ముగ్గురు మంత్రులకు జగన్‌ ఎందుకు క్లాస్ తీసుకున్నారు?

ముగ్గురు మంత్రులకు జగన్‌ ఎందుకు క్లాస్ తీసుకున్నారు?
x
Highlights

ముందే చెప్పారు జగన్‌. అలా చేస్తే కుదరదని. అయినా వింటేగా. గతం తాలుకు అలవాటైన రీతిలో స్కెచ్చేశారు. ప్లాన్‌ పక్కాగా రెడీ చేసుకున్నారు. ఇక అప్లై చేయడమే...

ముందే చెప్పారు జగన్‌. అలా చేస్తే కుదరదని. అయినా వింటేగా. గతం తాలుకు అలవాటైన రీతిలో స్కెచ్చేశారు. ప్లాన్‌ పక్కాగా రెడీ చేసుకున్నారు. ఇక అప్లై చేయడమే తరువాయి. కానీ జగన్‌ ఐ ఫాలో చేసింది. జగన్‌ నిఘా బృందం ఆ మంత్రులను వెంటాడింది. తప్పు జరిగేలోపు, పట్టేసుకుంది. సదరు మంత్రుల ఘనకార్యంపై సీఎంకు సవివరంగా రిపోర్ట్ ఇచ్చింది. డామిట్. కథ అడ్డతిరిగిందని లోలోపల గింగిరాలు తిరిగిన నేతలు, జగన్‌ తీసుకున్న క్లాస్‌తో మరింత గింగిరాలు తిరిగారట. ఇంకోసారి అలా చేస్తూ ఊరుకునేది లేదంటూ ముఖ్యమంత్రి హెచ్చరించడంతో ఖంగుతిన్నారట ముగ్గురు మినిస్టర్లు. ఇంతకీ జగన్‌ ఎందుకు క్లాస్ తీసుకున్నారు. వీరు చేసిందేంటి? ఆ మినిస్టర్లు ఎవరన్నదానిపై ఎలాంటి చర్చ జరుగుతోంది.

పదేళ్ల పోరాటం తర్వాత తొలిసారి అధికార పీఠాన్ని దక్కించుకున్న వైసీపీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి, పాలనలోనూ తనదైన మార్కు చూపించేందుకు తపిస్తున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం మొదలు, కేబినెట్‌ మీటింగ్‌, శాఖలవారీగా సమీక్షలు, అసెంబ్లీ సమావేశాల్లో దూకుడువైఖరి. ఇలా చాలా ఫాస్ట్‌పార్వర్డ్‌‌గా దుమ్ము దులుపుతున్నారన్న పేరు తెచ్చుకున్నారు జగన్. ఫుల్‌ క్లారిటీ తనకావాల్సింది రాబట్టుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. ఇదే నేపథ్యంలో అవినీతి విషయంలో ఇద్దరు, ముగ్గురు మంత్రులకు క్లాస్‌ పీకారని బయటికొస్తున్న వార్త సంచలనం సృష్టిస్తోంది. ఆ మంత్రులు ఎవరన్నదానిపై, ఎవరికివారు తమ మెదడుకు పదునుపెడుతున్నారు.

అధికారుల‌తోను, మంత్రుల‌తోను పార్టీ నేత‌ల‌తోను తాను ఏం చేయ‌బోతున్నాను? త‌న‌కి ఏం కావాలి? అనే అంశాల‌కు సంబంధించి జ‌గ‌న్ తొలి నుంచి చాలా క్లారిటీగా ముందుకెళుతున్నారు. మొద‌టిసారి ముఖ్యమంత్రి అయ్యాడు కదా, యువ వయస్సే కదా, అని కొందరు సీనియర్ మంత్రులు కాస్త దూకుడు ప్రదర్శించడానికి ప్రయత్నించి, బొక్కబోర్లాపడ్డారన్న సంగతి కూడా అమరావతిలో చక్కర్లు కొడుతోంది. స‌చివాల‌యంలో మంత్రుల‌తో పాటు కీల‌క అధికారుల క‌దిలిక‌ల‌పై కూడా జ‌గ‌న్ ఎప్పటిక‌ప్పుడు ఒక క‌న్నేసి ఉంచిన‌ట్లు స‌న్నిహిత‌వ‌ర్గాలు మాట్లాడుకుంటున్నాయి.

తన క్యాబినె‌ట్‌లో ఉన్న మంత్రుల నెలరోజుల పాలనపై సమీక్ష జరిపారట జగన్. ఇందులో భాగంగా కొందరికి బాగానే అక్షింతలు పడ్డాయట. మరికొందరికి ప్రశంసలూ దక్కాయట. అందుకే చాలామంది మంత్రులు, జగన్ మనస్సులో ఏముందో అర్థం చేసుకోవడం అంతఈజీ కాదని మాట్లాడుకుంటున్నారు. తనకి నచ్చాలి లేకపోతే దానిపై ఏమాత్రం దృష్టి పెట్టరట జగన్. పైగా తనతో కలిసి పనిచేయాలనుకుంటే, తనదారిలో పయనించాలి, లేకుంటే మీ ఇష్టమని ముఖంమీదే చెప్పేస్తారట. గతంలోనూ చాలామంది ముఖ్యమంత్రులతో పని చేసిన మంత్రులు, ప్రస్తుతం జగన్‌ కేబినెట్లోనూ ఉన్నారు. జగన్‌ స్టైల్‌ ఆఫ్‌ వర్కింగ్ చూసి, ఆశ్చర్యపోతున్నారట. ఆ స్పీడందుకోవడం ఒకెత్తయితే, నిక్కచ్చితనాన్ని చూసి కేర్‌ఫుల్‌గా ఉంటున్నారట.

కొందరు మంత్రులు తమకు అలవాటైన రీతిలో దోచుకుందామని భావించారని తెలిసింది. రాకరాక అధికారమొచ్చింది, చాలా ఆకలితో ఉన్నాం, అందినకాడికి దోచుకుందాం..దాచుకుందం అనుకున్నవారిపై నిరంతర నిఘాపెడుతున్నారట జగన్. ఎప్పటికప్పుడు వారిపై రిపోర్ట్‌లు కూడా తెప్పించుకుంటున్నారట. నిఘా కేవలం మంత్రుపైనే కాదు శాసనసభ్యులు, ముఖ్యకార్యదర్ములు, తన వద్ద పనిచేస్తున్న అధికారులను కూడా వెంటాడుతోందట. తేడా వచ్చిందంటే బాబులా మార్కులు ఇవ్వడం కాదు, పిలిచి మాంచి భోజనం పెట్టి మీ పనితీరు బాగోలేదు, ఉంటే ఉండండి పోతే పోండి అంటూ డైరెక్ట్‌గా హెచ్చరికలు జారీ చేస్తున్నారట సీఎం జగన్.

సీఎం చెబుతూనే ఉంటారు, మనపని మనదేలే అనుకున్న ఓ మంత్రిగారి సంగతి పట్టారట జగన్. ఉత్తరాంధ్రకి చెందిన ఆ సీనియర్ మంత్రి, జగన్‌కు ఏమాత్రం చెప్పకుండా తమ శాఖపై సమీక్ష పెట్టి, ఉన్నధికారులతో రైడింగ్ పెట్టి కౌంటర్ ప్రారంభానికి సిద్దమయ్యారట. సదరు మినిస్టర్‌పై గురిపెట్టారు జగన్. మీరు వ్యవహరిస్తున్న తీరుతో పార్టీకి, కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. మీరు ఇలానే ఉంటే, కష్టమని వార్నింగ్ ఇచ్చారట. దీంతో బల్లకింద చేయి పెట్టాలని చూసిన సదరుమంత్రి షాక్ అయ్యి, ఏదో సర్దిచెప్పుకోబోయి ఆనక సైలెంటయ్యారట.

ఆయనే కాదు, ఉభయగోదావరి జిల్లాకి చెందిన మరో మాహిళా మంత్రితో పాటు, మరో జూనియర్ మంత్రికి సైతం పద్దతి మార్చుకోండి అంటూ ఫస్ట్‌ వార్నింగ్ బెల్ మోగించారట. అక్షింతలే కాదు ప్రశంసలు అందుకున్న మినిస్టర్లు కూడా జగన్‌ కేబినెట్‌లో ఉన్నారు. తాజాగా రిజిస్ట్రేషన్ శాఖలో బదీలీల కోసం డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌‌కు ఓ అధికారి కోటి రూపాయలు ఆఫర్ చేశారట. తనకు పలానా చోట పోస్టింగ్ కావాలని లంచం ఇవ్వచూపాడట. అయితే ఆ ఆఫర్‌ను సదరు మంత్రి తిరస్కరించి, జగన్‌ దగ్గర మంచి మార్కులు కొట్టేశారట. మిగతా మంత్రులు కూడా పిల్లి సుభాష్‌ను స్ఫూర్తిగా తీసుకుని నీతిగా ముందుకెళ్లాలని చెప్పారట జగన్.

అలాగే ఇద్దరు యువ మంత్రులైన అనిల్ కుమార్ యాదవ్, కన్నబాబులకి జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారట. మీరు మీశాఖలతో పాటుగా మీకు అనుబంధంగా ఉన్న శాఖలపై దృష్టి పెట్టాలని సూచించారట. చాలా మంది మంత్రులు తాము గడిచిన ఎన్నికల్లో చాలా ఖర్చుపెట్టాము, జిల్లాలో కొందరికి సహాయం చేశామని జగన్‌ దగ్గర గోడు వెళ్లబోసుకున్నారట. అయితే అలాంటివారికి ఆర్థిక సహాయం చేయాలని సూచించారట జగన్. అంతేకానీ అవినీతికి పాల్పడవద్దని ఫస్ట్‌ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇచ్చారట.

మొత్తానికి జగన్‌ వర్కింగ్ స్టైల్ చూసి, మంత్రులు అలర్టయ్యారు. చేయి తడపాలనుకునే మినిస్టర్లకు కాస్త గట్టిగానే తగిలించడంతో మిగతా వారు సైతం అప్రమత్తమయ్యారట. జగన్‌తో కలిసి పని చేయడం అంత ఈజీ కాదని, ప్రతి అడుగులోనూ కేర్‌ఫుల్‌గా ఉండాలని భావిస్తున్నారట మంత్రులు. నిత్యం నిఘా కళ్లు వెంటాడుతుండటంతో, ఎవరు నిఘానో, ఎవరు అధికారులో తెలియక జాగ్రత్తగా ఉంటున్నారట మంత్రులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories