Top
logo

ఏపీలో డీలర్లకు ఇబ్బందిగా మారిన ఇంటికే రేషన్ పథకం

Ration dealers troubles in Andhra Pradesh
X

ఆంధ్రప్రదేశ్ లో రేషన్ దుకాణం (పాత చిత్రం)

Highlights

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్న నానుడి ఆంధ్రప్రదేశ్ రేషన్ డీలర్ల పాలిట అక్షరాల నిజమవుతోంది. జాతీయ నిత్యావసరాల వస్తువుల పంపిణీ విధానంలో రాష్ట్రాలు తెస్తున్న మార్పులు, చేర్పులు రేషన్ పంపిణీదారులకు గుది బండగా మారుతున్నాయి.

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్న నానుడి ఆంధ్రప్రదేశ్ రేషన్ డీలర్ల పాలిట అక్షరాల నిజమవుతోంది. జాతీయ నిత్యావసరాల వస్తువుల పంపిణీ విధానంలో రాష్ట్రాలు తెస్తున్న మార్పులు, చేర్పులు రేషన్ పంపిణీదారులకు గుది బండగా మారుతున్నాయి. ఏపీలో జగన్ ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన ఇంటివద్దకే రేషన్ విధానం డీలర్లకు కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది. ఇంటికే రేషన్ పథకంతో డీలర్ల కలవరంపై హెచ్‌ఎంటీవీ స్పెషల్ స్టోరీ.

సామాన్య ప్రజలకు ఇంటి వద్దకే నాణ్యమైన బియ్యాన్ని అందించేందుకు ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని ఫిబ్రవరి నుంచి అమలు చేసేందుకు అధికారులు కసరత్తులు మొదలుపెట్టేశారు. ఇప్పటికే బియ్యాన్ని సరఫరా చేసే వాహనాలకు ఆయా ప్రాంతాలకు చేరవేశారు. ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల నుంచి హర్షాతీరేకాలు వినిపిస్తున్నాయి. కానీ రేషన్ డీలర్లలో కలవరాన్ని సృష్టిస్తోంది. రేషన్ డీలర్ల ఆధిపత్యానికి ఈ కార్యక్రమం అడ్డుపడుతుందని గగ్గోలుపెడుతున్నారు.

ప్రభుత్వ కార్యక్రమాన్ని రేషన్‌ డీలర్లు ఆహ్వానిస్తూ తమ కష్టాలను తీర్చాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో 29 వేల కుటుంబాల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని స్పష్టం చేస్తున్నారు.

ఇంటికే రేషన్‌ విధానం తమ ఉనికిని దెబ్బ తీస్తుందని రేషన్ డీల్లర్లు వాపోతున్నారు. ప్రభుత్వ గోదాంల నుంచి తమ రేషన్ షాప్ లకు వచ్చే బియ్యం సంచుల్లో వందకు రెండు నుంచి 5కేజీల సరుకు తక్కువగా ఉంటోందని ఆరోపిస్తున్నారు. కానీ ఇప్పుడు ఇంటికి నేరుగా బియ్యం అందించటానికి వాలంటీర్లకు తాము పూర్తి స్థాయి తూకంతో బియ్యం అందించాల్సి ఉంటుందని గగ్గోలు పెడుతున్నారు.

ఇప్పటి వరకు రేషన్ డీలర్‌తో లబ్దిదారులకు నేరుగా సంబంధం ఉండేదని, ఈ కొత్త విధానంతో అది తెగిపోతుందని డీల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత విధానంలో గన్ని బ్యాగ్‌లు డీలర్లకు కొంత ఆర్ధిక ప్రయోజనం కలిగించేవి. ఇంటికి బియ్యం విధానంతో గన్ని సంచుల ఆదాయం డీల్లర్లు కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు.

ఏపీలో సుమారు 29 వేల మంది డీలర్స్‌ ఉన్నారు. లబ్ధిదారులను బట్టి వీరికి కమిషన్ వస్తోంది. ఈ కమీషన్‌ నుంచే సరకు రవాణా ఖర్చుతో పాటు హమాలీ, గుమస్తాకు జీతం, షాప్ రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. అన్ని ఖర్చులు పోను మిగిలేది అంతంత మాత్రమే అని డీలర్లు అంటున్నారు.

అయితే ప్రభుత్వం ఇచ్చే కమిషన్ సరిపోక అవస్థలు పడుతున్నట్లు డీలర్లు వాపోతున్నారు. గతంలో ప్రభుత్వం అందించే నిత్యావసర సరుకులతోపాటు ఇతర వస్తువులను అమ్ముకునే వారు రేషన్ డీలర్లు.. ఇప్పుడు నేరుగా ఇంటికే రేషన్ విధానంతో తమ షాప్‌లు అలంకారప్రాయంగా మిగిలిపోతాయని డీలర్లు అంటున్నారు.

Web TitleA ration at Door Steps Program in Andhra Pradesh Creating Troubles to Ration Dealers hmtv Special Story
Next Story