ఇవాళ వైసీపీ అభ్యర్థుల నామినేషన్.. నాలుగేళ్ల లోపే పదవి విరమణ..

ఏపీ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే....
ఏపీ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల సంఖ్యా పరంగా చూసుకుంటే మూడు స్థానాలు వైసీపీ ఖాతాలోకే వెళ్లనున్నాయి. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మోపిదేవి వెంకటరమణ, మహ్మద్ ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డి ఎంపికయ్యారు. వీరు ఈరోజు ఉదయం 11 గంటలకు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. వెలగపూడిలోని అసెంబ్లీ కార్యదర్శి, శాసనమండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేయనున్నారు. కాగా వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. టీడీపీ సభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తి, వైసీపీ సభ్యులు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), కోలగట్ల వీరభద్రస్వామి శాసనసభకు ఎన్నికవడంతో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దాంతో ఈ మూడు ఖాళీలు ఏర్పడ్డాయి. కరణం, నాని పదవీకాలం 2023 మార్చి 29న ముగియాల్సి ఉండగా.. కోలగట్ల పదవీకాలం 2021 మార్చి 29 వరకు ఉంది. వాస్తవంగా ఎమ్మెల్సీకి ఆరుసంవత్సరాల పదవి సమయం ఉండగా వీరి పదవి నాలుగేళ్ల లోపే పూర్తి కానుంది.