కడప స్టీల్ ప్లాంటు నిర్మాణం మూడేళ్ళలో పూర్తిచేస్తాం: సీఎం జగన్

కడప స్టీల్ ప్లాంటు నిర్మాణం మూడేళ్ళలో పూర్తిచేస్తాం: సీఎం జగన్
x
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
Highlights

స్టీల్ ప్లాంటు నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

స్టీల్ ప్లాంటు నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద కొత్తగా నిర్మిస్తున్న స్టీల్‌ కర్మాగారం నిర్మాణం వద్ద సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం పునాది రాయి వేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. అంతకుముందు సీఎం వైఎస్‌ జగన్‌కు జిల్లా ఇంచార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఉక్కు కర్మాగారం ఏర్పాటుతో జిల్లా సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించాక జిల్లాను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నికల కోసమని ఆరునెలల ముందు ఉక్కు కర్మాగారానికి టెంకాయ కొడితే మోసం అంటరాని, కానీ అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే టెంకాయ కొడితే అది చిత్తశుద్ధి అంటరాని అన్నారు. రాయలసీమ ఆర్ధిక చరిత్రను, ఉద్యోగాల చరిత్రను మార్చేలా 30 లక్షల టన్నులు ఉత్పత్తి చేసే ఉక్కు కర్మాగారానికి శ్రీకారం చుట్టామని అన్నారు. ఈ ఫ్యాక్టరీ వలన 25 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని అన్నారు. కడప స్టీల్ ప్లాంటుకు aphsl మరియు apnmdc సంస్థలు ముడి సరుకును సప్లై చేసేలా కృషి చేసిన కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు ధన్యవాదాలు తెలుపుతున్నాని అన్నారు. గతంలో రాష్ట్రం విడగొట్టేముందు ఏపీకి ప్రత్యేక హోదా తోపాటు కడపకు ఉక్కు కర్మాగారం ఇస్తామని చెప్పి మాట తప్పారని అన్నారు.

దేశంలో 2018 నాటికి ఉక్కు పరిశ్రమ సామర్ధ్యం ఒక కోటి నాలుగు లక్షలు.. కానీ ప్రస్తుతం దేశానికీ మూడు కోట్ల టన్నులు అవసరమని.. అందులో 30 లక్షల సామర్ధ్యం కడప నుంచే రాబోయే రోజుల్లో వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా మూడేళ్ళలోనే ఈ ఉక్కు కర్మాగారం నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రూ.15 వేల కోట్లతో ఉక్కు కర్మాగారం నిర్మాణం చేపట్టినట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. గతంలో ఉక్కు కర్మాగారానికి ఉద్యమాలు జరిగాయని.. కానీ తాము అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే ఏ ఉద్యమాలు లేకుండానే ఈ కార్యక్రమం చేపట్టినట్టు స్పష్టం చేశారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఇదిలావుంటే నేటి నుంచి మూడు రోజుల పాటు సీఎం వైఎస్‌ జగన్‌ వైఎస్సార్‌ జిల్లాలోనే ఉంటారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories