ఈ ఏడాది వేసవి కాలం గతం కంటే భయంకరంగా ఉండబోతోందని వాతావరణ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరిలోనే 36 డిగ్రీలు దాటిందంటే, ఇక ఏప్రిల్, మే నెలల్లో నిప్పుల కొలిమిని తలపించడం ఖాయంగా కనిపిస్తోంది. పసిపిల్లలు, వృద్ధులు ఎండల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అల్పపీడనం వల్ల కురిసే అకాల వర్షాలు రైతన్నల పంటలపై ఎలాంటి ప్రభావం చూపుతాయోనని ఆందోళన వ్యక్తమవుతోంది. మొత్తం మీద ఏపీలో వాతావరణం ఒక కన్ను ఎండ.. ఒక కన్ను వాన అన్నట్లుగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories