Rythu Bharosa Kendram: ఇక ధాన్యం కొనుగోలు ఆర్బీకే కేంద్రాల్లోనే.. ఏపీ ప్రభుత్వం యోచన

Rythu Bharosa Kendram: ఇక ధాన్యం కొనుగోలు ఆర్బీకే కేంద్రాల్లోనే.. ఏపీ ప్రభుత్వం యోచన
x
Rythu Bharosa Kendram
Highlights

Rythu Bharosa Kendram: రైతన్నలు పలు సేవలను అందించేందుకు వీలుగా ప్రవేశపెట్టిన రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్బీకే) మరిన్ని వసతులు కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం యోచన చేస్తోంది.

Rythu Bharosa Kendram: రైతన్నలు పలు సేవలను అందించేందుకు వీలుగా ప్రవేశపెట్టిన రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్బీకే) మరిన్ని వసతులు కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం యోచన చేస్తోంది. ఇప్పటికే రైతు సలహాలు, సూచనలతో పాటు ఎరువులతో పాటు విత్తనాలు, రాయితీతో కూడిన యంత్రాలను సరఫరా చేస్తోంది. ఇదే కాకుండా సంఘాల పద్ధతిలో వినియోగించుకునేందుకు అధిక మొత్తం ఖరీదయ్యే వ్యవసాయ యంత్రాలను అద్దె ప్రాతిపదికన అందుబాటులో తెచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది. తాజాగా రైతులు పండించే ధాన్యం కొనుగోలు వంటి కార్యక్రమాన్ని గతంలో మాదిరి ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు లేకుండా వీటి ద్వారానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) మున్ముందు ఆహార ధాన్యాల సేకరణ కేంద్రాలుగా కూడా పనిచేయనున్నాయి. రైతులు తమ పంటలను విక్రయించడానికి మండల కేంద్రాలకు పోవాల్సిన పనిలేకుండా, గ్రామాల్లోని ఆర్బీకేలలోనే విక్రయించవచ్చని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఆర్బీకేలను సమగ్ర వ్యవసాయ కేంద్రాలుగా మార్చాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామాల్లో పండే పంటలను వీటి ద్వారానే సేకరించేలా చూడాలని వ్యవసాయ శాఖ కసరత్తు ప్రారంభించింది. భాగస్వామ్య పక్షాలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపింది. ఏపీ మార్క్‌ఫెడ్, మార్కెటింగ్‌ శాఖాధికారులతో చర్చలు నిర్వహించింది.

► ఈ విధానం కోసం ఎలక్ట్రానిక్‌ పంట (ఇ–పంట) నమోదు రికార్డును ఆధారం చేసుకోనుంది. ఏయే ప్రాంతాల్లో ఏమేమీ పంటలు ఎంతెంత విస్తీర్ణంలో పండిస్తున్నారో, దిగుబడి ఎంత రావొచ్చో మార్కెటింగ్‌ ఇంటెలిజెన్స్‌తో అంచనా కట్టే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ కార్యక్రమంలో ఎవరెవర్ని భాగస్వాములుగా చేయాలనే దానిపై మార్కెటింగ్‌ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వ్యవసాయ శాఖ కమిషనర్‌ హెచ్‌ అరుణ్‌ కుమార్‌ చెప్పారు.

► వ్యవసాయ ఉత్పత్తులను గ్రామీణ ప్రాంతాల్లోనే సేకరించడం వల్ల రైతుకు ప్రధానంగా రవాణా భారం తప్పుతుంది. క్షేత్రస్థాయిలోనే తన ఉత్పత్తులను నిబంధనల ప్రకారం విక్రయించుకోవచ్చు. దళారుల పాలిట పడి నష్టపోవాల్సిన పని ఉండదు. అమ్మిన సరుక్కి నిర్దిష్ట గడువులోగా నేరుగా ఖాతాలకే నగదు జమ అవుతుంది.

► అన్నింటికీ మించి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు భరోసా లభిస్తుంది. ఒకవేళ ఇ–నామ్‌ ప్లాట్‌ఫారాల ద్వారా ఇంతకన్నా మంచి ధర వస్తే అలా కూడా విక్రయించుకునే సౌకర్యం ఉంటుంది. ఇందుకు ఆర్బీకేలలోని మార్కెటింగ్‌ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ తోడ్పడుతుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.

► ధాన్యం సేకరణకు సంబంధించి త్వరలో ప్రణాళిక ఖరారవుతుందని, ఆ తర్వాత సీఎం జగన్, మంత్రి కన్నబాబుకు అందజేసి వారితో చర్చించిన అనంతరం ఖరారు చేస్తామని వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories