కోవిడ్ కట్టడికి సరికొత్త పద్ధతికి జగన్ సర్కార్ శ్రీకారం.. విదేశాల నుంచి వచ్చిన వారిని పట్టుకోవడం తేలిక

కోవిడ్ కట్టడికి సరికొత్త పద్ధతికి జగన్ సర్కార్ శ్రీకారం.. విదేశాల నుంచి వచ్చిన వారిని పట్టుకోవడం తేలిక
x
YS Jagan (File Photo)
Highlights

కరోనా మహమ్మారి నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది.

కరోనా మహమ్మారి నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది. కోవిడ్ కట్టడికి సాంకేతికతను వాడుకొని అధునాతన పద్ధతులతో మహమ్మారిని తరిమికొట్టేందుకు జగన్ సర్కార్ సిద్ధమైంది. 'కోవిడ్19 అలర్టింగ్ ట్రాకింగ్ సిస్టమ్‌'తో ముందుకొచ్చింది. హోం క్వారంటైన్‌లో ఉన్నవారి కదలికలను గుర్తించడానికి సరికొత్త ట్రాకింగ్ సిస్టమ్ ఇది. ఏపీ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా ఈ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. దీన్ని స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ రూపొందించింది.

ఇప్పటికే విదేశాల నుంచి వచ్చిన వారిని హోం క్వారంటైన్‌లో ఉండాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ వారు దాన్ని పట్టించుకోకుండా బయట తిరుగుతున్నారు. దీంతో ఈ ట్రాకింగ్ సిస్టంను వారిపై నిఘా పెట్టేందుకు వాడుకోనుంది. విదేశాల నుంచి వచ్చిన వారు హోమ్ క్వారంటైన్‌లో లేకుండా ఎక్కడెక్కడికి వెళ్లారనేది స్పష్టంగా తెలిపేలా ఈ సిస్టమ్ తయారు చేశారు. ఒకేసారి 25 వేల మంది కదలికలను ఇది పసిగట్టగలదు. ఇప్పటి దాకా దేశంలోని ఏ రాష్ట్రం కూడా ఇలాంటి వ్యవస్థను వాడటం లేదు. ఈ ట్రాకింగ్ సిస్టమ్ హోమ్ క్వారంటైన్‌లో ఉండే వారి మొబైల్ నంబర్‌కు అనుసంధానం చేస్తారు. వారు వినియోగించే ఈ మొబైల్ ఫోన్ నంబర్‌ను ఆధారంగా చేసుకుని సెల్ టవర్, సర్వీసు ప్రొవైడర్ల ద్వారా స్వీయ నిర్బంధంలో ఉన్న అనుమానితుల కదలికలను ఎప్పటికప్పుడు పసిగడతారు.

ప్రస్తుతం ప్రభుత్వం వద్ద 25 వేల మందికి సంబంధించిన వారి అన్ని వివరాలు ఉన్నాయి. అనుమానితుడి మొబైల్ నంబర్‌కు సంబంధించిన ట్రాకింగ్ సమాచారం మొత్తం తమకు అందజేయాలని ప్రభుత్వం ఇప్పటికే అన్ని మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలిచ్చింది. అనంతరం వారి వివరాలను ట్రాకింగ్ సిస్టంలో పొందుపరిచారు. కరోనా వైరస్ అనుమానితుడు కోవిడ్ అలర్టింగ్ ట్రాకింగ్ నిఘాలో ఉన్నప్పుడు తన ఇంటి నుంచి వంద మీటర్ల పరిధిని దాటి వెళ్తే వెంటనే ఆ సమాచారం జిల్లా అధికారులకు చేరిపోతోంది. వెంటనే అధికారులు అనుమానితుడికి ఫోన్ చేస్తారు. ఇంటికి వెళ్లాల్సిందిగా ఆదేశిస్తారు. పోలీస్ స్టేషన్‌కు సంబంధిత వ్యక్తి సమాచారాన్ని చేరవేస్తారు. మొబైల్ నంబర్, ఇంటి చిరునామాతో సహా పోలీసులకు అందుతాయి. ఇలా విదేశాల నుంచి వచ్చిన వారిని ఇంటి నుంచి బయటకు పంపకుండా చేయవచ్చు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories