AP: పండుగ వేళ విషాదం.. ఊరంతా కాలి బూడిదైంది..!!

AP: పండుగ వేళ విషాదం.. ఊరంతా కాలి బూడిదైంది..!!
x
Highlights

AP: పండుగ వేళ విషాదం.. ఊరంతా కాలి బూడిదైంది..!!

AP: సంక్రాంతి పండుగ వేళ పల్లెల్లో ఆనందం వెల్లివిరుస్తుంటే… కాకినాడ జిల్లా మన్యం గ్రామం సార్లంకపల్లె మాత్రం కన్నీట్లో మునిగింది. పండుగ సంబరాలతో కళకళలాడాల్సిన ఆ ఊరు ఒక్కసారిగా బూడిద కుప్పగా మారింది. సోమవారం చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదంలో దాదాపు 40 కుటుంబాలు తమ ఇళ్లు, ఆస్తులను కోల్పోయి రోడ్డున పడ్డాయి.

పండుగ ఏర్పాట్ల కోసం గ్రామస్థులంతా తుని పట్టణానికి వెళ్లారు. సంక్రాంతి సరుకులు, నిత్యావసరాలు కొనుగోలు చేసి తిరిగి వచ్చేలోపే విధి వక్రీకరించింది. గ్రామంలో ఒక ఇంట్లో గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. గాలివాటం, ఇళ్ల మధ్య దూరం తక్కువగా ఉండటంతో మంటలు క్షణాల్లోనే పక్కపక్కనున్న ఇళ్లకు వ్యాపించాయి.

గ్రామస్థులు సమాచారం అందించిన వెంటనే తుని నుంచి ఫైరింజిన్ బయలుదేరింది. అయితే గ్రామానికి చేరుకునేలోపే సుమారు 50 కిలోమీటర్ల దూరం ఉండటంతో విలువైన సమయం వృథా అయ్యింది. అప్పటికే ఇళ్లన్నీ దగ్ధమైపోయాయి. ఇంట్లో ఉన్న బట్టలు, ధాన్యం, నగదు, పత్రాలు అన్నీ మంటల్లో కాలిపోయాయి. కొందరు పండుగ కోసం దాచుకున్న బంగారం కూడా బూడిదైంది.

ఇళ్లు కోల్పోయిన కుటుంబాలు ఇప్పుడు తలదాచుకునే చోటు లేక అవేదన వ్యక్తం చేస్తున్నాయి. పండుగ రోజు ఇలా జరగడంతో గ్రామమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. అధికార యంత్రాంగం నష్టాన్ని అంచనా వేసి సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories