Tirumala Brahmotsavam: టీటీడీ చరిత్రలో కీలక నిర్ణయం..

A Crucial Decision in the History of TTD
x

టీటీడీ చరిత్రలో కీలక నిర్ణయం

Highlights

Tirumala: సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో అందరికీ సర్వదర్శనం

Tirumala: తిరుమల శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సన్నద్ధమవుతోంది. తొమ్మిది రోజుల పాటు ఈ వేడుకకు ప్రముఖుల తాకిడిని పూర్తిగా తగ్గించి.. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ టీటీడీ మొదటిసారి బలమైన నిర్ణయం తీసుకుంది. ఉత్సవాలు జరిగిన రోజుల్లో కుడా ఎలాంటి వెసులుబాటు, సిఫార్సు దర్శనాలు ఉండబోవని తేల్చి చెప్పింది. బ్రహ్మోత్సవాలలో ప్రతి సామాన్య భక్తుడు ప్రముఖులతో తరహాలో స్వామివారి సేవలో తరించనున్నారు.

శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు రెండేళ్ల తర్వాత మాడవీధుల్లో జరగనున్నాయి. దీంతో ఈసారి పెద్దసంఖ్యలో బ్రహ్మోత్సవాలకు భక్తులు తిరుమల వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకూ శ్రీవారి దర్శనభాగ్యం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 300రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని తొలిసారిగా బ్రహ్మోత్సవాల సమయంలో రద్దు చేశారు. అందరికీ సర్వదర్శనం మాత్రమే కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

సెప్టెంబర్‌ 27 నుండి అక్టోబర్‌ 5వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాల సమయంలో ఆర్జిత సేవలు రద్దు చేస్తుంటారు. ఈసారి టీటీడీ మరింత ముందుకెళ్లి ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లనూ నిలిపివేసింది. వీటిని బ్రహ్మోత్సవాల సమయంలో రద్దు చేయడంతో సామాన్య భక్తులకు దర్శనభాగ్యం కల్పించినట్లు అవుతుందని అధికారులు భావిస్తున్నారు. తాము నిర్దేశించుకున్న రోజు రెండు గంటల్లో దర్శనం పూర్తి చేసుకుంటామన్న భరోసాతో భక్తులు ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లు తీసుకుంటారు. గంటకు 4వేల నుంచి 4వేల500 మంది భక్తులకే దర్శనం కల్పించేందుకు అవకాశం ఉంది.

శ్రీవారికి కచ్చితంగా కొన్ని సేవలు నిర్వహించాలి. ఇందుకోసం రోజుకు ఐదారు గంటలు పడుతుంది. ఏకాంత సేవలను రాత్రి ఒంటిగంటకు ముగించినా, తిరిగి మూడు గంటలకు సుప్రభాతంతో ప్రారంభించాలంటే దర్శన విరామంతోపాటు వివిధ సేవలకు 8 గంటల సమయం పడుతుంది. మిగిలిన 16 గంటల్లోనే ప్రత్యేక ప్రవేశం, సర్వదర్శనం భక్తులకు దర్శనం ఇబ్బందిగా ఉంటుందని అధికారులు గుర్తించారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని సర్వదర్శనానికి వచ్చే భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల జారీని నిలిపివేశారు.

బ్రహ్మోత్సవాల సమయంలో కేవలం భక్తులకు సర్వదర్శనం మాత్రమే కల్పించడం టీటీడీ చరిత్రలోనే తొలిసారి కానుంది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. సర్వదర్శనానికి టైమ్ స్లాట్ విధానాన్ని అమల్లోకి తెస్తే బాగుంటుందన్న అభిప్రాయం భక్తుల నుంచి వ్యక్తమౌతోంది. ఇదంతా బాగానే ఉంది కానీ ఎన్నడు లేనంత కఠినంగా ప్రముఖులను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని భక్తులు హర్షిస్తున్నారు. అయితే ఈ నిర్ణయం పూర్తి స్థాయిలో అమలై.. నిజంగా టీటీడీ ఉద్దేశం ప్రకారం సామాన్య భక్తులకు శ్రీవారి దర్శన విషయంలో ప్రాధాన్యత లభిస్తుందో లేదో వేచి చూడాల్సిన అవసరం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories