
అంగన్వాడీలకు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్.. ఇకపై రూ.2 లక్షల బీమా భరోసా!
AP Govt News : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు గుడ్ న్యూస్ అందించింది. చిన్నారులకు, గర్భిణీలకు సేవలందిస్తూ క్షేత్రస్థాయిలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీల సంక్షేమం కోసం ప్రభుత్వం ఒక గొప్ప ముందడుగు వేసింది. వారికి సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలను రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రధాని బీమా పథకాలతో కొండంత భరోసా
తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని వేలాది మంది అంగన్వాడీ కార్యకర్తలకు ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన(PMJJBY), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన(PMSBY) పథకాలు వర్తించనున్నాయి. విధి నిర్వహణలో లేదా వ్యక్తిగత జీవితంలో ఏదైనా అనుకోని ప్రమాదం సంభవించినప్పుడు వారి కుటుంబాలు రోడ్డున పడకుండా ఈ పథకాలు ఆర్థిక ఆసరాగా నిలుస్తాయి. ప్రభుత్వ నిర్ణయంపై అంగన్వాడీ వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
ఏ పథకం ద్వారా ఎలాంటి ప్రయోజనం?
ముందుగా ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన గురించి చూస్తే.. 18 నుంచి 50 ఏళ్ల లోపు వయసున్న వారు ఈ బీమా పొందేందుకు అర్హులు. ఏడాదికి కేవలం రూ.436 ప్రీమియంతో రూ.2 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ లభిస్తుంది. ఏదైనా కారణంతో లబ్ధిదారుడు మరణిస్తే వారి కుటుంబానికి ఈ సొమ్ము అందుతుంది.
ఇక ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనేది అత్యల్ప ప్రీమియంతో లభించే అతిపెద్ద భద్రత. కేవలం ఏడాదికి రూ.20 చెల్లిస్తే చాలు.. ప్రమాదవశాత్తూ మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం సంభవించినా రూ.2 లక్షల వరకు బీమా పరిహారం అందుతుంది. ఒకవేళ పాక్షిక అంగవైకల్యం కలిగితే రూ.లక్ష వరకు ఆర్థిక సాయం అందుతుంది.
అంగన్వాడీలకు ఆర్థిక రక్షణ
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న వేలాది మంది కార్యకర్తలు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ భద్రత లభించే ఈ స్కీమ్లు అంగన్వాడీల జీవితాల్లో వెలుగులు నింపుతాయని అధికారులు పేర్కొంటున్నారు. తమ ప్రాణాలకు భరోసా కల్పించినందుకు అంగన్వాడీ సంఘాలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




