సీనియర్ జర్నలిస్ట్ తుర్లపాటి కుటుంబరావు మృతికి సీఎం జగన్ సంతాపం

సీనియర్ జర్నలిస్ట్ తుర్లపాటి కుటుంబరావు మృతికి సీఎం జగన్ సంతాపం
x
Highlights

పాత్రికేయ భీష్ముడిగా ప్రసిద్ధి చెందిన సీనియర్ జర్నలిస్ట్ పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు(89) ఆదివారం రాత్రి కన్నుమూశారు.

పాత్రికేయ భీష్ముడిగా ప్రసిద్ధి చెందిన సీనియర్ జర్నలిస్ట్ పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు(89) ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఆయనకు నిన్న రాత్రి గుండేపోటు రావడంతో విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తుర్లపాటి కుటుంబరావు మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తుర్లపాటి మృతిపట్ల మాజీ ముఖ్యమంత్రి, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియ చేశారు. ఈ సందర్భంగా తుర్లపాటితో కలిసి పనిచేసిన రోజులను చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. ఆయన మృతి పట్ల ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు సంతాపం తెలిపారు.

పాత్రికేయ వృత్తిలో తుర్లపాటి కుటుంబరావుకీ సుదీర్ఘ అనుభవం ఉంది. దాదాపు ఏడు దశాబ్దాల పాటు అనేక విషయాలపై విశ్లేషణలు చేశారు. జర్నలిస్టుగా, రచయితగా, వ్యాఖ్యాతగా, సభ అధ్యక్షుడిగా, అనువాద ప్రసంగికునిగా తుర్లపాటి కుటుంబరావు ప్రసిద్ధికెక్కారు. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు నుంచి మొదలు కొని నారా చంద్రబాబు వరకు 18 మంది ముఖ్యమంత్రులతో తుర్లపాటి పనిచేశారు.

టంగుటూరి ప్రకాశం పంతులు ఆయన్ని చెన్నైకి పిలిపించి, తను నడుపుతున్న ప్రజాపత్రికలో సహాయ సంపాదకుడిగా నియమించారు. ఆయన రాసిన '18 మంది ముఖ్యమంత్రులతో నా ముచ్చట్లు' అనే పుస్తకంలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పద్మశ్రీ అవార్డు పొందిన తొలి తెలుగు జర్నలిస్టుగా పేరు గడించారు తుర్లపాటి కుటుంబరావు. ఆంధ్రప్రదేశ్‌లో, ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో దాదాపు 20 వేల సమావేశాల్లో వక్తగా ప్రసంగించారు. దీంతో గిన్నిస్‌ బుక్‌ రికార్డు సాధించారు. కేంద్రం ప్రభుత్వం 2002లో జర్నలిస్టుగా, రచయితగా, వక్తగా ఆయన చేసిన సేవలను గుర్తించి ప్రతిష్టాత్మక పద్మశ్రీని అందించింది.

తుర్లపాటి కుటుంబరావు 14 ఏళ్ల ప్రాయంలో విజయవాడకు వచ్చిన మహత్మా గాంధీ నుంచి ఆటోగ్రాఫ్‌ పొందారు. 1998లో అమెరికా నుంచి వరల్డ్‌ లైఫ్‌ టైం అచీవ్‌ మెంట్‌ అవార్డు తుర్లపాటి పొందారు. ప్రముఖ నాయకులు అంబేద్కర్‌, నెహ్రూ, రాజాజీలను ఇంటర్వ్యూ చేశారు. కుటుంబరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ పరిషత్తు ఛైర్మన్‌గా పనిచేశారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్తు కుటుంబారావును కళాప్రపూర్ణతో గౌరవించింది. కేంద్రం ప్రభుత్వం తుర్లపాటిని 1969లో నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ కమిటీలో సభ్యునిగా నియమించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories