logo
ఆంధ్రప్రదేశ్

నేడు కోడెల ప్రథమ వర్థంతి.. ఆయన ప్రస్థానం ఇలా..

నేడు కోడెల ప్రథమ వర్థంతి.. ఆయన ప్రస్థానం ఇలా..
X
Highlights

మాజీ మంత్రి , టీడీపీ సీనియర్ నాయకుడు కోడెల శివప్రసాద్ రావు మరణించి నేటికీ ఏడాది పూర్తవుతోంది. సెప్టెంబర్ 16న శివప్రసాద రావు హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉరివేసుకున్నారు..

మాజీ మంత్రి , టీడీపీ సీనియర్ నాయకుడు కోడెల శివప్రసాద్ రావు మరణించి నేటికీ ఏడాది పూర్తవుతోంది. సెప్టెంబర్ 16న శివప్రసాద రావు హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉరివేసుకున్నారు. దాంతో ఆయనను బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి తరలించారు.. దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ కన్నుమూశారు. అయితే ఆయన మరణంపై విపరీతమైన వివాదం నెలకొంది. ప్రభుత్వం పెట్టిన కేసులు, వేధింపులకు తట్టుకోలేకే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ ఆరోపిస్తే.. కేసుల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కోడెలకు అండగా నిలవని కారణంగానే మదనపడి ఆత్మహత్య చేసుకున్నారని వైసీపీ ఆరోపించింది. ఏది ఏమైనా కోడెల ఆత్మహత్య మాత్రం పెద్ద సంచలనంగా మారింది. అసెంబ్లీలో ఫర్నీచర్ వివాదంపై కోడెలపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.. అలాగే కోడెల కుమారుడు, కుమార్తెలు.. కొందరు వ్యక్తులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి డబ్బు తీసుకొని మోసం చేసినట్టు పోలీసులు ఆరోపణలు వచ్చాయి.. దీనిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇలా కోడెల కుటుంబంపై కొన్ని ఆరోపణలు రావడంతో ఆయన మానసికంగా కృంగుబాటుకు గురయ్యారని అప్పట్లో చర్చ జరిగింది. ఈ క్రమంలోనే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇవాళ కోడెల వర్థంతి సందర్భంగా టీడీపీ కార్యకర్తలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. నరసరావుపేటలో రక్తదాన శిబిరం తోపాటు.. పలుచోట్ల కోడెల విగ్రహాలను ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు. అయితే రాష్ట్రంలో కొవిడ్‌ నిబంధనలు అమలులో ఉన్న నేపథ్యంలో ఎటువంటి కార్యక్రమాలను చేయవద్దని పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీనిపై కోడెల కుటుంబసభ్యులు మండిపడుతున్నారు.. వైసీపీ సభలకు లేని అడ్డంకులు తమకేందుకు ఉంటాయని కుమారుడు శివరామ్‌ పోలీసులను ప్రశ్నించారు.

కాగా కోడెల శివప్రసాద్ రావు గుంటూరు జిల్లా, నకరికల్లు మండలం కండ్లగుంట గ్రామంలో 1947 మే 2న జన్మించారు. అతని తల్లిదండ్రులు సంజీవయ్య,లక్ష్మీనర్సమ్మ. కోడెల ప్రాథమిక విద్యాభ్యాసం స్వగ్రామం కండ్లకుంటలోనే సాగింది. ఆ తరువాత కొద్దిరోజులు సిరిపురం లో చదివిన తరువాత, నర్సరావుపేటలోని ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివారు. విజయవాడ లయోలా కళాశాలలో పీయూసీ చదివారు. అతని చిన్న తనంలోనే తోబుట్టువులు అనారోగ్యంతో చనిపోవడం కోడెలను తీవ్రంగా కలిచివేచింది.ఆ విషాదమే అతనిని డాక్టర్ కావాలనే ఆలోచనకు బీజం వేసింది. గుంటూరులో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. వారణాసిలో ఎం.ఎస్ కూడా పూర్తి చేశారు. అనంతరం వైద్యుడిగా ప్రాక్టీస్ మొదలు పెట్టారు.

అయితే 1983లో ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన.. నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత 1999 వరకు నర్సరావుపేట నుంచి కోడెల వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2004, 2009 ఎన్నికల్లో మాత్రం ఓటమి చెందారు. 2014 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి విజయం సాధించిన కోడెల.. నవ్యాంధ్ర తొలి అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఇక ఎన్టీఆర్ హయాంలోనే ఆయన రాష్ట్ర హోమ్ శాఖా మంత్రిగా కూడా పనిచేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు చేతిలో ఓటమి చెందారు. కాగా కోడెల ప్రజా ప్రతినిధిగా ఉన్నా.. వైద్యసేవలు కూడా అందించేవారు. ఆయన హస్తవాసి మంచిదని నరసరావుపేటలో చెప్పుకుంటారు. ఇక కోడెల ముగ్గురు పిల్లలు విజయలక్ష్మి, శివరామకృష్ణ, సత్యన్నారాయణ డాక్టర్లే కావడం విశేషం.

Web Titleandhrapradesh ex assembly speaker kodela sivaprasada rao first death anniversary
Next Story