
పల్లె వెలుగు నుంచి ఎక్స్ప్రెస్ దాకా.. ఇక మీద పురుషులకు కూడా ఫ్రీ బస్ సౌకర్యం
Free RTC Bus : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం అదిరిపోయే కానుకను అందించింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మార్చి 1 (ఆదివారం) నుంచి అధికారికంగా అమలులోకి తెచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కేబినెట్ ఫిబ్రవరి 24న తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించి, ఫిబ్రవరి 28న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంద్రధనస్సు పేరుతో దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రకటించిన ఆరు ప్రధాన పథకాల్లో భాగంగా ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని మొదటి ప్రాధాన్యతగా ప్రభుత్వం ప్రారంభించింది.
ఈ పథకం కింద రాష్ట్రంలోని సుమారు 11 లక్షల మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరనుంది. 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పొందవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో మహిళల కోసం అమలవుతున్న స్త్రీ శక్తి పథకం తరహాలోనే, ఇప్పుడు దివ్యాంగులైన పురుషులకు కూడా ఈ వెసులుబాటు కల్పించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పనుల కోసం పట్టణాలకు వచ్చే దివ్యాంగులకు ఇది ఆర్థికంగా పెద్ద ఊరటనిస్తుందని చెప్పవచ్చు.
దివ్యాంగులు ఏపీఎస్ఆర్టీసీకి చెందిన నాలుగు రకాల బస్సుల్లో రూపాయి ఖర్చు లేకుండా ప్రయాణించవచ్చు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ (మెట్రో ఎక్స్ప్రెస్), ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అయితే, లాంగ్ డిస్టెన్స్ బస్సులైన నాన్ స్టాప్, సప్తగిరి ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్ మరియు అంతరాష్ట్ర సర్వీసుల్లో మాత్రం గతంలో ఉన్నట్లుగానే 50 శాతం రాయితీ కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనివల్ల దివ్యాంగులు తమ అవసరాలకు తగ్గట్టుగా బస్సులను ఎంచుకునే అవకాశం ఉంటుంది.
గత ఏడాది డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా చంద్రబాబు ఈ హామీని ఇచ్చారు. ఇంద్రధనస్సు పేరుతో దివ్యాంగుల కోసం రూపొందించిన మిగిలిన పథకాలను కూడా దశలవారీగా అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాగా, పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో ప్రస్తుతం దివ్యాంగులకు బస్సుల్లో 50 శాతం రాయితీ మాత్రమే ఉంది. ఏపీలో ఉచిత ప్రయాణం ప్రారంభం కావడంతో, తెలంగాణలో కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకోవాలని అక్కడి దివ్యాంగుల సంఘాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఏది ఏమైనా, ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దివ్యాంగుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




