AP Cabinet Reshuffle: కేబినెట్‌ విస్తరణలో ఎవరు ఇన్‌.. ఎవరు అవుట్‌?

Andhra Pradesh Cabinet Reshuffle Soon
x

జగన్(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

Highlights

AP Cabinet Reshuffle: ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గంలో ఏం జరుగుతోంది.? మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఏ అభిప్రాయంతో ఉన్నారు?

AP Cabinet Reshuffle: ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గంలో ఏం జరుగుతోంది.? మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఏ అభిప్రాయంతో ఉన్నారు? వారి పనికి సీఎంగా ఆయనిచ్చే మార్కులు ఎన్ని? ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మంత్రివర్గ కూర్పు సమయంలో అనేక సమీకరణాలను పరిగణనలోకి తీసుకున్న జగన్ వారిని కంటిన్యూ చేయబోతున్నారా? ఇష్యూ పరిశీలిస్తున్నారా? మొదట్లో 90 శాతం మార్కులు వస్తేనే సరి లేకుంటే కత్తెర అని హెచ్చరించిన సీఎం కొందరి పనితీరు మీద అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం మధ్య మంత్రివర్గ కూర్పు ఎలా ఉండబోతోంది? ముఖ్యమంత్రి ఇప్పుడేం చేయబోతున్నారు? మంత్రుల్లో జరుగుతున్న చర్చ ఏంటి?

ఏపీ అధికార పార్టీలో హాట్ టాపిక్‌గా మారిందీ అంశం. 2019 ఎన్నికల్లో 151 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ పక్కాగా ప్రాంతీయ-సామాజిక సమీకరణాలతో మంత్రివర్గానికి కూర్పు చేశారు. అందులో ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదా కట్టబెట్టారు. దీంతో పాటుగా పదవులు ఇచ్చే రోజే వారికి లక్ష్యం నిర్ధేశించారు. రెండున్నారేళ్ల పాటే మంత్రులుగా కొనసాగుతారని, పని తీరు ఆధారంగా కొందరు కంటిన్యూ అవుతారని తేల్చిచెప్పారు. అయితే, ఇప్పటికే మంత్రులుగా వ్యవహరిస్తున్న వారి పదవీకాలం ముగియబోతోంది. ఇదే ఏపీలో చర్చనీయాంశంగా కనిపిస్తోంది.

త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గంలో మార్పులు జరగబోతున్నాయన్న టాక్‌ జోరుగా నడుస్తోంది. ఇన్ అయ్యేది ఎవరు? ఔట్ అయ్యేది ఎవరన్న చర్చ జరుగుతోంది. మారబోయే సమీకరణాలుపై అంచనాలు వేసుకుంటున్నారు. జరగబోయే లెక్కలను బేరీజు వేసుకుంటున్నారు. రెండున్నరేళ్లలో మార్పు తప్పదన్న ముఖ్యమంత్రి జగన్‌ చెప్పిన మాటతో తమకు అవకాశం వస్తుందని ఆశావహులు ఎదురుచూస్తుంటే తమకేమవుతుందోనని ఇప్పుడున్న అమాత్యులు పరేషాన్‌ అవుతున్నారట.

ప్రభుత్వం ఏర్పడిన రెండున్నరేళ్ల త‌రువాత మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఉంటాయన్న ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీతో ఆశావహులు ఉత్సాహం చూపిస్తున్నారు. ముఖ్యంగా రోజా, కారుమురి నాగేశ్వర్‌రావు, అంబటి రాంబాబు, ఉదయభాను, జోగి రమేష్‌, ఆళ్ల రామకృష్ణరెడ్డి, దాడిశెట్టి రాజా, పార్థసారథి, ఆనం రామనారాయణరెడ్డి, స్పీకర్‌గా ఉన్న తమ్మినేని ఇలా ఇంకొందరు నేతలు మంత్రి పదవులపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే, సుబ్బారెడ్డి బాగా పట్టుబడితే తప్ప పెద్దగా చాన్స్‌ లేదన్న చర్చ జరుగుతోంది. వీరితో పాటు దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతల మధ్య పోటీ వాతావరణం ఎక్కువగా కనిపిస్తోంది.

ప్రస్తుతం జగన్ క్యాబినెుట్‌లో 25 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో ఎవరు ఔట్ అవుతారన్న దానిపైన్నే పార్టీలో ఎక్కువగా చర్చ జరుగుతోంది. సీఎం చెప్పిన అందరికీ రెండున్నరేళ్లే అన్న మాటలని లెక్కలోకి తీసుకుంటే 10 మందిని ఉంచి, మిగిలిన 15 మంది స్థానంలో కొత్తవారికి అవకాశం ఇస్తారని పార్టీలో కీలక నేతలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రుల్లో సీనియర్లతో పాటు మొదటిసారి మంత్రి అయిన వారిలోనూ కొందరిని కొనసాగిస్తారని సమాచారం. వీరిలో ఫైర్‌బ్రాండ్స్‌గా ఉన్న మంత్రులను కొనసాగించే అవకాశం ఉందన్న టాక్‌ నడుస్తోంది. వచ్చేది ఎన్నికల ఇయర్ కాబట్టి వారికి తోడు మరికొందరు ఫైర్ బ్రాండ్స్‌కి క్యాబినెట్‌ బెర్త్‌ ఖాయమన్న సంకేతాలు పార్టీలో కనిపిస్తున్నాయి.

అయితే, తన కేబినెట్‌లోని మంత్రుల గురించి పూర్తి సమాచారంతో ఉన్న సీఎం పార్టీ కేడర్‌తో వారి సంబంధాలపై ఆరా తీస్తున్నారట. ఇది ఇప్పుడు మంత్రుల మధ్య హాట్‌టాపిక్‌గా మారుతోంది. తాను ఏరి కోరి తెచ్చుకున్న కొందరి మంత్రులపై సీఎం అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం మధ్య కంటిన్యూ అవ్వాలని చూస్తున్న మంత్రులు కొందరు మంత్రివర్గ విస్తరణలో తమ పరిస్థితి ఏంటన్న దానిపై అంచనాలు వేసుకుంటున్నారట. అదే సమయంలో ప్రస్తుతం కొనసాగుతున్న అమాత్యులు కొందరు తమ సొంత జిల్లాలో పార్టీ పరిస్థితులు కేడర్‌తో మమేకం అవటం క్షేత్ర స్థాయిలో ప్రజాభిప్రాయాలు తెలుసుకోవటంలో సరైన చొరవ చూపకపోవటంపైనా సీఎం ఆగ్రహంగా ఉన్నారన్న చర్చ పార్టీలో జరుగుతోంది.

ఉత్తరాంధ్ర మంత్రులు విశాఖలో రాయలసీమ మంత్రులు బెంగళూరులో ఆంధ్ర మంత్రులు హైదరాబాద్‌లో ఉంటున్నారంటూ వైసీపీలో ఓ చర్చ సాగుతోంది. అసెంబ్లీ సమావేశాల సమయంలోనూ సీఎం చెప్పినా నలుగురైదుగురు మంత్రులు మాత్రమే, అంశాల మీద పూర్తి సమాచారంతో రావటం ప్రతిపక్షాల విమర్శలను సమర్ధవంతంగా తిప్పి కొట్టటంలో ముందున్నారని సీఎం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో రానున్న రోజుల్లో సమర్ధవంతంగా లేని మంత్రులపైన సీఎం ఎటువంటి చర్యలకు సిద్దమవుతారో అనే ఉత్కంఠ మంత్రుల్లోనూ పార్టీ ముఖ్యుల్లోనూ కనిపిస్తోంది. ముందు నుంచి సామాజిక ఈక్వేషన్స్‌ ఫాలో అయ్యే జగన్‌ ఈసారి కూడా అదే ఫార్ములా ఫాలో అవుతారని తెలుస్తుంది. ఆశావహులు ఎందరున్నా ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నా సీఎం మనసులో ఎవరున్నారో అనే దానిపై అంచనా వెయ్యడం కష్టమే అంటున్నారు పార్టీ నేతలు. చూడాలి మరి. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా తన మంత్రులపై జగన్‌ తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయో!!

Show Full Article
Print Article
Next Story
More Stories