Modi Cabinet 3.0: తెలుగు రాష్ట్రాల కేంద్ర మంత్రుల ప్రస్థానమిది

5 MPs From Telugu States Get Union Minister Post
x

Modi Cabinet 3.0: తెలుగు రాష్ట్రాల కేంద్ర మంత్రుల ప్రస్థానమిది

Highlights

Modi Cabinet 3.0: కేంద్రంలో బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ కూటమి సర్కారులో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోటు దక్కింది.

Modi Cabinet 3.0: కేంద్రంలో బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ కూటమి సర్కారులో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోటు దక్కింది. తెలంగాణ నుంచి ఇద్దరు బీజేపీ ఎంపీలతో పాటు ఏపీకి చెందిన ముగ్గురు ఎంపీలకు కేంద్ర మంత్రివర్గంలో అవకాశం లభించింది. వీరిలో ఇద్దరు తెలుగుదేశం పార్టీ ఎంపీలు కాగా, మరొకరు బీజేపీ ఎంపీ ఉన్నారు. సికింద్రాబాద్ నుంచి గెలుపొందిన కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి ఎన్నికైన బండి సంజయ్, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌, నర్సాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాస వర్మలు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రామ్మోహన్‌ నాయుడుకు కేబినెట్‌ హోదా మంత్రిగా, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌కు సహాయ మంత్రిగా హోదా దక్కింది. కిషన్ రెడ్డి మినహా మిగతా వారంతా తొలిసారిగా కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు.

తెలంగాణ నుంచి ఇద్దరు బీజేపీ నేతలకు కేంద్ర మంత్రివర్గంలో ఛాన్స్ దక్కింది. బీజేపీలో ఒక సాధారణ యువనాయకుడిగా ప్రవేశించి కేంద్ర మంత్రిగా ఎదిగారు. సికింద్రాబాద్ నుంచి వరుసగా రెండోసారి విజయం సాధించిన కిషన్ రెడ్డి మూడోసారి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019లో మొదటిసారిగా గెలుపొందిన కిషన్ రెడ్డి.. మొదటిసారిగా హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2019 నుంచి 2021 వరకు ఈ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత 2021 నుంచి స్వతంత్ర హోదాలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పని చేశారు. 2023లో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అద్యక్ష బాధ్యతలు చేపట్టారు. 2024లోనూ రెండో కేంద్ర మంత్రిపదవిలో కొనసాగారు. మరోసారి సికిందారాబాద్ లోక్ సభ స్థానం నుచి పోటీ చేసి అత్యధిక మెజార్టీతో రెండో సారి గెలుపొందారు.

జయప్రకాశ్ నారాయణ స్ఫూర్తితో జనతా పార్టీ యువకార్యకర్తగా 1977లో రాజకీయ రంగప్రవేశం చేశారు కిషన్ రెడ్డి. 1980 నుంచి 81 వరకు బీజేవైఎం రంగారెడ్డి జిల్లా కమిటీ కన్వీనర్ గా పని చేశారు. 1982 నుంచి 83 వరరకు బీజేవైఎం కోశాధికారిగా పని చేశారు. 1986 నుంచి 1990 వరు బీజేవైఎం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఐదు సంవత్సరాలు బాధ్యతలు నిర్వర్తించారు. 1990 నుంచి 1992 వరకు బీజేవైఎం అఖిల భారత కార్యదర్శిగా పని చేశారు. 1992 నుంచి 1994 వరకు జాతీయ ఉపాధ్యక్షునిగా.. 1994 నుంచి 2001 వరకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 2001 నుంచి 2002 వరకు బీజేపీ రాష్ట్ర కోశాధికారిగా పని చేశారు. 2002లో భారతీయ జనతా యువరమోర్చా జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యార. 2003 నుంచి 2005 వరకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 2004లో తొలిసారిగా హిమాయత్ నగర్ శాసనసభ స్థానం నుంచి గెలుపొంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009, 2014లో అంబర్ పేట నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2010 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు. 2014 నుంచి 2016 వరకు తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా సేవలు అందించారు. 2018 లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి పోయారు.

బండి సంజయ్ 2019 ఎన్నికల్లో తొలిసారిగా కరీంనగర్ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికల్లో రెండో సారి ఎంపీగా విజయం సాధించిన ఆయనకు కేంద్ర సహాయ మంత్రి పదవి లభించింది. 1971లో కరీంనగర్ లో జన్మించిన బండి సంజయ్.. బాల్యం నుంచే ఆర్ఎస్ఎస్ లో సేవకుడిగా పని చేశారు. ఏబీవీపీ కరీంనగర్ పట్టణ కన్వీనర్ గా, పట్టణ ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పని చేశారు. కరీంనగర్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లో రెండు పర్యాయాలు డైరెక్టర్ గా పని చేశారు. ఎల్.కే. అద్వానీ చేపట్టిన రథయాత్రలో వెహికిల్ ఇంచార్జీగా బాధ్యతలు నిర్వర్తించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పడిన తర్వాత బీజేపీ కార్పోరేటర్ గా విజయం సాధించారు. రెండు పర్యాయాలు కరీంనగర్ బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. 2019 ఓబీసీ వెల్ఫేర్ పార్లమెంట్ కమిటీ మెంబర్, అర్బన్ డెవలప్ మెంట్ పార్లమెంట్ కమిటీ మెంబర్, టొబాకో బోర్డు మెంబర్ గా నియామకం అయ్యారు. క్రమంగా ఎదుగుతూ 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందారు. 2020లో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఆయనను తప్పించి కిషన్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. అనంతరం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా 2.25 లక్షల ఓట్ల మెజార్టీతో రెండోసారి విజయం సాధించారు. తొలిసారిగా కేంద్రమంత్రిగా సేవలందించనున్నారు బండి సంజయ్.

శ్రీకాకుళం ఎంపీగా మూడోసారి గెలుపొందిన టీడీపీ నేత కింజారపు రామ్మోహన్ నాయుడు కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీ వ్యవస్థాపక నేతల్లో ఒకరైన ఎర్రంనాయుడు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడు వరుసగా మూడో సారి శ్రీకాకుళం ఎంపీగా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో రామ్మోహన్ నాయుడు జన్మించారు. ప్రస్తుతం ఆయన వయస్సు 36 సంవత్సరాలు. తెలుగు, హింది, ఇంగ్లీష్ భాషల్లో రామ్మోహన్ నాయుడుకు మంచి ప్రావిణ్యం ఉంది.

గుంటూరు లోక్ సభ స్థానం నుంచి గెలుపొందిన పెమ్మసాని చంద్రశేఖర్ రావుకు కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కింది. గుంటూరు జిల్లా బుర్రిపాలెం నుంచి అమెరికా వెళ్లి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల బరిలో మూ లక్షల 44 వేల 695 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన పెమ్మసాని చంద్రశేఖర్... కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రశేఖర్ తండ్రి సాంబశివరావు టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వ్యాపార రిత్యా నరసరావుపేటలో స్థిరపడ్డారు.

చంద్రశేఖర్ ఎంసెట్ లో 27వ ర్యాంకు సాధించి ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించారు. పీజీ చదివేందుకు అమెరికా వెళ్లిన ఆయన అక్కడ యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ పూర్తి చేయడంలో వసతి, శిక్షణకు అధిక వ్యయ భారం వంటి సమస్యలను ఎదుర్కొన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో జనరల్ గైసింగర్ వైద్య కేంద్రం నుంచి అత్యధిక మార్కులు సాధించి సత్తా చాటారు. అమెరికాలో లైసెన్సింగ్‌ ఎగ్జామ్స్‌కు హాజరయ్యే విద్యార్థుల కోసం యూ వరల్డ్‌ పేరుతో ఆన్‌లైన్‌ శిక్షణ సంస్థను స్థాపించారు. స్వల్ప వ్యయంతో వారికి శిక్షణ అందించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ సంస్థ తర్వాత వివిధ కోర్సుల్లో పరీక్షలకు ఆన్‌లైన్‌ శిక్షణ ఇస్తూ అతికొద్దికాలంలోనే రూ.వేల కోట్లకు ఎదిగింది. అమెరికాలోని డాలస్‌లో పెమ్మసాని ఫౌండేషన్‌ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించారు. టీడీపీతో అనుబంధం ఉన్న చంద్రశేఖర్ ఎన్నారై విభాగం తరపున క్రియాశీలకంగా వ్యవహరించారు.

ఇక పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నుంచి ఎంపీగా గెలుపొందిన భూపతి రాజు శ్రీనివాసవర్మకు సహాయ మంత్రి హోదా లభించింది. కార్యకర్త స్థాయి నుంచి ఎదిగిన శ్రీనివాసవర్మ పార్లమెంట్ కు తొలిసారిగా ఎన్నికయ్యారు. 1991 నుంచి 95 వరకు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా, 1995 నుంచి 97 వరకు భీమవరం పట్టణ అధ్యక్షుడిగా పని చేశారు. 1997 నుంచి 99 వరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ కార్యదర్శిగా పనిచేసిన ఆయన, 1999 నుంచి 2001 వరకు నరసాపురం పార్లమెంట్ కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2001 నుంచి 2003 వరకు జాతీయ కార్యవర్గ సభ్యులుగా పని చేశారు. 2003 నుంచి 2009 వరకు బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీగా పని చేసిన వర్మ... 2009లో బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేశారు. 2010 నుంచి 2018 వరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా, 2018 - 2020లో జిల్లా ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. 2020 నుంచి 23 వరకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా పని చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories