AP Budget 2026: నేడే ఏపీ బడ్జెట్..రూ.3.46 లక్షల కోట్లతో చంద్రన్న 'ప్రగతి' ప్రణాళిక..సూపర్ సిక్స్‌కు పెద్ద పీట

AP Budget 2026: నేడే ఏపీ బడ్జెట్..రూ.3.46 లక్షల కోట్లతో చంద్రన్న ప్రగతి ప్రణాళిక..సూపర్ సిక్స్‌కు పెద్ద పీట
x
Highlights

నేడే ఏపీ బడ్జెట్..రూ.3.46 లక్షల కోట్లతో చంద్రన్న 'ప్రగతి' ప్రణాళిక..సూపర్ సిక్స్‌కు పెద్ద పీట

AP Budget 2026: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా నేడు (ఫిబ్రవరి 14) కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రవేశపెడుతున్న మూడవ పూర్తిస్థాయి బడ్జెట్‌పై రాష్ట్రవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో రూ.3.46 లక్షల కోట్ల అంచనా వ్యయంతో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ కేవలం అంకెల గారడీ మాత్రమే కాకుండా, ఎన్నికల హామీల అమలు, రాష్ట్ర అభివృద్ధికి ఒక మార్గదర్శిగా నిలవనుంది.

సూపర్ సిక్స్ గ్యారెంటీలే ప్రధాన అస్త్రం

ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం తన మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాల అమలుకు సింహభాగం నిధులను కేటాయించినట్లు తెలుస్తోంది. సుమారు రూ.28,000 కోట్లు ఒక్క ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసమే కేటాయించగా, తల్లికి వందనం పథకానికి రూ.10,000 కోట్లు, అన్నదాత సుఖీభవ కింద రైతులకు పెట్టుబడి సాయం కోసం రూ.7,000 కోట్లు కేటాయించే అవకాశం ఉంది. వీటితో పాటు దీపం 2.0 (ఉచిత సిలిండర్లు), స్త్రీశక్తి, నిరుద్యోగ భృతి వంటి పథకాలకు కూడా భారీగానే నిధులు మళ్లించనున్నారు. సంక్షేమంతో పాటు పరిశ్రమల స్థాపనకు ప్రత్యేక రాయితీలు ఇచ్చి యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

పోలవరం, అమరావతికి నిధుల వరద

రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును వచ్చే రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం, అందుకు తగ్గట్లుగానే బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న ముందస్తు నిధులను సమర్థవంతంగా వాడుకుంటూ, సాగునీటి రంగానికి ఊపిరి పోయనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు భారీ కేటాయింపులు ఉండనున్నాయి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంటి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు సుమారు రూ.3,500 కోట్లు ప్రత్యేకంగా వెచ్చించనున్నట్లు సమాచారం.

ఆర్థిక వనరుల వేట.. 16వ ఆర్థిక సంఘం భరోసా

రాష్ట్రం ప్రస్తుతం ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో, కేంద్రం నుంచి అందే పన్నుల వాటాపై ప్రభుత్వం గట్టి ఆశలు పెట్టుకుంది. 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర పన్నుల్లో వాటా పెరిగే అవకాశం ఉండటం కలిసొచ్చే అంశం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికి రూ.1.40 లక్షల కోట్ల రెవెన్యూ రాబడి రాగా, రాబోయే ఏడాదిలో రాష్ట్ర సొంత రాబడులను పెంచుకోవడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ముఖ్యంగా జీఎస్‌డీపీ వృద్ధి రేటుకు అనుగుణంగా జిల్లా స్థాయిలో ఆదాయ వనరులను సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ప్రాంతీయ అభివృద్ధి.. రాయలసీమకు హార్టికల్చర్ హబ్

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే వ్యూహంతో మూడు ఆర్థిక మండలాల ప్రతిపాదనను బడ్జెట్‌లో ప్రస్తావించనున్నారు. రాయలసీమను ప్రపంచ స్థాయి ఉద్యానవన హబ్ గా మార్చేందుకు ప్రత్యేక నిధులు కేటాయించనున్నారు. రహదారుల మరమ్మతులు, కొత్త బ్రిడ్జీల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యతనిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయనున్నారు. బడ్జెట్ అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను సమర్పించి, సాగు విధానాల్లో తీసుకురానున్న విప్లవాత్మక మార్పులను వివరించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories