కొనసాగుతున్న ఆయేషా మీరా రీపోస్ట్‌ మార్టం

కొనసాగుతున్న ఆయేషా మీరా రీపోస్ట్‌ మార్టం
x
Highlights

ఆయేషా మృతదేహాన్ని వెలికి తీసిన అధికారులు, చెంచుపేట ఈద్గాకు చేరుకున్న ఆయేషామీరా తండ్రి ఇక్బాల్‌ బాషా.

ఆయేషా మీరా మృతదేహానికి రీపోస్టుమార్టం కొనసాగుతోంది. ఆయేషామీరా మృతదేహాన్ని అధికారులు వెలికితీశారు. ఆయేషామీరా భౌతికకాయానికి శవపరీక్ష నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటికే గుంటూరు జిల్లా తెనాలిలోని చెంచుపేట ఈద్గాకు సీబీఐ, రెవెన్యూ, ఫోరెన్సిక్‌ అధికారులు చేరుకున్నారు. కేసు సీబీఐకి అప్పగించడంతో ఆధారాల కోసం రీ పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఎన్నో మలుపులు.. ఊహకందని ట్విస్టులతో.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో.. సీబీఐ ఆధారాల కోసం అన్వేషిస్తోంది. ఈ కేసులో శిక్ష అనుభవించిన సత్యంబాబు విడుదల కావడంతో.. కేసును సీబీఐకి అప్పగించారు. దీంతో సీబీఐ.. ఈ కేసులో ఆధారాల కోసం విచారణ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఆమె మృతదేహానికి మరోసారి పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని చెంచుపేట శ్మశానవాటికలో.. శవపరీక్ష నిర్వహిస్తున్నారు.

2007 డిసెంబర్ 27 న ఉదయం విజయవాడ దగ్గర్లోని ఇబ్రహీంపట్నంలో ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటున్న ఆయేషా మీరా హత్యకు గురైంది. హాస్టల్‌లోని బాత్రూమ్‌ సమీపంలో రక్తపు మడుగులో పడి ఉంది. అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఈ హత్య కేసులో మొదటి నుంచి ఎన్నో అనుమానాలు తెరపైకి వచ్చాయి. 12 ఏళ్లు గడుస్తున్నా.. ఆయేషాను హత్య చేసిందెవరనేది.. పోలీసులు గుర్తించలేదు. నిందితులను గుర్తించడంలో పోలీసులు విఫలమైనట్లు విమర్శలు వెల్లువెత్తాయి. ఇటు ఈ హత్యపై ఆందోళనలు పెద్ద ఎత్తున జరిగాయి.

అయితే ఈ కేసులో తెరపైకి వచ్చిన సత్యంబాబును మరో కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయేషాను కూడా అతడే హత్య చేశాడని.. ఆ విషయాన్ని సత్యంబాబు అంగీకరించాడంటూ పోలీసులు వెల్లడించారు. పోలీసులే సత్యంబాబుతో నేరం అంగీకరింపజేశారని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేయడం.. విజయవాడ మహిళా సెషన్స్‌ కోర్టు సత్యంబాబుకు 2010 సెప్టెంబర్‌లో యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ.. తీర్పు చెప్పడం జరిగింది.

దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. విచారించిన ఉన్నత న్యాయస్థానం.. సత్యంబాబును నిర్దోషిగా విడుదల చేసింది. కేసును సీబీఐకి అప్పగించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. కోర్టు ఆదేశాలతో దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ.. ఆమె భౌతిక కాయానికి రీ పోస్టుమార్టం చేయాలని నిర్ణయించింది. అయితే అసలైన నేరస్తులను పట్టుకోవాలని.. అమాయకులను బలి చేయొద్దని.. ఆయేషా మీరా తల్లిదండ్రులు కోరుతున్నారు. తమ బిడ్డను హత్య చేసిన నిందితులను సీబీఐ గుర్తిస్తుందనే నమ్మకం ఉందని.. ఆయేషా పేరెంట్స్‌ చెబుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories