Sanitation Works: పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం

Sanitation Works: పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం
x
AP Government On Sanitation Works
Highlights

Sanitation Works: వరద ముంపు గ్రామాల్లో నీరు తొలగిపోతే ముందస్తు చర్యగా పారిశుద్ధ్యంపై దృష్టి సారించనుంది.

Sanitation Works: వరద ముంపు గ్రామాల్లో నీరు తొలగిపోతే ముందస్తు చర్యగా పారిశుద్ధ్యంపై దృష్టి సారించనుంది. ముంపు వల్ల అనేక వ్యాధులు వ్యాపించే అవకాశం ఉండటంతో ముందస్తుగా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. పూర్తిస్థాయిలో నీరు తొలగిపోతే పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు పంచాయతీరాజ్, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖలకు చెందిన అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా శాఖలకు చెందిన మంత్రి పెద్దిరెడ్డితో పాటు ఉన్నతాధికారులు జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు.

తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో వరద నీటిలో చిక్కుకుపోయిన 112 గ్రామాలకు ప్యాకెట్లు, క్యాన్లు, ట్యాంకర్ల ద్వారా తాగునీటిని గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్‌) శాఖ సరఫరా చేస్తోంది. పాక్షికంగా నీట ముంపునకు గురైన వాటితో కలిపి మూడు జిల్లాల్లో 330 గ్రామాల వరకు వరద నీటి ప్రభావం ఉన్నట్టు పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. ముంపు గ్రామాల్లో తాగునీటి సరఫరా, పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజా శంకర్, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఎన్‌సీ కృష్ణారెడ్డిలు మంగళవారం సాయంత్రం మూడు జిల్లాల డీపీవోలు, జడ్పీ సీఈవోలు, ఎస్‌ఈలు, ఇతర పంచాయతీరాజ్‌ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్న ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

► ముంపు గ్రామాల ప్రజల తాగునీటి అవసరాల కోసం 4.86 లక్షల మంచినీటి ప్యాకెట్లు, 20 లీటర్ల సామర్ధ్యం కలిగిన 1,160 క్యాన్లు, 5 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన 3 ట్యాంకర్లను గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ ప్రత్యేకంగా ఆయా ప్రాంతాలకు ఇప్పటికే తరలించింది.

► ముంపు గ్రామాల్లో డయేరియా, మలేరియా, అంటు వ్యాధులు ప్రబలకుండా ఆయా గ్రామాల్లో ఉన్న మంచినీటి పథకాల ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, బోర్ల నీటిని రెండు, మూడు రోజుల పాటు తాగొద్దంటూ ప్రజలకుఅవగాహన కల్పించాలి.

► ముంపు గ్రామాల్లో ప్రతి బోరు, బావి నుంచి నీటి శాంపిల్స్‌ సేకరించి, అవి తాగునీటి అవసరాలకు పనికి వస్తాయా లేదా అని యుద్ధ ప్రాతిపదికన పరీక్షలు నిర్వహించి, ప్రతి రోజూ క్లోరినేషన్‌ ప్రక్రియ చేపట్టాలి.

► తాగడానికి పనికొస్తాయని నిర్ధారణ అయిన బోర్లను గుర్తించి, వాటిలోని నీటిని మాత్రమే వినియోగించుకోవాలని ప్రజలకు తెలియజెప్పాలి.

► ఆయా ప్రాంతాల్లో నీరు పూర్తిగా గ్రామం నుంచి వెళ్లగానే పారిశుధ్య కార్యక్రమాలు వేగంగా చేపట్టాలి.

► మేట వేసిన మట్టిని తొలగించి బ్లీచింగ్‌ పౌడర్, ఫినాయిల్‌ చల్లాలి.

► రాకపోకలకు ఆటంకం కలిగించేలా ఎక్కడైనా రోడ్లపై చెట్లు విరిగిపడితే, వాటిని వెంటనే తొలగించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories