ఆలయాల్లో ప్రమాణాలతో రక్తి కడుతున్న రాజకీయాలు

ఆలయాల్లో ప్రమాణాలతో రక్తి కడుతున్న రాజకీయాలు
x
Highlights

ఏపీ రాజకీయాలు చిత్ర విచిత్రంగా సాగుతున్నాయి. నాయకుల సవాళ్ళు ప్రతి సవాళ్ళన్నీ గుళ్ళ చుట్టూనే తిరుగుతున్నాయి.

ఏపీ రాజకీయాలు చిత్ర విచిత్రంగా సాగుతున్నాయి. నాయకుల సవాళ్ళు ప్రతి సవాళ్ళన్నీ గుళ్ళ చుట్టూనే తిరుగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల నేతల నిజాయితీ నిరూపించేందుకు గుడులే వేదికలవుతున్నాయి. వీరంతా నిజంగా ఏ పాపం ఎరుగని వారేనా? లేక విగ్రహాలేం చేస్తాయనే ధైర్యమా?

ఏడాదిన్నరగా ఏపీ రాజకీయాలు రకరకాల మలుపులు తిరుగుతున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళు ప్రజలకు ఆశ్చర్యాన్ని వినోదాన్ని కలిగిస్తున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేల మీద టీడీపీ నాయకులు అవినీతి ఆరోపణలు చేయడం వైసీపీ నేతలు ప్రత్యారోపణలు చేయడం సర్వ సాధారణంగా మారిపోయింది. ఆరోపణలు నిజమని నమ్మించడం కోసం ఎదుటి వారిని రెచ్చగొట్టడం కోసం ఆలయాల్లో ప్రమాణాలంటూ రక్తి కట్టిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నుంచి కడప జిల్లా ప్రొద్దుటూరు వరకు ఇదే తంతు కొనసాగుతోంది. రెండు సంఘటనల మీద గురువారం నాడు ఒక నాయకుడు నేరుగా గుడికి వెళ్ళి ప్రమాణం చేయగా మరో నాయకుడు ముఖ్యమంత్రి జగన్‌కే సవాల్‌ విసిరాడు.

విజయనగరం జిల్లా రామతీర్థం శ్రీరాముని ఆలయంలో రాముడి విగ్రహం నుంచి శిరస్సు తొలగించడం జిల్లాలో సంచలనం రేపింది. భక్తులను తీవ్రంగా బాధించింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు గాలించి గుడి ఎదురుగా ఉన్న కోనేరులోనే విగ్రహం శిరస్సును కనుగొన్నారు. ఈ దుర్మార్గానికి కారకులు ఎవరో విచారణ జరుగుతోంది. అయితే దీనికి తెలుగుదేశం నాయకులే కారణమంటూ వైసీపీ సీనియర్‌ నేత విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణ చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ విజయనగరం జిల్లా పర్యటన సమయంలోనే ఈ సంఘటన జరగడం వెనుక నారా లోకేష్‌తో సహా టీడీపీ అగ్రనేతల హస్తం ఉందని వారి పాత్ర వెలికి తీస్తామని కూడా చెప్పారాయన. విజయసాయి మాట్లాడిన కొద్ది సేపటికే నారా లోకేష్‌ ట్వీట్‌ చేశారు. తనపై దొంగల బ్యాచ్‌తో ఫేక్‌ ఆరోపణలు చేయిస్తున్నారని ముఖ్యమంత్రి జగన్‌ మీద మండిపడ్డారు. జగన్‌ను సింహాచలం అప్పన్న ఆలయానికి రావాలని ఛాలెంజ్‌ విసిరారు లోకేష్‌. తనపై విజయసాయి చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలని అప్పన్న ఎదుట ప్రమాణం చేస్తానని ఆరోపణలు నిజమని చెప్పడానికి నువ్వు ఆలయానికి రావడానికి సిద్ధమా అని సీఎంకు సవాల్‌ విసిరారు నారా లోకేష్‌.

ఇక ప్రొద్దుటూరులో తెలుగుదేశం నాయకుడు నందం సుబ్బయ్య హత్యలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పాత్ర ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి మీద కేసు పెట్టాలని కూడా టీడీపీ నేతలు, సుబ్బయ్య భార్య డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఆ హత్యతో తనకెలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేస్తున్నారు. సుబ్బయ్య హత్యతో సంబంధం లేదంటూ నందవరం చౌడమ్మ ఆలయంలో ప్రమాణం చేశారు. తన అనుచరులతో సహా ఆలయానికి వచ్చిన ప్రసాదరెడ్డి తన నోటితో గాని కంటితో గాని సుబ్బయ్యను హత్య చేయాలని చెప్పలేదని ప్రమాణం చేశారు. అతని హత్య జరుగుతుందని తనకు ముందుగా తెలిస్తే జరగకుండా కచ్చితంగా కాపాడేవాడినని చెప్పారాయన. తనకు చౌడమ్మ తల్లి అంటే ఎంతో విశ్వాసమని అందుకే ఇక్కడ ప్రమాణం చేస్తున్నట్లు చెప్పారు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి.

ప్రజల ముందు పరువు పోకుండా ఆలయాలకు వెళ్ళి ప్రమాణం చేయడం ఎదుటివాళ్ళకు సవాళ్ళు విసరడం నాయకులకు అలవాటైపోయింది. ఇటీవల కాలంలో కోర్టుల కంటే ఆలయాలనే నమ్ముకుంటున్నారు నాయకులు.

ఇదివరకు ప్రమాణం చేయాలంటేనే ఎవరైనా భయపడేవారు. గుడిలో ప్రమాణం అంటే అసలు ఒప్పుకునేవారు కాదు. ఇప్పుడు ప్రతిదానికి దేవుడిని మధ్యలోకి తెచ్చేస్తున్నారు మన నాయకులు. ఎవరు ఏ ఆరోపణ చేసినా గుడిలో ప్రమాణం చేస్తావా అంటూ సవాళ్ళు విసురుతున్నారు. కొంతకాలంగా ఏపీలో ఆలయాల్లో ప్రమాణాలు ఒక ట్రెండ్‌గా మారాయి.

ఆలయాలంటే అందరికి అలుసైపోతున్నాయి. దేవుడి ఆస్తుల్ని దోచుకునేవారు కొందరైతే ఆలయాల్ని ధ్వంసం చేసేవారు మరికొందరు. రాజకీయ నాయకులు వారి విమర్శలు ప్రతి విమర్శలకు ఆలయాలనే వేదికలుగా మార్చుకుంటున్నారు. నేరుగా గర్భ గుడిలోకి వెళ్ళి ప్రమాణాలు చేసేస్తున్నారు. గుడిలోకి వచ్చి ప్రమాణం చేసే దమ్ముందా అంటూ ప్రత్యర్థులకు సవాళ్ళు విసురుతున్నారు. ప్రొద్దుటూరులో టీడీపీ నేత సుబ్బయ్య హత్యతో తనకు ప్రమేయం లేదంటూ అక్కడి వైసీపీ ఎమ్మెల్యే చౌడమ్మ తల్లి ఆలయంలో ప్రమాణం చేశారు. రామతీర్థం ఆలయంలో విగ్రహం ధ్వసం వెనుక తన పాత్ర లేదంటూ సింహాచలం అప్పన్న ఆలయంలో ప్రమాణం చేయడానికి సిద్దమని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముఖ్యమంత్రి జగన్‌కు సవాల్‌ విసిరారు. వీటి కంటే ముందు అనపర్తి, విశాఖ నగరాల్లో రెండు విచిత్రమైన సవాళ్ళు ప్రమాణాలు ఏపీలో జరిగాయి.

ఏపీ పాలనా రాజధానిగా మారుతుందన్న వార్తలతో విశాఖ రాజకీయాలు వేడెక్కాయి. నగరంలో ఆక్రమణలకు గురైన స్థలాల్ని ప్రభుత్వం చట్టపరంగా స్వాధీనం చేసుకుంటోంది. మరోపక్కన గతంలో జరిగిన భూ ఆక్రమణలపై సిట్‌ దర్యాప్తు కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో కొందరు నాయకుల గుండెళ్లో రైళ్ళు పరుగెడుతున్నాయి. ఆక్రమణలతో తమకు సంబంధం లేదంటూ ప్రకటనలు చేస్తున్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై స్థలం ఆక్రమించిన ఆరోపణలున్నాయి. దీని గురించి వైసీపీ నేత విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణను వెలగపూడి ఖండించారు. తనపై చేసిన ఆరోపణలు అసత్యాలని సాయిబాబా ఆలయంలో ప్రమాణం చేస్తానని విజయసాయి అక్కడికి రావాలని రామకృష‌్ణబాబు సవాల్‌ విసిరారు. ప్లేస్‌ టైమ్‌ కూడా వెలగపూడి ఫిక్స్‌ చేశారు. అయితే ఈ సవాల్‌ను వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ స్వీకరించారు. టీడీపీ ఎమ్మెల్యేపై విజయసాయి చేసిన ఆరోపణలు రుజువు చేస్తామని అవి నిజం కాదని ప్రమాణం చేయాలని ప్రతి సవాల్‌ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే చెప్పిన టైమ్‌కే సాయిబాబా ఆలయానికి వెళ్ళారు.

సాయిబాబా ఆలయంలో వైసీపీ ఎమ్మెల్యే గంట పాటు వెయిట్‌ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే రాకపోవడంతో ఆయన ప్రమాణం నుంచి వెనక్కు పోయారని కామెంట్‌ చేశారు. ఇకపై టీడీపీ ఎమ్మెల్యేల సవాళ్ళను తాము స్వీకరించబోమని చంద్రబాబు లేదా లోకేష్‌ సవాళ్ళనే స్వీకరిస్తామని చెప్పారు గుడివాడ అమర్‌నాథ్‌. ప్రమాణం చేయడానికి రానందున టీడీపీ ఎమ్మెల్యేపై తాము చేసిన ఆరోపణలను అంగీకరించినట్లేనని చెప్పారాయన.

డిసెంబర్‌ మాసంలోనే తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ, టీడీపీ నేతలిద్దరూ సత్య ప్రమాణాలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సవాళ్ళు ప్రతి సవాళ్ళలో అనపర్తి నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుని బిక్కవోలు గణపతి ఆలయంలో ప్రమాణాలు చేసేందుకు సిద్ధమయ్యారు. పెద్ద ఎత్తున వారి అనుచరులు చేరడంతో బిక్కవోలు కూడా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇద్దరు నాయకులు గర్భగుడిలో విగ్రహానికి చెరోపక్కన నిలబడి తమ తమ ఆరోపణలకు కట్టుబడి ఉన్నట్లు ప్రమాణాలు చేశారు. ప్రమాణాలు చేసే సమయంలో కూడా ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. ఎవరికి వారు తమపై వచ్చిన ఆరోపణలకు సత్యదూరం అంటూనే తాము చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించుకున్నారు. నాయకుల సవాళ్ళు, ప్రతి సవాళ్ళతో శాంతి భద్రతలకు ఎక్కడ భంగం వాటిల్తుతుందో అని పోలీసులు అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నారు. పట్టణంలో 144వ సెక్షన్‌ కూడా విధించాల్సి వచ్చింది.

నాయకులకు ఏ ఆపద వచ్చినా దేవుడిని శరణు కోరుతారు. తాము ఏ తప్పు చేయలేదని దేవుడి ముందు మొరపెట్టుకుంటారు. వారు నిజంగా తప్పులు చేయలేదా? లేక ఏమీ కాదులే అన్న ధైర్యమా? ఎవరూ తప్పులు చేయకపోతే మరి పాపాలు చేస్తున్నదెవరో అని సెటైర్లు వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories