ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబరాల వేళలో కోర్టు తీర్పుల ఇక్కట్లు!

పాలనా పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తి కావచ్చిన సందర్భాన అంతా బాగుందని అనుకుంటున్న సమయాన సీఎం జగన్ సహనాన్ని కోర్టు తీర్పులు పరీక్షిస్తున్నాయి.
పాలనా పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తి కావచ్చిన సందర్భాన అంతా బాగుందని అనుకుంటున్న సమయాన సీఎం జగన్ సహనాన్ని కోర్టు తీర్పులు పరీక్షిస్తున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు అంశాల్లో శుక్రవారం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వెల్లడించింది. ఇంటలీజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కేసుతో పాటు సంచలనం సృష్టించిన డాక్టర్ సుధాకర్ అంశం, పంచాయతీ కార్యాలయాలకు రంగుల అంశాల్లో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబడుతూ తీర్పులు వెల్లడించింది.
శుక్రవారం.. ఏపీ సర్కార్‌కు షాకుల మీద షాకులు తగిలాయి. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుసగా తీర్పులు వెల్లడయ్యాయి. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అంశాల్లో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగిలాయి. ఇంటలీజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఏపీ సర్కార్‌ను ఆదేశించింది. క్యాట్ ఆదేశాలను పక్కన పెట్టిన ధర్మాసనం సస్పెన్షన్ కాలం నాటి జీతభత్యాలను కూడా చెల్లించాలని స్పష్టం చేసింది. వెంకటేశ్వరరావు వేసిన రిట్ పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం తాజా ఆదేశాలను జారీ చేసింది.
1989 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును జగన్ సర్కారు ఈ ఫిబ్రవరిలో సస్పెండ్ చేసింది. భద్రతా పరికరాల కొనుగోలులో అతిక్రమణలు జరిగాయని సర్వీస్ నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ విధుల నుంచి తప్పించింది. ప్రజా ప్రయోజనాలరీత్యా సస్పెన్షన్ వేటు వేశామంటూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో సస్పెన్షన్‌పై వెంకటేశ్వరరావు క్యాట్‌ను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. ఆయన పిటిషన్‌ను క్యాట్ కొట్టివేసింది. ప్రభుత్వం తీసుకున్న సస్పెన్షన్ ను సమర్థించింది. దీనిపై వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించగా విచారించిన ధర్మాసనం ఆయన్ని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది.
మరోవైపు పంచాయతీ కార్యాలయాలకు రంగుల అంశం ఏపీ సర్కార్‌ను వీడటం లేదు. దీనిపై ఏపీ సర్కారు రెండోసారి విడుదల చేసిన 623 జీవోను హైకోర్టు రద్దు చేసింది. సుప్రీం, హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా కొత్తగా జీవో తీసుకురావడంపై వివరణ ఇవ్వాలని పంచయతీ రాజ్ సెక్రెటరీతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఈ అంశాన్ని కోర్టు ధిక్కరణ కింద సుమోటోగా కేసు తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈనెల 28 లోపు రంగులకు సంబంధించి ఓ నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే కోర్టు ధిక్కరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని తేల్చిచెప్పింది.
పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులు వేస్తున్నారంటూ తొలుత హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విచారించిన హైకోర్టు ధర్మాసనం ప్రస్తుత రంగులు తొలగించడంతో పాటు ఎలాంటి రంగులు వేయాలనే దానిపై సీఎస్ ఆధ్వర్యంలో ఓ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు తీర్పును ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అయితే సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థించింది. దీంతో జగన్ సర్కార్ చేసేదేం లేక రంగులపై కొత్తగా 623 జీవోను విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న మూడు రంగులకు తోడుగా కొత్తగా మట్టిరంగును బోర్డర్‌గా వేయాలని జీవోలో పేర్కొంది. దీనిపై హైకోర్టులో రెండోసారి పిల్ దాఖలైంది. దీనిపై విచారించిన ధర్మాసనం మరో రంగును వేయడం కోర్టు ఆదేశాలను ధిక్కరించడమే అని పేర్కొంది. ఈ అంశంపై ప్రభుత్వ వాదనను తోసిపుచ్చిన ధర్మాసనం జీవోను రద్దు చేసింది.
ఇక రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డాక్టర్ సుధాకర్ అంశంపై ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆయా అంశాల్లో ప్రభుత్వం తీసుకునే తదుపరి చర్యలు ఎలా ఉంటాయనే దానిపై ఆసక్తి నెలకొంది.