logo
ఆంధ్రప్రదేశ్

AP Govt on Anganwadi's: అంగన్వాడీల్లో ఆధునిక వసతులు.. మరింత పటిష్టంగా ప్రీ స్కూల్ విద్య

AP Govt on Anganwadis: అంగన్వాడీల్లో ఆధునిక వసతులు.. మరింత పటిష్టంగా ప్రీ స్కూల్ విద్య
X
Anganwadis in AP
Highlights

AP Govt on Anganwadis's: ప్రాధమిక, ప్రాధమికోన్నత పాఠశాలల్లో నాడు - నేడు మాదిరిగానే అంగన్వాడీలను రూ. 4వేల కోట్లతో అభివృద్ధి చేసేందుకు ఏపీ ప్రభుత్వం సమాయత్తమవుతోంది.

AP Govt on Anganwadis's: ప్రాధమిక, ప్రాధమికోన్నత పాఠశాలల్లో నాడు - నేడు మాదిరిగానే అంగన్వాడీలను రూ. 4వేల కోట్లతో అభివృద్ధి చేసేందుకు ఏపీ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. వీరికి పాఠశాలల మాదిరిగానే అన్ని వసతులతో పాటు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనికి సంబంధించి సీఎం జగన్మోహనరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

అంగన్‌వాడీ కేంద్రాలను రూ.4,000 కోట్లతో అభివృద్ధి చేసి నాడు–నేడు కార్యక్రమం ద్వారా రూపు రేఖలు మార్చనున్నట్లు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. స్కూళ్లలో సదుపాయాలు కల్పిస్తున్న తరహాలోనే అంగన్‌వాడీ కేంద్రాల్లో కూడా పరిశుభ్రమైన తాగు నీరు, రన్నింగ్‌ వాటర్‌తో బాత్‌రూమ్స్‌తోపాటు ఫర్నిచర్, ఫ్యాన్లు ఉండాలని సూచించారు. ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించామని, అంగన్‌వాడీలు ఇకపై వైఎస్సార్‌ ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా ఉంటాయని తెలిపారు. అంగన్‌వాడీల పాఠ్యప్రణాళికపై విద్యా శాఖ దృష్టి పెట్టాలని ఆదేశించారు. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా అంగన్‌వాడీ టీచర్లకు సులభమైన బోధనా విధానాలపై శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రీ స్కూల్‌ విద్యపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ...

► పిల్లలకు పాలు, గుడ్లు , తదితరాలు నిల్వ చేసేందుకు వీలుగా వైఎస్సార్‌ ప్రీ ప్రైమరీ స్కూళ్ల (అంగన్‌వాడీ)లో ఫ్రిజ్‌లు ఏర్పాటు చేయాలి,

► అమ్మ ఒడి పథకం ద్వారా విద్యా వ్యవస్థలో సంస్కరణలు తెచ్చాం. ఇప్పుడు ప్రీ ప్రైమరీ విద్యలోనూ అదే బాటలో నడుస్తున్నాం. ప్రాథమిక దశ నుంచే సంపూర్ణ మార్పులకు శ్రీకారం చుడుతున్నాం. అంగన్‌వాడీల్లో ఒకటో తరగతి పాఠ్యప్రణాళికతో ట్రాన్సిషన్‌ మొదలు కావాలి. అంగన్‌వాడీలకు ఇప్పుడున్న కనీస అర్హత పదో తరగతి కాగా వారికి ఏడాది పాటు డిప్లొమా కోర్సు నిర్వహించాలి. ఒకవేళ ఇంటర్, ఆపై కోర్సులు పూర్తి చేసిన వారుంటే ఆరు నెలల డిప్లొమా కోర్సు ఉండాలి. సులభమైన మార్గాల్లో పాఠాలు బోధించడంపై శిక్షణ ఇవ్వాలి.

► అంగన్‌వాడీలకు భవనాల నిర్మాణం, పాఠ్య ప్రణాళిక, టీచర్లకు డిప్లొమా కోర్సు, సులభమైన బోధనా పద్ధతుల్లో శిక్షణపై కార్యాచరణ సిద్ధం చేసి నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయాలి.

► వైఎస్సార్‌ ప్రీ ప్రైమరీ స్కూళ్ల కోసం కొత్తగా రూపొందించిన పుస్తకాలను సమావేశంలో సీఎం పరిశీలించారు. పిల్లల ఆరోగ్యం, ఆహారం, చదువులపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు అంగన్‌వాడీలను ఇదివరకు ఉన్న బీఎల్‌వో లాంటి విధుల నుంచి మినహాయించాలని సమావేశంలో నిర్ణయించారు. సమీక్షలో మంత్రులు ఆదిమూలపు సురేష్, తానేటి వనిత, సీఎస్‌ నీలం సాహ్నితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

9 నుంచి 4 గంటల వరకు..

► ప్రీ ప్రైమరీ(పీపీ –1, 2) కి సంబంధించి ప్రతిపాదనలను మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ కృతిక శుక్లా సమావేశంలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.

► రాష్ట్రంలోని 55,607 అంగన్‌వాడీలలో 3 నుంచి 6 ఏళ్ల వయసున్న దాదాపు 8.70 లక్షల మంది చిన్నారులకు ప్రీ స్కూల్‌ విద్యా బోధన. చిన్నప్పటి నుంచే తెలుగుతోపాటు ఇంగ్లిష్‌లో కూడా ప్రావీణ్యం కల్పించేలా చర్యలు. నూతన సిలబస్‌పై అంగన్‌వాడీలకు శిక్షణ ఇచ్చి బోధనా విధానాలపై పుస్తకాల తయారీ.

► ప్రతి త్రైమాసికానికీ అసెస్‌మెంట్, ప్రతి చిన్నారికి బుక్స్, ప్రీ స్కూల్‌ కిట్స్, కలర్‌ కార్డులు, బిల్డింగ్‌ బ్లాక్స్, ఫ్లాష్‌ కార్డులు, పోస్టర్లు, చార్ట్స్, లెర్నింగ్‌ కిట్స్, బొమ్మలు అందచేసి చక్కటి వాతావరణంలో ప్రాథమిక విద్యకు పునాది.

► అంగన్‌వాడీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ప్రీ స్కూల్‌. చిన్నారులకు విశ్రాంతికోసం మధ్యలో గంటన్నర విరామం. రీడింగ్, స్టోరీ టైం, క్రియేటివ్‌ యాక్టివిటీ, యాక్షన్‌ సాంగ్, తదితర అంశాలతో రోజువారీ కార్యకలాపాల నిర్వహణ.

► రాష్ట్రంలోని అంగన్‌వాడీల్లో 11,448 కేంద్రాలు పాఠశాలల్లోనే కొనసాగుతుండగా వాటన్నిటిని నాడు–నేడు కార్యక్రమంలో బాగు చేస్తున్నామని అధికారులు తెలిపారు. మిగిలిన 44 వేల అంగన్‌వాడీలను కూడా నాడు–నేడు ద్వారా అభివృద్ధి చేయడంతోపాటు కొత్త నిర్మాణాలు చేపడతామన్నారు.

Web TitleAndhra Pradesh Government Decision to arrange Modern facilities in Anganwadi and more secure in Government Education
Next Story