ఏటా 5 వేల మందికి క్వాంటం టెక్నాల‌జీపై శిక్ష‌ణ‌

ఏటా 5 వేల మందికి క్వాంటం టెక్నాల‌జీపై శిక్ష‌ణ‌
x
Highlights

రాష్ట్రంలో ఏటా 5 వేల మందికి క్వాంటం టెక్నాల‌జీలో శిక్ష‌ణ ఇవ్వాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని రాష్ట్ర ఐటీ, ఆర్టీజీ శాఖ కార్య‌ద‌ర్శి భాస్క‌ర్ కాటంనేని తెలిపారు.

అమరావతి: రాష్ట్రంలో ఏటా 5 వేల మందికి క్వాంటం టెక్నాల‌జీలో శిక్ష‌ణ ఇవ్వాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని రాష్ట్ర ఐటీ, ఆర్టీజీ శాఖ కార్య‌ద‌ర్శి భాస్క‌ర్ కాటంనేని తెలిపారు. ఇంజినీరింగ్ విద్యార్థులు, విద్యార్థులు యువ‌త‌కు అమ‌రావ‌తి క్వాంటం అకాడ‌మీ ద్వారా 2030కి ఈ శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌నేది ల‌క్ష్య‌మ‌ని చెప్పారు. ఐటీ రంగంలో పెట్టుబ‌డుల గురించి ఆయ‌న క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో బుధవారం ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ద్వారా వివ‌రించారు. అమ‌రావ‌తి క్వాంటం వ్యాలీకి సంబంధించి ఇప్ప‌టికే రూ.2,847 కోట్ల పెట్టుబ‌డుల‌కు 29 అవ‌గాహ‌న ఒప్పందాలు కుదుర్చుకున్నామ‌న్నారు.

క్వాంటం కంప్యూట‌ర్ల‌కు సంబంధించి హార్డ్ వేర్ సంస్థ‌లు కూడా పెద్దఎత్తున పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ముందుకు వ‌స్తున్నాయ‌న్ని చెప్పారు. దీనికోసం మ‌రో 200 ఎక‌రాల అవ‌స‌రం అవుతుంద‌ని, అమ‌రావ‌తి రాజ‌ధాని అనుసంధానంగా ఈ భూమి సేక‌రించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌ని చెప్పారు. 2026లో ఐబీఎం నుంచి రెండు క్వాంటం కంప్యూట‌ర్లు ఏర్పాటు చేయ‌నున్నామ‌ని చెప్పారు. క్వాంటం వ్యాలీ భ‌వ‌న నిర్మాణాన్ని కూడా త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేసేలా ప‌నిచేస్తున్నామ‌ని చెప్పారు. 2030కి 6.5 గిగావాట్ డేటా సామ‌ర్థ్యంతో కూడిన డేటా సెంట‌ర్లు ఏర్పాటు చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌ని చేస్తున్నామ‌న్నారు. గూగుల్ కాకుండా మిగిలిన ఇత‌ర సంస్థ‌లు కూడా రాష్ట్రంలో డేటా సెంట‌ర్లు ఏర్పాటు చేయ‌డానికి ముందుకు వ‌స్తున్నాయ‌ని చెప్పారు. రూ.2,97,707 కోట్ల పెట్టుబ‌డుల‌తో డేటా సెంట‌ర్లు ఏర్పాటు చేయ‌డానికి ప‌లు సంస్థ‌లు ముందుకొచ్చాయ‌ని, వీటికి సంబంధించి భూ సేక‌ర‌ణ వేగ‌వంతం చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ల‌ను కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories