గోతులు తవ్వించి.. సారీ చెప్పాడు.. పిచ్చోడి చేతిలో కూలీలకు మోసం

గోతులు తవ్వించి.. సారీ చెప్పాడు.. పిచ్చోడి చేతిలో కూలీలకు మోసం
x
Highlights

రూ. 1.20 కోట్ల విలువైన 14 కిలోమీటర్ల రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాలి మూడు నెలల పని అనేసరికి వారంతా ఎగిరి గంతేశారు. చేతిలో ఉన్న సార్వా కూలి పనులనూ...

రూ. 1.20 కోట్ల విలువైన 14 కిలోమీటర్ల రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాలి మూడు నెలల పని అనేసరికి వారంతా ఎగిరి గంతేశారు. చేతిలో ఉన్న సార్వా కూలి పనులనూ పక్కనబెట్టి, మొక్కలు నాటడానికి సిద్ధమయిపోయారు. మూడు రోజులు పనిచేసి కూలి అడిగితే, వారిని ఆ పనికి పెట్టుకొన్న వ్యక్తి వెర్రిచూపులు చూశాడు. అతడి తీరును చూసి తెల్లబోవడం కూలీల వంతు అయింది. అలాంటి పనులేవీ తాము చేయించడం లేదని అధికారులు తేల్చేయడంతో, పోయి.. పోయి.. చివరికి పిచ్చోడి చేతిలో మోసపోయామని తమను తాము తిట్టుకొంటూ కూలీలు అక్కడినుంచి కదిలారు.

పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులో ఈ ఘటన జరిగింది. ఆవుల నారాయణయాదవ్‌కు మతిస్థిమితం లేదు. తనను తాను వర్క్‌ ఇన్‌స్పెక్టరుగా చెప్పుకొంటూ తిరుగుతుంటాడు. అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 'వనం-మనం'లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం ఉందని, కూలికి వస్తే మగవారికి రూ.450, ఆడవారికి రూ.350 ఇస్తానని చెప్పాడు. అతని విషయం తెలియని 30 మంది.. కూలి బాగుందని పనికి రావడానికి సిద్ధమయ్యారు. వారిని అతడు పాలకోడేరు తీసుకొచ్చాడు. పొడవాటి రోడ్డు ఒకటి చూపించి, ఇక పనులు మొదలుపెట్టమన్నాడు. మొక్కలు నాటడం కోసం కూలీలు రోజూ గుంతలు తవ్వుతున్నారు. కుర్చీలో కూర్చొని వారి పనిని నారాయణయాదవ్‌ పర్యవేక్షించేవాడు.

తొలి రోజు పని అయ్యాక కూలి అడిగితే, రేపు వచ్చేటప్పుడు రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు తెచ్చుకోవాలని అతడు చెప్పాడు. ఆ పత్రం లేదు, ఈ కార్డు ఏదీ అంటూ రెండోరోజూ రూపాయి ఇవ్వలేదు. ఈ క్రమంలో మూడో రోజయిన మంగళవారం సాయంత్రం దాకా కూలీలు పనులు చేశారు. అప్పటికి పాలకోడేరు-వేండ్ర రైల్వేగేటు రోడ్డుకు ఇరువైపులా కిలోమీటరన్నరకు పైగా గోతులు తవ్వడం పూర్తయింది.

కూలి అడిగితే తిరిగి అలాంటి సమాధానమే నారాయణయాదవ్‌ చెప్పడంతో, గట్టిగా నిలదీశారు. అంతమంది తనను నిలదీయడంతో అతడు పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. ఇంకా గట్టిగా గదమాయించడంతో 'తప్పయిపోయింది. నన్ను క్షమించండి' అంటూ వాళ్ల కాళ్లు పట్టుకొన్నాడు. ఈ విషయాన్ని వెలుగు ఏపీఎం మాధవి దృష్టికి తీసుకెళ్లగా, తమ ఆధ్వర్యంలో పనులు జరగడం లేదన్నారు. పనుల విషయమై ఎటువంటి సమాచారం లేదని గ్రామ కార్యదర్శి రమాలీల సమాధానమివ్వగా, అతను ఎవరో తమకు తెలియదని జిల్లా ఫారెష్టు అధికారి శ్రీనివాసరావు తేల్చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories